Share News

KCR: అమరులకు కేసీఆర్‌ నివాళి..

ABN , Publish Date - Jun 02 , 2024 | 02:38 AM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను బీఆర్‌ఎస్‌ ప్రారంభించింది. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే..! ఇందులో భాగంగా కేసీఆర్‌ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

KCR: అమరులకు కేసీఆర్‌ నివాళి..

  • అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ

  • ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్‌, హరీశ్‌

కవాడిగూడ/మంగల్‌హట్‌/అఫ్జల్‌గంజ్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను బీఆర్‌ఎస్‌ ప్రారంభించింది. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే..! ఇందులో భాగంగా కేసీఆర్‌ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కొవ్వొత్తిని చేతబట్టి పార్టీ నాయకులతో కలిసి.. సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభించారు. కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, పార్టీ నేతలు పాల్గొని.. అమరవీరుల స్థూపం వరకు పాదయాత్రగా వెళ్లారు. అక్కడ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తదితరులు తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ గీతాలను ఆలపించారు. ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


ఈ మట్టి బిడ్డగా గర్వపడుతున్నా: కేటీఆర్‌

అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్‌ ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్‌ 24 ఏళ్ల క్రితం టీఆర్‌ఎ్‌సను ప్రారంభించారు. 2001 ఏప్రిల్‌ నుంచి 2014 జూన్‌ వరకు అవిశ్రాంత పోరాటం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. వెనుకడుగు వేయలేదు. రాష్ట్రం ఏర్పడి దశాబ్దకాలమైంది. ఇక్కడ కనిపిస్తోన్న అందమైన సచివాలయం, అమరవీరుల జ్యోతి, ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహం తెలంగాణలో జరిగిన అభివృద్ధికి చిన్న ఉదాహరణ’’ అని వివరించారు. తెలంగాణ మట్టి బిడ్డగా గర్వపడుతున్నానన్నారు. పదేళ్లువిజయవంతంగా పభ్రుత్వాన్ని నడిపామని, దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు.


అమరుల స్మరించుకోవద్దా..?

అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో వారిని స్మరించుకునే అవకాశాన్ని రేవంత్‌ ప్రభుత్వం కల్పించడం లేదని బాల్క సుమన్‌, రసమయి ఆరోపించారు. కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతినిచ్చిన సర్కారు.. మైకుల వినియోగంపై నిషేధం విధించిందని వాపోయారు. ‘‘మైకులను పోలీసులు తీసుకెళ్లి మా గొంతులను ఆపలేరు. అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు గాయకుల గొంతులు, ప్రజల కోరస్‌ చాలు. పోలీసుల తీరు సరైంది కాదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా.. పోలీసులు మైకులను తీసుకెళ్లే సమయంలో మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, బాల్క సుమన్‌ తదితరులు వారితో వాగ్వాదానికి దిగారు.

Updated Date - Jun 02 , 2024 | 02:38 AM