MLC Kavitha: కవిత ఇంటికి అధికారులు.. ఎందుకంటే..
ABN , Publish Date - Nov 16 , 2024 | 10:55 AM
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కులగణన ప్రక్రియను తలపెట్టింది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలను సేకరిస్తున్నారు. కులగణనలో ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొని వివరాలు నమోదు చేయించుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా కులగణన సర్వే చేపట్టింది. సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 1.17 కోట్లకు పైగా ఇళ్లను గుర్తించి మొదటి దశలో వాటికి స్టిక్కర్లు అంటించారు. రెండో దశలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం 8 పేజీల్లో 56 అంశాలకు సంబంధించి 75 ప్రశ్నల ద్వారా ఎన్యుమరేటర్లు సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఇందులో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య ఇలా అన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
పలురు ప్రముఖులు కూడా కులగణనలో వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇవాళ(శనివారం) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కులగణనలో వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈరోజు ఉదయం కవిత నివాసం ఉంటున్న బంజారాహిల్స్‌లోని ఇంటికి కులగణన అధికారులు వచ్చారు. అధికారులకు సహకరించి కులగణనలో ఎమ్మెల్సీ కవిత వివరాలు నమోదు చేయించుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితపై ఆరోపణలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi Liquor Scam)లో నిందితురాలిగా ఉన్న కవిత బెయిల్‌పై కొన్ని రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న కవిత గతంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు తీహార్ జైలు అధికారులు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యలు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలోనూ ఆమెను ఎయిమ్స్‌కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత సీబీఐ సైతం ఆమెను కస్టడీలోకి తీసుకుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థల కేసుల్లో కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం ఇప్పటికే అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసినా.. ఈడీ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈసారైనా ఆమెకు బెయిల్ వస్తుందని కవిత, ఆమె కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ప్రతిష్ఠాత్మకంగా కులగణన ప్రక్రియ..
కాగా.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కులగణన ప్రక్రియను తలపెట్టింది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలను సేకరించనున్నారు. ఇందుకోసం తెలంగాణవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలను బ్లాకుల వారీగా విభజించారు. సర్వేలో ఆయా గ్రామాలు, వార్డులు, బస్తీల్లోని బ్లాకులకు ఎన్యుమరేటర్లు వెళ్లి ప్రతి ఇంటిలో ఉన్న కుటుంబాలను నమోదు చేశారు. ఇంటి నంబరు, కుటుంబ యజమాని పేరుతో జాబితాను తయారుచేసి ఆ ఇంటికి స్టిక్కర్‌ను అతికించారు. జాబితాల తయారీ, స్టిక్కర్లు అంటించే ప్రక్రియను 8వ తేదీ వరకు నిర్వహించగా.. ఈనెల 9 నుంచి సమగ్ర ఇంటింటి సర్వేను చేపట్టారు.
డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షణ
క్షేత్రస్థాయిలో సర్వే మొత్తం పూర్తయిన తర్వాత ఆ వివరాలను మండల, జిల్లా స్థాయిలో కంప్యూటరీకరించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, మండల, మునిసిపాలిటిల్లో నోడల్ అధికారిగా నియమితులైన జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. సర్వే వాస్తవ పురోగతిని నిరంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిలో డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించనున్నారు. సర్వేలో సేకరించిన కుటుంబాల సమాచారమంతా అత్యంత గోప్యంగా ఉంచడంతోపాటు సర్వే షెడ్యూల్‌ను భద్రపరచనున్నారు. ఈ సర్వేలో వివరాలను తెలిపేందుకు ఆయా కుటుంబ సభ్యులందరి ఆధార్‌కార్డులు, భూమి పాసుపుస్తకాలు, రేషన్‌కార్డులను ప్రజలు సిద్ధంగా ఉంచుకుంటే వివరాలను త్వరగా తెలిపే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు సూచించారు. సర్వే సమాచారం మొత్తం ప్రణాళికా శాఖకు చేరనుండగా ఆ సమాచారాన్ని బీసీ కమిషన్‌కు అందించనున్నారు.
243 కులాలు..
తెలంగాణ రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లో ఏ కేటగిరీలో ఎన్ని కులాలున్నాయో వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణనలో వివరాలను సేకరించేందుకుగాను ఆయా కులాలకు కోడ్‌లను కేటాయించింది. తెలంగాణ వారే కాకుండా ఇక్కడ నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారికి కూడా ప్రత్యేక కోడ్‌లను కేటాయించి గణన చేపడుతోంది. కులం, మతం లేదని చెప్పేవారినీ ప్రత్యేక కోడ్ కింద నమోదు చేస్తోంది. మొత్తంగా కులగణన ప్రశ్నావళిలో కులాలకు సంబంధించి 249 కోడ్‌లను కేటాయించింది. ఈ సర్వేలో కులాల సమాచారంతోపాటు ఆయా కుటుంబాల భూముల వివరాలు, వారికి ఎదురవుతున్న భూ సమస్యలపైనా ఆరా తీస్తోంది. వ్యాపారవేత్తలైతే.. వారి వార్షిక టర్నోవర్ వివరాలు అడుగుతోంది.