Share News

Colleges: ప్రముఖ కాలేజీల్లో డ్రగ్స్‌..

ABN , Publish Date - Jul 23 , 2024 | 04:46 AM

రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీలు డ్రగ్స్‌కు అడ్డాగా మారుతున్నాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారు. హైదరాబాద్‌తోపాటు.. పలు జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది.

Colleges: ప్రముఖ కాలేజీల్లో డ్రగ్స్‌..

  • టీజీ న్యాబ్‌కు దొరికిన విద్యార్థులు.. హైదరాబాద్‌, పలు జిల్లాల్లో గుర్తింపు

  • బాసర ట్రిపుల్‌-ఐటీకి గంజాయి బెడద

  • నాందేడ్‌ నుంచి యథేచ్ఛగా సరఫరా

  • జాబితాలో గురునానక్‌, కలనరీ, సీబీఐటీ.. ఇండస్‌, జోగిపేట జేఎన్‌టీయూ కాలేజీలు

  • పట్టుబడ్డ వారిలో ఉస్మానియా వైద్యులు

  • వారిపై చర్యలకు ఎంసీఐకి లేఖలు

  • టీజీ న్యాబ్‌ చీఫ్‌ సందీప్‌ శాండిల్య

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీలు డ్రగ్స్‌కు అడ్డాగా మారుతున్నాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారు. హైదరాబాద్‌తోపాటు.. పలు జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌) వరుస దాడుల్లో విస్తుబోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో.. ఇకపై కార్పొరేట్‌, ప్రముఖ స్కూళ్లలోనూ డ్రగ్స్‌ను పసిగట్టే శునకాలతో తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు టీజీ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. కొన్ని రోజులుగా టెక్నికల్‌/హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌, ఇతర మార్గాల్లో సమాచారం సేకరించి, పలు కాలేజీలు, పబ్బులు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు ఆయన వివరించారు. ‘‘ఇంత కాలం డ్రగ్స్‌ దొరికిన కాలేజీల పేర్లను గోప్యంగా పెట్టాం. కాలేజీల్లో యాంటీ డ్రగ్స్‌ కమిటీ(ఏడీసీ)లను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ వస్తున్నాం. టీజీ న్యాబ్‌ ఏర్పాటై ఏడాది కావొస్తున్నా.. కాలేజీల యాజమాన్యాల్లో దిద్దుబాటు చర్యలు లేకపోవడంతో వాటి పేర్లను బయట పెడుతున్నాం’’ అని ఆయన వెల్లడించారు.


ఈ కాలేజీల్లోనే..

సింబయోసిస్‌ కాలేజీల్లో 25 మంది విద్యార్థులు డ్రగ్స్‌, గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని, వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, తల్లిదండ్రులకు సమాచారం అందజేశామని సందీప్‌ శాండిల్య వివరించారు. ‘‘గురునానక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో 15 మంది విద్యార్థులు, కుందన్‌బాగ్‌లోని కలినరీ అకాడమీ ఆఫ్‌ ఇండియాలో నలుగురు, చైతన్య భారతీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(సీబీఐటీ)లో ఒక విద్యార్థికి డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చింది. బాసర ట్రిపుల్‌-ఐటీలో కొందరు విద్యార్థులు గంజాయి, ఇతర మత్తుపదార్థాలతో పట్టుబడ్డారు. అయితే.. ట్రిపుల్‌-ఐటీకి మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించి, ఆ లింకులను కట్‌ చేశాం. జోగిపేట జేఎన్‌టీయూలో ముగ్గురు గంజాయి, ఇతర మత్తుపదార్థాలతో చిక్కారు. ఇండస్‌ స్కూల్‌, సీబీఐటీలో ఈ-సిగరెట్లను విక్రయిస్తున్న జాఫర్‌, అహ్మద్‌ అనే వ్యక్తులను అరెస్టు చేశాం. ఇంతకాలం విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా కాలేజీల పేర్లను గోప్యంగా పెట్టాం’’ అని ఆయన వెల్లడించారు. కాగా.. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో ఆరుగురు వైద్యులు కూడా మాదకద్రవ్యాలను సేవిస్తూ పట్టుబడ్డారని, వారిపై తదుపరి చర్యల కోసం భారత వైద్య మండలి(ఎంసీఐ)కి లేఖ రాసినట్లు టీజీ న్యాబ్‌ అధికారులు తెలిపారు.

Updated Date - Jul 23 , 2024 | 04:46 AM