Share News

Yadagirigutta: యాదగిరి ప్రదక్షిణ గుట్టపై నమో నారసింహా!

ABN , Publish Date - Jul 16 , 2024 | 02:55 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సుమారు 8వేల మంది భక్తులు గిరిప్రదక్షిణలో భాగస్వామ్యులయ్యారు.

Yadagirigutta: యాదగిరి ప్రదక్షిణ గుట్టపై నమో నారసింహా!

  • రెండున్నర కి.మీ. మేర 45 నిమిషాలు..

  • జయజయ ధ్వానాలతో భక్తుల గిరి ప్రదక్షిణ

  • తొలిరోజు 8 వేల మంది పైగా హాజరు

  • లక్ష్మీనృసింహుడికి ప్రత్యేక పూజలు

  • వేద పాఠశాలలో వనమహోత్సవం

  • 8వేల మంది హాజరు..

  • ప్రారంభించిన విప్‌ ఐలయ్య

భువనగిరి అర్బన్‌, జూలై 15: యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సుమారు 8వేల మంది భక్తులు గిరిప్రదక్షిణలో భాగస్వామ్యులయ్యారు. వేకువజాము నాలుగు గంటల నుంచే కొందరు భక్తులు ప్రదక్షిణ చేపట్టగా, అధికారికంగా ఉదయం 6.05 గంటలకు వైకుంఠద్వారం వద్ద పూజల అనంతరం ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఈవో భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి గిరిప్రదక్షిణను ప్రారంభించారు. కొండ చుట్టూ సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర 45నిమిషాల పాటు సాగిన ప్రదక్షిణలో నమో నారసింహ అంటూ భక్తులు జయజయ ధ్వానాలు చేశారు.


వేకువజామున ఆలయంలో స్వాతి నక్షత్ర పూజల్లో భాగంగా అర్చకులు శతఘటాభిషేకం నిర్వహించారు. కాగా, గిరిప్రదక్షిణతోపాటు వనమహోత్సవంలోనూ భక్తులు మమేకమయ్యారు. వ్రత మండపం, మల్లాపురం గోశాల, వేద పాఠశాల ప్రాంగణంలో వందలాది మంది మొక్కలు నాటారు. కొండపైన ప్రొటోకాల్‌ కార్యాలయం ఎదురుగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు, వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు మొక్కలు నాటారు. అనంతరం వారు లక్ష్మీనృసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2024 | 02:55 AM