Share News

HYD : మరో 6 గ్రామాలువిలీనం!

ABN , Publish Date - Sep 04 , 2024 | 04:22 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మణిహారమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాలు సమీప పురపాలికల్లో విలీనం అయ్యాయి. దీంతో రేవంత్‌ సర్కారు తలపెట్టిన ‘మహా హైదరాబాద్‌’లో కీలక అడుగు పడినట్లయింది.

HYD : మరో 6 గ్రామాలువిలీనం!

  • ‘మహా హైదరాబాద్‌’లో మొత్తం 51 పంచాయతీలు

  • ఔటర్‌ను ఆనుకొని ఉన్న గ్రామాలను

  • సమీప మునిసిపాలిటీల్లో కలుపుతూ ఆర్డినెన్స్‌

  • త్వరలోనే ఈ పురపాలికలు జీహెచ్‌ఎంసీలోకి..

హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మణిహారమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాలు సమీప పురపాలికల్లో విలీనం అయ్యాయి. దీంతో రేవంత్‌ సర్కారు తలపెట్టిన ‘మహా హైదరాబాద్‌’లో కీలక అడుగు పడినట్లయింది. ఓఆర్‌ఆర్‌ను ఆనుకొని ఉన్న 51 గ్రామాలను సమీప మునిసిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. తొలుత 45 గ్రామాలను విలీనం చేయాలనుకున్నప్పటికీ ఈ ప్రక్రియపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం మరో 6 గ్రామాలను కలపాలని సూచించింది. ఫలితంగా మొత్తం 51 గ్రామాలను విలీనం చేశారు. కాగా, ఈ విషయమై ‘మహా హైదరాబాద్‌’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా, హైదరాబాద్‌ నగరం రోజురోజుకూ విస్తరిస్తూ పోతోంది. కోర్‌ హైదరాబాద్‌లోని ప్రాంతాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండగా శివారు ప్రాంతాల్లో వివిధ మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాలక్రమంలో ఇవి నగరంలో కలిసిపోయాయి.

కానీ, పౌర సేవలు మాత్రం వేర్వేరు సంస్థల నుంచి అందుతున్నాయి. సౌకర్యాల కల్పనలోనూ కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలో శివారులోని కొన్ని పురపాలికలు, గ్రామ పంచాయతీలను విలీనం చేసి నగర పరిధిని పెంచాలని సంకల్పించింది. ఓఆర్‌ఆర్‌ లోపల ఉండే ప్రాంతాలన్నింటినీ జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా) సహాయం తీసకుంది. విలీన ప్రక్రియపై అధ్యయనం చేసే బాధ్యత అప్పగించింది.


అదే సమయంలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లతో మునిసిపల్‌ శాఖ నేతృత్వంలో మరో కమిటీని నియమించి.. విలీన ప్రక్రియపై నివేదిక కోరింది. ఈ రెండు నివేదికలు ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా విస్తరించిన గ్రామాలతో పాటు జనాభా రీత్యా వీటితో సమానంగా ఉన్న కొన్ని ఓఆర్‌ఆర్‌ వెలుపలి గ్రామాలను కూడా విలీనం చేయాలని సూచించాయి. 45 గ్రామాల్ని సమీప మునిసిపాలిటీల్లో కలిపేయవచ్చని సూచించాయి. ఈ విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఆగస్టు 1న క్యాబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది.

Untitled-7 copy.jpg

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, దామోదర రాజనర్సింహ సభ్యులుగా కమిటీ ఏర్పడింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సబ్‌ కమిటీ ఆగస్టు 22న తన నివేదికను ఇచ్చింది. 45 గ్రామాలకు అదనంగా మరో 6 గ్రామాలను చేర్చాలని సిఫారసు చేసింది. దీంతో ప్రభుత్వం తెలంగాణ మునిసిపాలిటీల చట్టం, 2019కి సవరణ చేసి 51 గ్రామాలను మునిసిపాలిటీల్లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. త్వరలో ఇవి మరో చట్ట సవరణ ద్వారా జీహెచ్‌ఎంసీలో విలీనం అవుతాయి. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేనందున, విలీన ప్రక్రియకు గవర్నర్‌కు ఆమోదం తెలిపారు.

Updated Date - Sep 04 , 2024 | 04:34 AM