Share News

Flood Levels: జోరు తగ్గిన వరద..

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:11 AM

కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల గేట్లన్నీ మూసివేశారు.

Flood Levels: జోరు తగ్గిన వరద..

  • శ్రీశైలం, సాగర్‌, పులిచింతల గేట్లన్నీ మూసివేత.. గోదావరి ప్రాజెక్టులకు నిలకడగా వరద

హైదరాబాద్‌, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల గేట్లన్నీ మూసివేశారు. మరో పక్క గోదావరి ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం నిలకడగా ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను.. 210.99 టీఎంసీల మేర నిల్వ ఉంది. నాగార్జున సాగర్‌లోకి 1,11,265 క్యూసెక్కులు వస్తుండగా.. ప్రాజెక్టు గేట్లు పూర్తిగా మూసివేసి నీటి విడుదల ఆపేశారు. విద్యుదుత్పత్తి ద్వారా 60 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రవాహం గణనీయంగా తగ్గిపోవడంతో పులిచింతల ప్రాజెక్టు గేట్లను కూడా మూసివేశారు. మరోవైపు, సింగూరు ప్రాజెక్టుకు 44 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.


ఈ ప్రాజెక్టు సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా... 25.89 టీఎంసీల నిల్వ ఉంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 28 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా... 15.81 టీఎంసీల నిల్వ ఉంది. దాంతో లోతట్టు ప్రాంతాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఏక్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇక శ్రీరామ్‌సాగర్‌కు 3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 3.85 లక్షలను దిగువకు వదులుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3.39 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 2.40 లక్షలను దిగువకు వదిలేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మిడ్‌ మానేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 2.688 టీఎంసీల నీరు నిల్వ ఉంది. లోయర్‌ మానేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 18 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. ఇక, నల్లగొండ జిల్లా సరిహద్దులోని డిండి ప్రాజెక్టుకు దుందుభివాగు నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఓ గేటును అధికారులు బుధవారం ఎత్తివేసి.. దిగువకు నీటిని విడుదల చేశారు.


  • ఏడు గేట్ల నుంచి దిగువకు మూసీ నీటి విడుదల....

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుకు వరద పోటు కొనసాగుతోంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు(4.46 టీఎంసీలు)అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 642.20అడుగులుగా(3.74 టీఎంసీలు) నమోదైంది. మరోవైపు, హైదరాబాద్‌ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ నదీలోకి భారీగా వరదనీరు చేరుతోంది. కాగా, ఎగువన కురిసిన బారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Updated Date - Sep 05 , 2024 | 03:11 AM