Flooding: కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ పెరిగిన వరద
ABN , Publish Date - Sep 07 , 2024 | 04:03 AM
కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాలకు మళ్లీ వరదలు ప్రారంభమయ్యాయి. దాంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.
‘సాగర్’కు 2,34,707 క్యూసెక్కులు.. ఇరవై గేట్ల నుంచి నీటి విడుదల
గరిష్ఠ నీటిమట్టం దిశగా ‘మూసీ’.. ‘పులిచింతల’ 4 గేట్లు ఎత్తివేత
ఏడుపాయల్లో పోటెత్తిన మంజీర.. నవంబరు దాకా ప్రాజెక్టులకు వరదలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్) : కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాలకు మళ్లీ వరదలు ప్రారంభమయ్యాయి. దాంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, సుంకేశుల, శ్రీశైలం, నాగార్జునసాగర్.. ఇలా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం ప్రారంభించారు. వరద రాకకు అనుగుణంగా గేట్ల సంఖ్యను పెంచుతూ సాయంత్రానికి 20గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5050) కాగా, శుక్రవారం సాయంత్రానికి 589.90 అడుగులతో (311.7412టీఎంసీలు) నిండు కుండలా ఉంది. 2,04,064 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక.. వారం రోజులుగా వరద నీటితో పొంగిపొర్లిన మూసీ నది శుక్రవారం కొంత నెమ్మదించింది. 645 అడుగుల (4.46 టీఎంసీలు) గరిష్ఠ నీటిమట్టం కలిగిన మూసీ జలాశయం శుక్రవారం సాయంత్రానికి 642.65 అడుగులకు (3.86 టీఎంసీలు)చేరింది.
అటు.. ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు నాలుగు గేట్లను మూడు మీటర్లమేర ఎత్తి 95,568 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు.. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2.75 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 2.44 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 78 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 28వేలుగా ఉంది. ఇక..సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో వనదుర్గా ప్రాజెక్టు నుంచి మంజీర నది పరవళ్లు తొక్కుతోంది. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్ద శుక్రవారం వరద ప్రవాహం మరింత పెరిగి ఆలయం ముందు నుంచి పరుగులు పెడుతోంది.