Gurukula Schools: పాత ఫ్యాకల్టీని తీసుకునేలా పోరాడుతాం
ABN , Publish Date - Sep 07 , 2024 | 03:28 AM
గురుకుల పాఠశాలల్లో పాత ఫ్యాకల్టీని ప్రభుత్వం తిరిగి తీసుకునేలా తాము పోరాడుతామని.. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి,
గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థులకు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రుల భరోసా
రాయదుర్గం, సెప్టెంబర్6(ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాలల్లో పాత ఫ్యాకల్టీని ప్రభుత్వం తిరిగి తీసుకునేలా తాము పోరాడుతామని.. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి, గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. గురువారం వారు గౌలిదొడ్డిలోని బాల, బాలికల ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలను సందర్శించి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ కళాశాలలో ఉపాధ్యాయులను ఉన్నపళంగా తొలగించారని.. కొత్త ఫ్యాకల్టీ చెప్పే పాఠాలు అర్థం కావడానికి కొంత సమయం పట్టేలా ఉందని విద్యార్థులు వారికి తెలిపారు. పోటీ పరీక్షల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమస్య తమకు ఆందోళన కలిగిస్తోందని వాపోయారు.
తమ విద్యా సంవత్సరం పూర్తయ్యేదాకా కొత్త వారితో పాటు పాత వారిని కొనసాగిస్తే తమకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రులు.. దశాబ్ద కాలంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారు మంచి ర్యాంకులు సాధించేలా కృషి చేసిన ఉపాద్యాయులను ఒక్క సంతకంతో రాత్రికి రాత్రి తొలగించడమంటే విద్యార్థుల భవిషత్తును అంధకారం చేయడమేనని మండిపడ్డారు. గురుకుల పాఠశాల వ్యవస్థనే ఈ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మారుస్తోందన్నారు. విద్యార్థులంతా మెచ్యూరిటీతో మాట్లాడుతున్నారని.. వారిని చూసైనా ముఖ్యమంత్రి, మంత్రులు బుద్ధి తెచ్చుకోవాలని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. వారితో వారానికి ఒకసారైనా ఇంటరాక్ట్ అయితే సీఎంకు, మంత్రులకు జ్ఞానం పెరుగుతుందన్నారు. పేద విద్యార్థుల విద్యాలయాలపై ఈగకూడా వాలకుండా చూద్దామని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.