Congress: పోటాపోటీగా సంజయ్- జీవన్ రెడ్డి ఫ్లెక్సీలు
ABN , Publish Date - Jun 28 , 2024 | 01:21 PM
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పెద్ద దుమారం చెలరేగింది. సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. జీవన్ రెడ్డిని కూల్ చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రంగంలోకి దిగారు.
జగిత్యాల జిల్లా: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పెద్ద దుమారం చెలరేగింది. సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. జీవన్ రెడ్డిని కూల్ చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రంగంలోకి దిగారు. విడతలవారీగా చర్చలు జరిపారు. హైకమాండ్ పెద్దలు చర్చలు జరిపారు. తగిన ప్రాధాన్యం ఇస్తామని.. మంత్రి పదవి అంటూ చెప్పుకొచ్చారు. హైకమాండ్ పెద్దలతోపాటు సీఎం రేవంత్ రెడ్డిని జీవన్ రెడ్డి కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతా సర్దుకుంటుందని అనుకునే లోపు స్థానిక నేతల మధ్య వివాదం నెలకొంది.
ఏంటంటే..?
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనకు చెప్పి పార్టీలోకి వస్తే బాగుంటుందని జీవన్ రెడ్డి వర్గం అంటోంది. హైకమాండ్ పెద్దలు జీవన్ రెడ్డిని కూల్ చేశారు. అంతా సర్దుకుంటుందని అనుకునే లోపు మరో వివాదం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులు బస్టాండ్ వద్ద ప్లెక్సీ ఏర్పాటు చేశారు. జగిత్యాల డెవలప్ కోసం సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆ ఫ్లెక్సీ మీద రాశారు. ఎమ్మెల్యే సంజయ్‌కు అతని అనుచరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో జీవన్ రెడ్డి అనుచరులు భగ్గుమన్నారు.
మరో ఫ్లెక్సీ
కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నామని.. జగిత్యాల అంటే జీవన్.. జీవన్ అంటే జగిత్యాల అనేలా మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఫ్లెక్సీ పైన దీనిని ఏర్పాటు చేశారు. ఇలా సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. అభివృద్ధి కోసం పార్టీలో చేరామని ఒకరు అంటుంటే.. మరొకరు కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అంటున్నారు. అలకబూనిన జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ పెద్దలు మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుండటంతో జీవన్ రెడ్డికి మంత్రి పదవి రావొచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.