BC leaders: కులగణన వెంటనే చేపట్టాలి..
ABN , Publish Date - Sep 30 , 2024 | 03:57 AM
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే.. తక్షణమే కులగణన చేపట్టాలని, దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేతలు, మేధావులు డిమాండ్ చేశారు.
దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి
మార్గదర్శకాలపై ఇంకా జాప్యమెందుకు?
సదస్సులో బీసీ నేతలు, మేధావులు
రెడ్లు, ఓసీల ఓట్లు నాకు అవసరం లేదు
2028లో బీసీనే సీఎం: తీన్మార్ మల్లన్న
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే.. తక్షణమే కులగణన చేపట్టాలని, దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేతలు, మేధావులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కులగణన చేపడతామంటూనే జాప్యం చేస్తోందని, దీంతో వారి చిత్తశుద్ధిని శంకి ంచాల్సి వస్తోందని అన్నారు. బీసీ కమిషన్‌కు మార్గదర్శకాలు ఇవ్వడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హాటల్‌లో తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగుల సమాఖ్య, పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ (పీసీసీసీ) సంయుక్తంగా ‘కులగణన’ అంశంపై మేధావులు, బీసీ నేతలతో సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. బీసీ గణనతో రానున్న రోజుల్లో ఆ కులాల్లో మరింత ఐక్యత వస్తుందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కష్టపడి పనిచేస్తే.. పదవులు మాత్రం అగ్రవర్ణాల వారు అనుభవిస్తున్నారని తెలిపారు. వారిని అధికారం నుంచి దించడం అంత తేలిక కాదని, అట్టడుగు స్థాయి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏకమైతేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైౖర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో సామాజిక కులగణన కోసం ప్రయత్నం జరిగిందని, దీనికోసం రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. దాని ప్రకారం 52 శాతం బీసీలు ఉన్నట్లు తేలిందన్నారు. అయితే ఇందులో అనేక తప్పులున్నాయంటూ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చే సిందని చెప్పారు. కానీ, కమిటీకి నిధులు, విధులు ఇవ్వకపోవడంతో ఆ లెక్కలు అలాగే మరుగున పడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కులగణన చేసే ఉద్దేశం కనిపించడం లేదని, ఈ పరిస్థితిలో మార్పు వచ్చేందుకు బీసీ సంఘాలు, మేధావులు ఏకతాటిపై నిలిచి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
రాజకీయాలను శాసించనున్న బీసీలు..
తెలంగాణకు రేవంత్‌రెడ్డే చివరి ఓసీ సీఎం అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. 2028లో బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారన్నారు. తెలంగాణ రాజకీయాలను బీసీలు శాసించబోతున్నారని చెప్పారు. తనకు రెడ్లు, ఓసీల ఓట్లు వద్దని, బీసీల ఓట్లు చాలునని అన్నారు. ఓసీ నేతలు ఈ మాట చెప్పగలరా? అని సవాల్ విసిరారు. బీసీ ఉద్యోగులపై కొందరు ఆధిపత్య కులాలకు చెందిన అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఏసీబీకి పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కులగణన చేయడంతోపాటు రిజర్వేషన్లలో బీసీలకు 42శాతం వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణులు, వైశ్యుల్లోని పేదలు కూడా బీసీలతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. దేవళ్ళ సమ్మయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ కన్వీనర్ అనిల్ జైహింద్, ప్రొఫెసర్లు పీఎల్ విశ్వేశ్వరరావు, సింహాద్రి, తిరుమలి, మురళీమనోహర్, తదితరులు కులగణన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.