Share News

TG News: మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌పై జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు..

ABN , Publish Date - Jul 24 , 2024 | 08:05 PM

మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే దళారి మోసం చేశారంటూ బాధితుడు శశిధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెన్సార్ బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పిస్తానంటూ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి రూ.10లక్షలు వసూలు చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

 TG News: మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌పై జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు..

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే దళారి మోసం చేశారంటూ బాధితుడు శశిధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెన్సార్ బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పిస్తానంటూ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి రూ.10లక్షలు వసూలు చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా రూ.4లక్షలు ఇచ్చానని, అనంతరం మరో రూ.6లక్షలు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.


నగదు తీసుకున్న తర్వాత సెన్సార్ బోర్డు కాదు, ఎఫ్‌సీ నంబర్‌గా అవకాశం కల్పిస్తామని, అందుకు మరో రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు వెల్లడించారు. కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి, పెమ్మసాని చంద్రశేఖర్, హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పరిచయాలు ఉన్నాయంటూ తనను మోసం చేసినట్లు శశిధర్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏపీకి చెందిన ఉన్నతస్థాయి అధికారులతోనూ సంబంధాలు ఉన్నట్లు నిందితులు చెప్పారని గోడు వెల్లబోశారు.


రూ.10లక్షలను మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ బంధువు అకౌంట్‌లో వేసినట్లు చెప్పారు. గతంలోనూ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని షాద్ నగర్‌కి చెందిన ఓ నేత నుంచి ప్రవీణ్ రెడ్డి కోటి రూపాయలు వసూలు చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. నిందితులు అనేక మందికి ఇలాగే పదవులు ఆశ చూపి డబ్బులు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నట్లు ఆరోపించారు. ఘటనపై విచారణ చేసి న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - Jul 24 , 2024 | 08:05 PM