Share News

Yadagirigutta: యాదాద్రిలో వాహనాల కిటకిట..

ABN , Publish Date - May 20 , 2024 | 04:18 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఆదివారం ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. వారాంతపు సెలవు రోజు, వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. చాలా మంది భక్తులు తమ సొంతవాహనాల్లో తరలివచ్చారు. దీంతో యాదగిరిగుట్ట కొండ మీద, కొండ కింద పార్కింగ్‌ ప్రదేశాలు వాహనాలతో కిటకిటలాడాయి.

Yadagirigutta: యాదాద్రిలో వాహనాల కిటకిట..

  • కొండపైన 2,000, కింద 1500కు పైగా వాహనాల పార్కింగ్‌.. లక్ష్మీనృసింహుని దర్శనానికి పోటెత్తిన జనం

  • 60వేల మందికి పైగా భక్తుల రాక.. స్వామి వారి ఖజానాకు రూ.85,33,262 .. నేటి నుంచి జయంత్యుత్సవాలు

భువనగిరి అర్బన్‌, మే 19: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఆదివారం ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. వారాంతపు సెలవు రోజు, వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. చాలా మంది భక్తులు తమ సొంతవాహనాల్లో తరలివచ్చారు. దీంతో యాదగిరిగుట్ట కొండ మీద, కొండ కింద పార్కింగ్‌ ప్రదేశాలు వాహనాలతో కిటకిటలాడాయి. సుమారు రెండు వేల వాహనాలు కొండ మీదకు వెళ్లాయి. కొండ మీదకు వెళ్లే వాహనం ఒక్కో దానికి రూ.500 టికెట్‌ తీసుకుంటారు. ఈ టికెట్ల రూపంలోనే రూ.10 లక్షల ఆదాయం సమకూరింది. ఇక, కొండ కింది పార్కింగ్‌ ప్రదేశంలో సుమారు 1500 వాహనాలు నిలిపి ఉంచారు. ఆదివారం యాదగిరిగుట్టలో పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.


ఆలయ అధికారుల లెక్కల ప్రకారం 60వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి మూడు గంటలు, వీఐపీ దర్శనానికి రెండు గంటలు పట్టింది. క్యూలెన్లలో సరైన సదుపాయాలు లేక భక్తులు అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బ్రేక్‌(4గంటల నుంచి ఐదు గంటల వరకు) దర్శనాన్ని రద్దు చేశారు. సాయంత్రం 15 నిమిషాల పాటు కురిసిన వర్షం వల్ల భక్తులు మరింత ఇబ్బంది పడ్డారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.85,33,262 నిత్య ఆదాయంగా సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు. కాగా, యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయంలో ఆదివారం స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. స్వాతి నక్షత్రం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. ఇక, సోమవారం నుంచి లక్ష్మీనృసింహస్వామివారి జయంత్యుత్సవాలు ప్రారంభంకానున్నాయి.


హైదరాబాద్‌ హైవేపై ట్రాఫిక్‌జామ్‌

బీబీనగర్‌: యాదగిరిగుట్ట, భువనగిరి స్వర్ణ దేవాలయాల సందర్శనకు ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో హైదరాబాద్‌-బీబీనగర్‌ జాతీయ రహదారి 163 రద్దీగా మారింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్‌ వైపు ఆదివారం రాత్రి కిలోమీటరు మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ జామ్‌లో వాహనదారులు గంటసేపు పైగా అవస్థ పడ్డారు.

Updated Date - May 20 , 2024 | 04:18 AM