Share News

Rains: హైదరాబాదీలకు హైఅలర్ట్.. ఆగస్టులో నగరాన్ని వణికించనున్న వరుణుడు!

ABN , Publish Date - Jul 31 , 2024 | 03:12 PM

భాగ్యనగరానికి వరదల ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. జులైలో భారీ వర్షాలతో అల్లాడిన హైదరాబాద్‌ వాసులకు(Hyderbad Rains) మరో గండం పొంచి ఉంది. ఆగస్టు నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు బుధవారం తెలిపారు.

Rains: హైదరాబాదీలకు హైఅలర్ట్.. ఆగస్టులో నగరాన్ని వణికించనున్న వరుణుడు!

హైదరాబాద్: భాగ్యనగరానికి వరదల ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. జులైలో భారీ వర్షాలతో అల్లాడిన హైదరాబాద్‌ వాసులకు(Hyderbad Rains) మరో గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆగస్టు నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు బుధవారం తెలిపారు. ముఖ్యంగా ఆగస్టు చివరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి 30 మధ్యకాలంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు.


ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా అసిఫాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 282.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అంటే సాధారణం (280.7 మిల్లీమీటర్ల) కంటే స్వల్పంగా ఎక్కువ వర్షపాతం నమోదైందన్నమాట. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం జూన్ మొదటి రెండు వారాల్లో భారీ వర్షాలు కురిశాయి. జూన్ చివరి వారంలో అధిక వర్షపాతం నమోదైంది. జులైలో సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. జులై చివరివారంలో లోటు వర్షపాతం నమోదైంది.


రెండ్రోజులపాటు భారీ వర్షాలు..

ఇక తెలంగాణలో రానున్న 2 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గడిచిన వారం పదిరోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.రాష్ట్రవ్యాప్తంగా జలాశయాలన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి.


ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులు నిండుతుండటంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. నిర్మల్‌, పెద్దపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగరి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలకు మోస్తరు వర్షసూచనను ప్రకటించారు. హైదరాబాద్‌లో రానున్న రెండ్రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రం వేళల్లో చిరుజల్లులు కురుస్తాయని వివరించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 31 , 2024 | 03:36 PM