Share News

TG News: విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలి: మంత్రి తుమ్మల

ABN , Publish Date - May 30 , 2024 | 06:35 PM

పత్తి, పచ్చిరొట్ట లభ్యత, విత్తనాల పంపిణీపై రాష్ట్రస్థాయి అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) గురువారం సమీక్ష నిర్వహించారు. నకిలీవిత్తనాల విక్రయితలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, పోలీసులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

TG News: విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలి: మంత్రి తుమ్మల
Minister Tummala Nageswara Rao

హైదరాబాద్: పత్తి, పచ్చిరొట్ట లభ్యత, విత్తనాల పంపిణీపై రాష్ట్రస్థాయి అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) గురువారం సమీక్ష నిర్వహించారు. నకిలీవిత్తనాల విక్రయితలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, పోలీసులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు వచ్చిన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశించారు. సీడ్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... జిల్లాల వారిగా నేటికి 68,16,967 వివిధ కంపెనీల ప్రత్తివిత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగతా ప్యాకెట్లు కూడా జూన్ 5వ తేదీలోగా జిల్లాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో రైతుల అవసరం మేరకు ప్రత్తి, జిలుగ విత్తనాలు పంపిణీ చేసినట్లు వివరించారు.


ఆ విత్తనాలను జిల్లా కలెక్టర్లు రైతులకు సక్రమంగా చేరేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఎక్కడైనా రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి భారీ సంఖ్యలో వస్తే కౌంటరులు ఎక్కువ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇకనుంచి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు ప్రతినిత్యం పర్యటిస్తూ విత్తనాల విక్రయ కేంద్రాలు, జిలుగ, జనుము సరఫరా చేసే కేంద్రాల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గతవారంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


విత్తన కంపెనీలు ప్రణాళిక ప్రకారం ప్రత్తి విత్తన ప్యాకెట్లను జూన్ 5లోగా జిల్లాలకు చేర్చాలని ఆదేశించారు. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీకి చెందిన ఒకే రకమైన విత్తనాలనే రైతులు కోరుతున్నారని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అలా కాకుండా యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని విత్తన హైబ్రిడ్ల దిగుబడి ఒక్కటేనని ఈ విషయాన్ని రైతులందరికీ సంబంధిత కంపెనీలు తెలియజేయాలని సూచించారు.


ప్రతిరోజు జిల్లావారి, కంపెనీవారిగా ప్రత్తివిత్తన ప్యాకెట్ల పంపిణీ, కొనుగోలు వివరాలను పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రత్తి మరియు పచ్చిరొట్ట విత్తనాలు అవసరం మేరకు ఉన్నాయని తెలిపారు. రైతుల అవసరం మేరకు విత్తనాలను ప్రభుత్వ ఆమోదిత దుకాణాల నుంచి కొనాలని సూచించారు. రైతులు విత్తనాలకు సంబంధించి ప్రతి కొనుగోలు బిల్లులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Telangana: తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా.. ఎందుకంటే..?

BJP: ఫోన్ ట్యాపింగ్‌‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న బీజేపీ

New Logo: ఖరారైన తెలంగాణ కొత్త లోగో..!

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 30 , 2024 | 06:37 PM