Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష ఉగ్రవాదంపై పైచేయి సాధించాం
ABN , Publish Date - Oct 07 , 2024 | 01:52 PM
పోలీసు శాఖ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు చాలా బాగా పనిచేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశంసలు కురిపించారు. హింసతో ఏదీ సాధించలేం, జనజీవన స్రవంతిలో.. కలవాలని మావోయిస్టులకు అమిత్‌షా పిలుపునిచ్చారు.
ఢిల్లీ: పోలీసు శాఖ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు చాలా బాగా పనిచేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశంసలు కురిపించారు. హింసతో ఏదీ సాధించలేం, జనజీవన స్రవంతిలో.. కలవాలని మావోయిస్టులకు అమిత్‌షా పిలుపునిచ్చారు. ఇవాళ( సోమవారం) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ... బహుముఖ వ్యూహాన్ని అమలుచేస్తూ.. మావోయిస్ట్ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష ఉగ్రవాదంపై పైచేయి సాధించామని అమిత్‌షా వెల్లడించారు.
మావోయిస్టులు అడ్డుకుంటున్నారు..
‘‘వికసిత్ భారత్ సాధించాలంటే అందులో మన ట్రైబల్ ప్రజలు కూడా భాగం కావాలి. కానీ ప్రభుత్వ ఫలాలు వారికి చేరకుండా మావోయిస్టులు అడ్డుకుంటున్నారు. రోడ్లు, టవర్లు, చివరకు విద్య, వైద్యం కూడా గిరిజన ఆదివాసీలకు చేరనీయడం లేదు. గత కొన్నేళ్లలో మావోయిస్టు సమస్యను ఎదుర్కొనే విషయంలో గణనీయమైన పురోగతి సాధించాం. 2022లో తొలిసారి మావోయిస్టు హింసతో మరణాల సంఖ్య 100 కంటే తక్కువ నమోదైంది. మావోయిస్టుల ప్రభావిత గిరిజన ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ ఫలాలు, పథకాలు కూడా వేగంగా చేరుతున్నాయి. బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ ఈ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి’’ అని అమిత్ షా కొనియాడారు.
ఛత్తీస్‌ఘడ్‌లో వామపక్ష ఉగ్రవాదం..
‘‘హెలికాప్టర్ సేవలను వారికి అదజేయడం వల్ల గాయపడ్డ భద్రతా బలగాలను సకాలంలో ఆస్పత్రికి చేర్చడం, భూమార్గం ద్వారా చేరుకోలేని ప్రాంతాలకు బలగాలను చేర్చడం సాధ్యమైంది. ఈ ఏడాది ఛత్తీస్‌ఘడ్‌లో వామపక్ష ఉగ్రవాదంపై చాలా పైచేయి సాధించాం. మావోయిస్టులకు కూడా పిలుపునిస్తున్నాం. హింసతో ఏదీ సాధించలేం. జనజీవన స్రవంతిలో కలవండి. ఇందుకోసం చాలా పథకాలు అమలవుతున్నాయి. వాటిని వినియోగించుకుని ప్రజల్లోకి వచ్చేయాలి’’’ అని అమిత్ షా సూచించారు.
మావోయిస్టులే టార్గెట్‌గా చర్యలు..
కాగా.. మావోయిస్టులే టార్గెట్‌గా కేంద్ర ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటుంది. ఈరోజు కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమీక్ష సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు.
నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్ అంశాలపై చర్చ..
2026 మార్చి నాటికి నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్ అంశాలపై ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించారు. ఈప్రత్యేక సమీక్షకు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోం మంత్రులు, సీఎస్‌లు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, పలు కీలక శాఖల కార్యదర్శులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా..
2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశం జరిగింది. దేశంలో మావోయిస్టు సమస్యను లేకుండా చేయడమే ప్రస్తుత లక్ష్యమని ఇప్పటికే అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించారు. ఈ సమీక్ష సమావేశానికి ఒడిశా, పశ్చిమ బంగాల్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, కేరళ రాష్ట్రాల మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
సమాచార వ్యవస్థను నెలకొల్పడంపై...
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం ఉన్న భద్రత సమస్య నుంచి ఆయా ప్రాంతాలకు విముక్తి కల్పించడం, సమాచార వ్యవస్థను నెలకొల్పడం, ఆయా ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించారు. కేంద్రం చేపట్టే కార్యక్రమాల వివరాలను రాష్ట్రాలకు ఆయా శాఖల కేంద్ర మంత్రులు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం చేపట్టిన ఆపరేషన్, సాయుధ బలగాల కార్యాచరణ, బలగాల మోహరింపు వివరాలను ఇంటిలిజెన్స్ అధికారులు అందించారు.