Share News

BRS: రైతుభరోసా కోసం రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు

ABN , Publish Date - Oct 20 , 2024 | 07:24 AM

వానాకాలం పంట సీజన్‌‌లో రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును ప్రభుత్వం ఎగ్గొట్టిందని, దీనికి నిరసనగా ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల్లో చేపట్టాలని నిర్ణయించింది. వానాకాలం పంట సీజన్‌‌కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి చెప్పడం అంటే మోసం చేయడమేనని కేటీఆర్‌ మండిపడ్డారు.

BRS:  రైతుభరోసా కోసం రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు

హైదరాబాద్: రైతు భరోసా (Farmers Assurance) కోసం రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి (BRS) నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు (Protest Programs) పిలుపునిచ్చింది. ఈమేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. ఎకరానికి రూ. 15 వేలు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీనిచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదని... కాంగ్రెస్ తీరును ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.


వానాకాలం పంట సీజన్‌‌లో రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును ప్రభుత్వం ఎగ్గొట్టిందని, దీనికి నిరసనగా ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల్లో చేపట్టాలని నిర్ణయించింది. వానాకాలం పంట సీజన్‌‌కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి చెప్పడం అంటే మోసం చేయడమేనని కేటీఆర్‌ మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పి రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌‌ను గెలిపిస్తే రైతు బంధు ఇవ్వరని మాజీ సీఎం కేసీఆర్‌ ముందే చెప్పారన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి నిజం చేశారన్నారు. రైతు బంధును పూర్తిగా ఎగ్గొట్టి లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. పేదల కుడుపుకొట్టే మూసీ ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు ఉంటాయి కానీ.. రైతుభరోసాకు పైసలు లేవా అని ప్రశ్నించారు. రైతులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని, రుణమాఫీ చేసే వరకు, రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వదిలేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.


ఢిల్లీకి మూటలు పంపేందుకే మూసీ ప్రాజెక్టు..

కాగా ‘‘ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయే వారి కోసం మూడు నెలలు కాదు.. మూడేళ్లు కూడా మూసీ పక్కన ఉండేందుకు సిద్ధం. నా చిన్నతనంలో నింబోలి అడ్డా, మొజంజాహి మార్కెట్‌ పక్కన మయూరి హోటల్‌లో ఉన్నాను. అవి మూసీకి దగ్గరగా ఉంటాయి. మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చిన సీఎంకు హైదరాబాద్‌ గురించి తెలియకపోవచ్చు. చిన్నప్పటి నుంచీ ఇక్కడే ఉన్న నాకు తెలుసు’’ అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవం, బ్యూటిఫికేషన్‌కు తాము వ్యతిరేకం కాదని, మూసీ పేరిట లూటిఫికేషన్‌, ఢిల్లీ మూటల దోపిడిని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రజాధనం లూటీ చేసి ఢిల్లీకి మూటలు పంపేందుకే మూసీ ప్రాజెక్టు అని ఆరోపించారు.

నాగోల్‌లోని సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ)ను శనివారం మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. అక్కడి ఖర్చులకు రాహుల్‌ గాంధీకి పైసలు అవసరం. ఆ పార్టీకి ఉన్నది తెలంగాణ ఒక్కటే. కర్ణాటకలో ప్రభుత్వమున్నా అక్కడి సీఎం ముడా స్కాంలో ఇరుక్కున్నాడు. అందుకే తెలంగాణను కాంగ్రెస్‌ ఆర్థిక వనరుగా వినియోగించుకుంటోంది. మూసీ పేరిట ప్రజాధనం, హైడ్రాతో బిల్డర్ల వద్ద వసూలు చేసి పదవి కాపాడుకునేందుకు ఢిల్లీకి పంపుతున్నాడు. అయ్యా.. రేవంత్‌ రెడ్డి.. నీకు పదవి కాపాడుకునేందుకు పైసలు కావాలంటే మేం చందాలు వేసుకొని ఇస్తాం.


ఢిల్లీకి పంపు. కానీ, పేదల కడుపు కొట్టి వేల కోట్ల దోపిడి చేస్తామంటే మాత్రం ఒప్పుకోం’’ అని వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవాన్ని కేసీఆర్‌ ప్రభుత్వమే ప్రారంభించిందని, ఎస్‌టీపీల నిర్మాణం చేపట్టామని, మూసీకి ఇరువైపులా 15 బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. ఇవన్నీ పూర్తయ్యాక రివర్‌ బెడ్‌లోని 900 నిర్మాణాల యజమానులను ఒప్పించి వారికి ప్రత్యామ్నాయం కల్పించి సుందరీకరణ పనులు చేయాలని భావించామన్నారు. మూసీ వెంట రూ.10 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ప్రతిపాదించామని, మొత్తం ప్రాజెక్టుకు రూ.15-16 వేల కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు. కొత్తగా రేవంత్‌రెడ్డి చేయాల్సిందేం లేదని, తమ హయాంలో రూపొందించిన ప్రణాళికలు అమలు చేస్తే చాలని పేర్కొన్నారు.

తాము చేసిన పనులను రేవంత్‌ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నాడని, కేసీఆర్‌ కట్టించిన ఇళ్లను మూసీ నిర్వాసితులకు ఇస్తున్నాడని, తమ హయాంలో నిర్మాణం చేపట్టిన ఎస్‌టీపీలకు ఆయన ప్రారంభోత్సవం చేశాడని ఎద్దేవా చేశారు. ‘‘పాఠశాలల్లో చాక్‌పీ్‌సలకు పైసల్లేవు. ఆస్పత్రుల్లో మందు గోలీలకు డబ్బుల్లేవ్‌. బస్తీ దవాఖానాల్లో వైద్యులకు వేతనాలివ్వరు. హోం గార్డులకు జీతాలియ్యరు. రైతు భరోసా లేదు. రుణ మాఫీ చేయరు. తులం బంగారం ఇయ్యరు. ఆరు గ్యారంటీల అమలుకు నిధులు లేవంటున్నారు. మరి మూసీకి రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?’’ అని ప్రశ్నించారు. ఎవరికీ నష్టం చేయకుండా మూసీకి ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలని, బఫర్‌ జోన్‌లోని ఇళ్ల జోలికి వెళ్లవద్దని సూచించారు. అనుమతులిచ్చి.. ఆస్తిపన్ను, నల్లా, విద్యుత్తు బిల్లులు వసూలు చేస్తూ బఫర్‌ జోన్‌లో ఉన్న వారిని కబ్జాదారులు అనడం ఏమిటని మండిపడ్డారు. ‘‘నదీ గర్భంలో పేదల ఇళ్లు ఉంటే మంచిది కాదు. కానీ, ఎంజీబీఎస్‌, మెట్రో స్టేషన్‌ ఉండొచ్చట. పేదల ఇళ్లు కూల్చి పెద్ద మాల్స్‌ కడతారట’’ అని ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తీతువు పిట్టల్లా లొల్లి..!

ఆ రహస్యం ఏమిటి?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 20 , 2024 | 07:24 AM