Share News

AndhraJyothy: ఎడిటర్ల తయారీ ఫ్యాక్టరీ

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:17 AM

ఆంధ్రజ్యోతి.. ఎడిటర్లను తయారు చేసే ఫ్యాక్టరీ. ఇక్కడ పనిచేసిన వారెంతో మంది సంపాదకులుగా ఎదిగారు.

AndhraJyothy: ఎడిటర్ల తయారీ ఫ్యాక్టరీ
Editor K.Srinivas

ఇక్కడ పనిచేసినవారు ఎంతో మంది సంపాదకులయ్యారు.. తెలుగు నాట మరే పత్రికకూ ఈ చరిత్ర లేదు

ఎడిటర్‌గా శ్రీనివాస్‌ సేవలు ఎనలేనివి

వీడ్కోలు సభలో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ

1వ తేదీ నుంచి కొత్త ఎడిటర్‌గా రాహుల్‌ కుమార్‌

రాధాకృష్ణ అండదండలతోనే స్థిమితమైన నిర్ణయాలు: కె.శ్రీనివాస్‌


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రజ్యోతి.. ఎడిటర్లను తయారు చేసే ఫ్యాక్టరీ. ఇక్కడ పనిచేసిన వారెంతో మంది సంపాదకులుగా ఎదిగారు. అందుకు అవసరమైన ప్రాతిపదికను మనం మాత్రమే తయారు చేయగలిగాం. ఎడిటర్లుగా ఎదగడానికి, తద్వా రా సమాజం నుంచి పూర్తిస్థాయి గౌరవ మర్యాదలు దక్కడానికి అవసరమైన అవకాశాలు కల్పించాం. అది నాకు సంతృప్తిగా అనిపించింది. ఈ విధంగా ఆంధ్రజ్యోతి మాత్రమే చేయగలదు. తెలుగు నాట మరే పత్రికకూ ఈ చరిత్ర లేదు’’ అని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ అన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో బుధవారం ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. కె.శ్రీనివాస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘ఆంధ్రజ్యోతిని తిరిగి ప్రారంభించాలనుకున్నప్పుడు నాకు నేనుగా వెళ్లి సంస్థలోకి ఆహ్వానించిన ఏకైక వ్యక్తి కె.శ్రీనివాస్‌. ఆయన ఎంత కాలం ఉండాలనుకుంటే, అంతకాలం ఉండొచ్చని చెప్పా. శ్రీనివాస్‌ 22 ఏళ్ల పాటు ఒక సంస్థలో ఉండటం అరుదైన విషయం. ఆయనకు అలాంటి సంతృప్తి ఇవ్వగలిగినందుకు గర్వపడదాం. ఇంతకాలం కుటుంబంలో ఒకరిగా ఉంటూ, మంచిచెడులు చెప్పే వ్యక్తి దూరమవుతుంటే బాధగా ఉంది’’ అని రాధాకృష్ణ చెప్పారు. శ్రీనివాస్‌ వివాదరహితుడు, మితభాషి అని, భాషపై ఆయనకున్న సాధికారతను ప్రశంసించారు. శ్రీనివాస్‌ మార్గనిర్దేశకత్వం ఇకపైనా కొనసాగాలని కోరారు. ‘ఆంధ్రజ్యోతి’ నూతన సంపాదకుడిగా రాహుల్‌కుమార్‌ నవంబరు 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు.


స్వేచ్ఛగా పనిచేసే అవకాశం

కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘నా 40 ఏళ్ల పాత్రికేయ జీవితంలో పాత ఆంధ్రజ్యోతితో ఆరేళ్ల అనుబంధం కలిపి మొత్తంగా 28 ఏళ్లు ఈ సంస్థతోముడిపడి ఉంది. నేను ఇక్కడ ఇంతకాలం పనిచేయడానికి ప్రధాన కారణం రాధాకృష్ణ. స్వేచ్ఛగా పనిచేయడానికి, చెప్పాలనుకున్నది చెప్పడానికి అవకాశం కల్పించారు. ఆంధ్రజ్యోతి నుంచి నేను చాలా నేర్చుకున్నా’’ అని చెప్పారు. సిబ్బంది పట్ల రాధాకృష్ణ వైఖరి స్నేహపూర్వకంగా ఉంటుందని శ్లాఘించారు. రాధాకృష్ణ అండదండలతోనే తాను స్థిమితంగా నిర్ణయాలు తీసుకోగలిగానని చెప్పారు. విధి నిర్వహణలో తనకు తోడ్పడిన సహోద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు.


భావ గాంభీర్యతతో బరువెక్కుతాయి..

‘‘కె.శ్రీనివాస్‌ రచనల్లో మార్పు కావాలన్న హడావుడి ఉంటుంది. మనిషిని మంచివైపు నడిపించాలన్న ఉద్వేగం ఉంటుంది. న్యాయం కోసం మనుషులు ఆందోళన పడాలనే తత్వం ఉంటుంది. చెడును ఖండించాలనే ఆగ్రహం ఉంటుంది. ఇవన్నీ చెప్పడానికి ఆయన వాక్యాలన్నీ భావ గాంభీర్యతతో బరువెక్కుతాయి’’ అంటూ కొత్త ఎడిటర్ రాహుల్‌కుమార్‌ ప్రశంసించారు. అసిస్టెంట్‌ ఎడిటర్‌ వక్కలంక రమణ మాట్లాడుతూ.. శ్రీనివాస్‌ కలం నుంచి జాలువారిన వాక్యాలు అద్భుతమైన అనుభూతి కలిగిస్తాయన్నారు. శ్రీనివాస్‌ లాంటి గొప్ప సంపాదకుడితో కలిసి ప్రయాణించామని గర్వంగా చెప్పుకొనే అవకాశం తమకు దక్కిందన్నారు. ఎండీ రాధాకృష్ణ, ఈడీ ఆదిత్య తదితరులు కె.శ్రీనివాస్‌, సుధ దంపతులను సత్కరించారు. యాజమాన్యం, సిబ్బంది జ్ఞాపికలను బహూకరించారు. తెలంగాణ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జి కృష్ణప్రసాద్‌, రాయలసీమ రీజనల్‌ ఇన్‌చార్జి ఉమామహేశ్వరరావు, జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌ రాఘవేంద్రరావు, ఎడిటోరియల్‌ సిబ్బంది, ఉద్యోగులు శ్రీనివాస్‌కు వీడ్కోలు పలికారు.

ఇది కూడా చదవండి

TTD Chairman: టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు..

తీరు మారని ‘బోరుగడ్డ’

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 31 , 2024 | 08:37 AM