Share News

Hyderabad : ఎమ్మెల్యే యూటర్న్‌

ABN , Publish Date - Jul 31 , 2024 | 04:57 AM

అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. యూటర్న్‌ తీసుకున్నారు. తాను తిరిగి బీఆర్‌ఎ్‌సలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Hyderabad : ఎమ్మెల్యే యూటర్న్‌

  • తిరిగి బీఆర్‌ఎస్‌లోకి గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్‌రెడ్డి

  • కేటీఆర్‌ను కలిసి ‘ఘర్‌ వాపసీ’ ప్రకటన

  • అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు?

  • ప్రచారాన్ని ఖండించిన తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య

  • తిరిగి బీఆర్‌ఎ్‌సలోకి గద్వాల శాసనసభ్యుడు.. కేటీఆర్‌ను కలిసి.. ఘర్‌ వాపసీ ప్రకటన

  • బండ్ల బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు?

హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌/చేవెళ్ల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. యూటర్న్‌ తీసుకున్నారు. తాను తిరిగి బీఆర్‌ఎ్‌సలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత చాంబర్‌లో కలిశారు.

తాను మళ్లీ సొంత పార్టీలోనే కొనసాగుతానని ఆయనకు చెప్పారు. దీంతో కృష్ణమోహన్‌రెడ్డి తీసుకున్న ఘర్‌ వాపసీ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా.. 64 స్థానాలతో బొటాబొటి మెజారిటీ మాత్రమే సాధించడం, అధికారం కోల్పోయిన బీఆర్‌ఎ్‌సకు 39 సీట్లు దక్కడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు తెరతీయగా.. బీఆర్‌ఎస్‌ నుంచి ఒకరి తరువాత ఒకరుగా 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకున్నారు. దీంతో వీరిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ బీఆర్‌ఎస్‌ నాయకత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

అయితే మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వారిపై అనర్హత వేటు పడకుండా చూసుకోవాలని కాంగ్రెస్‌ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే మరికొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతుండగా.. గద్వాల ఎమ్మెల్యే సొంత గూటికి చేరుకొని అందరికీ షాకిచ్చారు.

దీంతో కాంగ్రె్‌సలో మరో తొమ్మిది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మిగిలారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు సొంత పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.


కాంగ్రె‌సలోనే కొనసాగుతాం..

బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి కాంగ్రె్‌సలో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి సొంత పార్టీలోకి వెళతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత కనిపిస్తే మాట్లాడానని, దానికే పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదని వెంకట్రావు అన్నారు. తాను మాత్రం కాంగ్రె్‌సలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

మరోవైపు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా తాను కాంగ్రె్‌సలోనే కొనసాగుతానని ప్రకటించారు. తిరిగి బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లే అవకాశం ఉందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం యాదయ్య ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. కాంగ్రె్‌సలోనే కొనసాగుతూ చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.


బండ్లకు స్థానిక నేతలతో పొసగనందునే..!

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి బీఆర్‌ఎ్‌సకు జైకొట్టడానికి ప్రధాన కారణం.. స్థానిక కాంగ్రెస్‌ నేతలతో పొసగకపోవడమేనని తెలుస్తోంది. వాస్తవానికి కృష్ణమోహన్‌రెడ్డి రాకను కాంగ్రెస్‌ తరఫున ఆయనపై పోటీ చేసిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత, ఆమె వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు.

అయితే పార్టీ నాయకత్వం వారిని ఒప్పించి కృష్ణమోహన్‌రెడ్డిని చేర్చుకుంది. అయితే.. కాంగ్రె్‌సలో తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని కృష్ణమోహన్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. పైగా కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికను సవాల్‌ చేస్తూ కోర్టులో ఆమె కేసు వేశారు. కేటీఆర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

తనపై సరితతోపాటు బీజేపీ ఎంపీ డీకే అరుణ కోర్టులో పిటిషన్‌ వేశారని తెలిపారు. ఈ కేసులో తన తరఫున కోర్టులో వాదించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌.. ఇటీవలే తొలగించిందన్నారు. తిరిగి న్యాయవాదిని ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ను కోరగా.. సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు.


  • చాంబర్‌కు వెళితే పార్టీ మారినట్లు కాదు..!

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కృష్ణమోహన్‌రెడ్డి.. కేటీఆర్‌ చాంబర్‌కు వెళ్లినంత మాత్రాన పార్టీ మారినట్టా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌ కూడా తన చైర్‌ వద్దకు వచ్చి మాట్లాడారని, ఆయన కూడా కాంగ్రె్‌సలో చేరినట్టేనా? అని అన్నారు.

Untitled-2 copy.jpg

కాగా, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ముగ్గురూ కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని ఓడించలేకపోయారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారిని చూసుకోవడానికి రేవంత్‌ అవసరం లేదని, తాను చాలునని అన్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరూ ఎక్కడికీ వెళ్లరని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. కేటీఆర్‌తో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి భేటీపై పొంగులేటి మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ స్పందించారు. తమ వద్ద రాజకీయం.. ప్రేమతో ఉంటుందని, తమ దగ్గరికి వచ్చిన వారెవరూ ఇబ్బంది పడరని చెప్పారు. బీఆర్‌ఎస్‌ వద్ద ఏముందని మళ్లీ అక్కడికి వెళతారని ప్రశ్నించారు. కేటీఆర్‌ను పాత పరిచయంతోనే కలిసి ఉంటారని వ్యాఖ్యానించారు.

  • కృష్ణమోహన్‌రెడ్డికి ఓపిక లేదు:యెన్నం

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి విషయంలో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి.. మంత్రుల అభిప్రాయాలకు భిన్నంగా స్పందించారు. కృష్ణమోహన్‌రెడ్డికి ఓపిక లేదని వ్యాఖ్యానించారు.

గద్వాలలో ఆయన మాటకు కాంగ్రెస్‌ పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మనుషులకు అవకాశం ఇచ్చేందుకూ అంగీకరించామని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ను అధికారిక కార్యక్రమాలకు పిలవద్దంటే మాత్రం.. అది సరికాదని చెప్పామన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 04:57 AM