Share News

Telangana: జైళ్ళ శాఖ చరిత్రలో మైలు రాయి.. 213 మంది ఖైదీల విడుదల..!

ABN , Publish Date - Jul 03 , 2024 | 02:23 PM

తెలంగాణలో(Telangana) పలువురు ఖైదీలకు పండుగ రోజు నేడు. అవును.. మంచి ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీలను విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 213 మంది ఖైదులు(Prisoners) విడుదలవుతున్నారు. అంతేకాదండోయ్.. వీరందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది జైళ్ల శాఖ. ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేసింది.

Telangana: జైళ్ళ శాఖ చరిత్రలో మైలు రాయి.. 213 మంది ఖైదీల విడుదల..!
Telangana State Prison Department

హైదరాబాద్, జులై 03: తెలంగాణలో(Telangana) పలువురు ఖైదీలకు పండుగ రోజు నేడు. అవును.. మంచి ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీలను విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 213 మంది ఖైదులు(Prisoners) విడుదలవుతున్నారు. అంతేకాదండోయ్.. వీరందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది జైళ్ల శాఖ. ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డిజి సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. విడుదలవుతున్న ఖైదీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ జైళ్ళ శాఖ చరిత్రలో నేడు ఓ మైలురాయి లాంటిదని అన్నారు.

కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. ఖైదీల కుటుంబ సభ్యులు ప్రజావాణిలో తమ కుటుంబ సభ్యుల విడుదలకు చొరవ చూపాలని దరఖాస్తులు ఇచ్చారన్నారు. ఈ వినతులను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ ప్రకారం.. ఈ హైలెవెల్ కమిటీ ఒక లిస్ట్ తయారు చేసిందన్నారు. ఆ లిస్ట్‌ను కేబినెట్‌కు పంపామని.. కేబినెట్ ఆమోదం పొందిన తరువాత.. గవర్నర్ కూడా ఆమోదించారని డీజీ తెలిపారు. దీంతో ఖైదీల విడుదలకు హోంశాఖ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.


జైల్లో చదువుకుని గోల్డ్ మెడల్ సాధించి..

205 మంది యావజ్జీవ కారాగర శిక్ష అనుభవించిన ఖైదీలు.. 8 మంది స్వల్ప కాలిక శిక్ష పడిన ఖైదీలు నేడు విడుదలవుతున్నారని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. విడుదలవుతున్న ఖైదీలందరికీ జీవితంలో ఇది రెండో అవకాశం అని.. ఈ అవకాశాన్ని ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని హితవుచెప్పారు. జైళ్లలో కేవలం శిక్ష మాత్రమే కాదు.. శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ఖైదీలకు పలు వృత్తి విద్య నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. జైలులో ఖైదీలు తయారు చేసే వస్తువులకి మార్కెట్‌లో డిమాండ్ ఉందన్నారు. జైలుకు వచ్చిన వారిలో నిరక్షరాస్యులను సైతం అక్షరాస్యులుగా మార్చమన్నారు. జైలులో చదువుకుని కొందరు ఖైదీలు పట్టభద్రులు అయ్యారని.. గోల్డ్ మెడల్ కూడా సాధించారని డీజీ చెప్పారు.

Also Read: విపక్షాలకు ఎప్పటికీ అర్థంకాదు.. రాజ్యసభలో మోదీ సెటైర్లు..


ఉపాధి ఎలా కల్పిస్తారు?

కాగా, ఖైదీలు విడుదల అయ్యాక వారికి ఉపాధి ఎలా? అనే అంశంపై సీఎం, గవర్నర్ అడిగారని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. 70 మంది ఖైదీలకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పించామన్నారు. శిక్షకాలంలో ఇస్తున్న జీతం కంటే.. ఎక్కువ జీతం ఇస్తున్నామని తెలిపారు. ముగ్గురు మహిళా ఖైదీలకు జైళ్ల శాఖ స్టోర్లలో ఉద్యోగాలిచ్చామని డీజీ తెలిపారు. ఇప్పటి వరకు విడుదలైన ఖైదీలలో మూడో వంతు ఖైదీలకు ఉపాధి కల్పించామని వివరించారు. అంతేకాదు.. జైలు నుంచి విడుదలయ్యాక ఉపాధి దొరక్కపోతే ఖైదీలు తమను సంప్రదించొచ్చని.. ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు.

Also Read: వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు


కొంతమంది మహిళా ఖైదీలు తమకు కుట్టు మిషన్ ఇస్తే ఉపాధి పొందుతామని అడిగారన్నారు. అడిగిన వారందరికీ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విడుదలైన ఖైదీలు మంచి పౌరులుగా ఉండి సమాజ సేవలో పాలుపంచుకోవాలని సూచించారు డీజీ. విడుదలవుతున్న ఖైదీల పట్ల కుటుంబం, సమాజం సానుభూతితో ఉండాలని కోరారు. విడుదల అవుతున్న ఖైదీలకు ఇదే ఆఖరి అవకాశం అని స్పష్టం చేశారు. అలాగే జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలకు తమ స్వగ్రామాలకు వెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని తెలిపారు.


జైళ్ళ వారీగా విడుదల అవుతున్న ఖైదీల వివరాలు..

  • చర్లపల్లి కేంద్ర కార్యాలయం నుండి- 61

  • హైదరాబాద్ కేంద్ర కారాగారం నుండి- 27

  • వరంగల్ కేంద్ర కారాగారం నుండి -20

  • చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుండి- 31

  • మహిళల ప్రత్యేక కారాగారం నుండి -35

  • సంగారెడ్డి కేంద్ర కారాగారం నుండి-1

  • నిజామాబాద్ కేంద్ర కారాగారం నుండి- 15

  • మహబూబ్నగర్ జిల్లా జైలు నుండి- 2

  • నల్లగొండ జిల్లా జైలు నుండి- 4

  • ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి- 3

  • కరీంనగర్ జిల్లా జైలు నుండి- 7

  • ఖమ్మం జిల్లా జైలు నుండి -4

  • ఆసీఫాబాద్ స్పెషల్ సబ్ జైలు- 3

  • మొత్తం 213 మంది నేడు విడుదలవుతున్నారు.

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 03 , 2024 | 02:23 PM