Share News

Hyderabad: వైద్య రిపోర్టులు ఆన్‌లైన్‌లో..

ABN , Publish Date - Jul 01 , 2024 | 03:37 AM

రోగులకు రేవంత్‌ సర్కారు శుభవార్త చెప్పింది. సర్కారీ దవాఖానల్లో చేయించుకునే పరీక్షల రిపోర్టులన్నీ ఇకపై ఆన్‌లైన్‌లో అందించాలని నిర్ణయించింది. వైద్య పరీక్షల రిపోర్టుల సమాచారాన్ని రోగి సెల్‌ఫోన్‌కే పంపనుంది.

Hyderabad: వైద్య రిపోర్టులు ఆన్‌లైన్‌లో..

  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇకపై అమలుకు నిర్ణయం

  • రోగుల ఫోన్లకు మెసేజ్‌లు.. 2 జిల్లాల్లో పైలెట్‌గా..

  • తర్వాత దశలవారీగా రాష్ట్రమంతటా వర్తింపు

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రోగులకు రేవంత్‌ సర్కారు శుభవార్త చెప్పింది. సర్కారీ దవాఖానల్లో చేయించుకునే పరీక్షల రిపోర్టులన్నీ ఇకపై ఆన్‌లైన్‌లో అందించాలని నిర్ణయించింది. వైద్య పరీక్షల రిపోర్టుల సమాచారాన్ని రోగి సెల్‌ఫోన్‌కే పంపనుంది. ప్రస్తుతం ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయనున్నారు. అనంతరం దశలవారీగా రాష్ట్రమంతటా అమలు చేస్తారు. ఇప్పటిదాకా కేవలం తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో చేయించుకునే పరీక్షలకే ఆన్‌లైన్‌ రిపోర్టులు వస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకునే రోగులు అక్కడికెళ్లి రిపోర్టులను తీసుకోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు సకాలంలో రిపోర్టులు ఇచ్చేవారు కాదు.

11.jpg


ఒకే గొడుగు కిందకు..

ప్రస్తుతం సర్కారీ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ల్యాబ్‌లు ఉన్నాయి. జిల్లా ఆస్పత్రుల ప్రాంగణాల్లో తెలంగాణ డయాగ్నస్టిక్‌ హబ్‌లు కూడా ఉన్నాయి. ఇవి రాష్ట్రవ్యాప్తంగా 36 ఉన్నాయి. వీటిలో కొన్నింట్లో 57 రకాల పరీక్షలు చేస్తుండగా, మరికొన్నింట్లో 134 టెస్టులు చేస్తున్నారు. ఇక అత్యవసర సందర్భాల్లో చేసే టెస్టులు వేరేగా ఉంటున్నాయి. జిల్లా ఆస్పత్రులు ఐసీటీసీ, ఐడీఎస్పీ, టీబీల్యాబ్‌లతో పాటు బ్లడ్‌ బ్యాంకులు ఉంటాయి. ఈ ల్యాబ్‌ల్లో వేర్వేరుగా సిబ్బంది ఉన్నారు. ఆ విభాగాలకు సంబంధించిన రోగులకు టెస్టులు చేస్తున్నారు. దీంతో సిబ్బంది కొన్నిసార్లు ఖాళీగా ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ల్యాబ్‌లన్నింటినీ ఒకే గొడుగు కిందకు అంటే టీ డయాగ్నస్టిక్‌ హబ్‌ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆ ల్యాబ్‌ల్లో ఉండే సిబ్బంది అందరి సేవలను ఒకేచోట వాడుకునే వెసులుబాటు కలుగుతుంది.


అలాగే సర్కారీ ఆస్పత్రుల్లో ఎటువంటి టెస్టులు చేయించుకున్నా మెసేజ్‌ రూపంలో ఆన్‌లైన్‌ రిపోర్టులు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు కేవలం డయాగ్నస్టిక్‌ హబ్‌లో చేయించుకున్న పరీక్షలకే ఆన్‌లైన్‌ రిపోర్టులిస్తున్నారు. ఇకపై అన్ని రకాల రిపోర్టులు ఆన్‌లైన్‌ ద్వారా పంపుతారు. పైలెట్‌ ప్రాజెక్టుగా ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల్లో దీన్ని అమలు చేయనున్నారు. అనంతరం దశలవారీగా రాష్ట్రమంతటా అమలు చేస్తామని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌లో వైద్యవిద్య సంచాలకుల పరిఽధిలో ఉన్న గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌ లాంటి పెద్దాస్పత్రుల్లో ఓపీ రోగులు చేయించుకునే పరీక్షలకు ఆన్‌లైన్‌ రిపోర్టు రావడం లేదు. ఇదే పరిస్థితి వరంగల్‌ ఎంజీఎంలోనూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా టీ డయ్నాగస్టిక్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగించి, రోగుల పరీక్షల రిపోర్టులను ఆన్‌లైన్‌ ద్వారా అందించాలని డీఎంఈ డాక్టర్‌ వాణి ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో వైద్య ఆరోగ్యశాఖ ఆ దిశగా కసరత్తు చేస్తోంది.


డయాగ్నస్టిక్‌ హబ్‌తో 1.1 కోట్ల మందికి లబ్ధి

టీ డయాగ్నస్టిక్స్‌ను 2018లో ప్రారంభించారు. నాణ్యమైన డయాగ్నస్టిక్‌ సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. రక్త, మూత్ర, ఎక్స్‌రే, అలా్ట్రసౌండ్‌, ఈసీజీ లాంటి పరీక్షలన్నీ ఉచితంగా చేస్తున్నారు. ప్రతినెలా సగటున 11.39 లక్షల టెస్టులు చేస్తున్నారు. 24 గంటల వ్యవధిలోనే 92 శాతం రిపోర్టులను ఆన్‌లైన్‌ ద్వారా రోగుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో పంపుతున్నారు. వీటిని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు సర్కారు మొత్తం రూ.360 కోట్లు ఖర్చు పెట్టింది. మొత్తం 1.1 కోట్ల మంది లబ్ధి పొందారు. ఇవే టెస్టులను ప్రైవేటులో చేయించుకుంటే వాటి విలువ రూ.1018 కోట్లు ఉంటుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jul 01 , 2024 | 03:37 AM