Share News

NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్‌కు పోటెత్తిన ప్రముఖులు..

ABN , Publish Date - May 28 , 2024 | 11:38 AM

NTR 101 Birth Anniversary: దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ నేతలు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు.

NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్‌కు పోటెత్తిన ప్రముఖులు..
NTR Birth Anniversary

NTR 101 Birth Anniversary: దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ నేతలు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి పుష్పాంజలి ఘటించారు. నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, సహా ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలదండ వేసి నమస్సులర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. తెలుగువారి ఘనకీర్తి.. తెలుగువారికి స్ఫూర్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.


బాలయ్య కామెంట్స్..

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళురల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య.. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని, ఎన్టీఆర్ పథకాలనే అందరూ అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింతగా ప్రజలకు సేవ చేస్తామని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్న అని పిలిపించుకున్న ఏకైక నేత ఎన్టీఆర్ అని రామకృష్ణ పేర్కొన్నారు. దాతల సాయంతో తిరుమలలో నిత్య అన్నదానానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. సంక్షేమ పథకాలతో పేదల జీవితాలను మార్చిన నేత ఎన్టీఆర్ అని కీర్తించారు.

రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నేత ఎన్టీఆర్ అని దుగ్గుబాటు పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌తోనే తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని.. ఎన్టీఆర్ అంటే సినీ, రాజకీయ రంగంలో ప్రభంజనం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు వెళతామన్నారు.


క్యూ కట్టిన నేతలు..

ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళురల్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద రఘురామకృష్ణం రాజు నివాళులర్పించారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ విజయం సాధించబోతోందన్నారు. ఏడు రోజుల్లో ఏపీలో టీడీపీ అధికారం చేపట్టబోతోందన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తాను ఎన్టీఆర్ అభిమానిని అని అన్నారు. 1991లో ఎన్టీఆర్‌ను కలసిన సందర్భం తన జీవితంలో మధురమైన క్షణాలు అని రఘురామ పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాదిరి మానవత్వం ఉన్న నేతలు శతాబ్దంలోనే లేరన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది అతిపెద్ద స్థాయి అని.. ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇచ్చి గౌరవిస్తోందన్న నమ్మకం తనకుందన్నారు. అంబేద్కర్, పూలే మాదిరి.. ఎన్టీఆర్ జయంతిని కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని రఘురామ డిమాండ్ చేశారు.

టీడీపీ నేత కంభంపాటి రామ్మోహనరావు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జూన్ 4న ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చాక తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి గౌరవం ఉండేలా చూస్తామన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాళని కేంద్ర ప్రభుత్వానికి కంభంపాటి విజ్ఞప్తి చేశారు.


ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్రావు, కాట్రగడ్డ ప్రసూన, బక్కిన నరసింహులు తదితరులు నివాళురల్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఎర్రబెల్లి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను గొప్పతనాన్ని స్మరించుకున్నారు. ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ తనకు దైవ సమానులు అని.. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నాయకుడు అని అన్నారు. తాను మెదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకినని.. 25 ఏళ్ళ వయస్సుకే తనకు ఎన్టీఆర్ వరంగల్ జిల్లా పార్టీ పదవి ఇచ్చారని అన్నారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతోనే 26 ఏళ్ళకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తెలుగువారికి గర్వకారణం అని.. పెన్షన్లు, కిలో రెండు రూపాయల బియ్యం పరిచయం చేశారని కీర్తించారు. ఎన్టీఆర్ స్పూర్తితోనే ప్రస్తుత ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 01:22 PM