KTR: మణిపూర్ పరిస్థితే లగచర్లలోనూ
ABN , Publish Date - Nov 19 , 2024 | 02:48 AM
తెలంగాణలోని లగచర్లలోనూ మణిపూర్ వంటి పరిస్థితే ఉందని, అక్కడి గిరిజనుల గోడు దేశమంతా వినాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తెలంగాణలో గిరిజనులకు న్యాయం దక్కడం లేదని, అందుకే వారి సమస్యను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చామని అన్నారు.
హక్కుల కోసం 9 నెలలుగా గిరిజనుల పోరాటం
దమనకాండపై రాహుల్, మోదీ స్పందించాలి
రూ.60 లక్షలు భూమికి రూ.8 లక్షలైనా ఇవ్వరా?
రేవంత్ రెడ్డి సోదరుడికి ఏ హోదాతో ప్రోటోకాల్?
ప్రభుత్వాన్ని అస్థిరపర్చం.. రేవంతే ఐదేళ్లూ ఉండాలి
ఆ తర్వాత 15 ఏళ్లు మేమే.. ఢిల్లీలో కేటీఆర్
న్యూఢిల్లీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని లగచర్లలోనూ మణిపూర్ వంటి పరిస్థితే ఉందని, అక్కడి గిరిజనుల గోడు దేశమంతా వినాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తెలంగాణలో గిరిజనులకు న్యాయం దక్కడం లేదని, అందుకే వారి సమస్యను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచాల్సిన అవసరం తమకు లేదని, ఐదేళ్లూ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. ఢిల్లీకి కావాల్సిన మూటలు అందించగల సత్తా రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు. అందుకే ఆయనే ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉంటాడని భావిస్తున్నానని, ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆ తర్వాత 15ఏళ్లు అధికారం తమదేనన్నారు. సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో లగచర్ల బాధితులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత లగచర్ల ఘటన, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల గత వ్యాఖ్యల వీడియోను ప్రదర్శించారు.
ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ మణిపూర్, ముంబైలోని ధారావి, యూపీలోని ఝాన్సీ ఘటనపై తాము విచారం వ్యక్తం చేస్తున్నామని, లగచర్ల ఘటన వాటికంటే తక్కువేం కాదన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజన మహిళలపై చేసిన అఘాయిత్యాలను దేశ ప్రజలందరికీ తెలిసేలా చేసేందుకే ఢిల్లీకి వచ్చామన్నారు. రైతులు, బీసీ, దళితులు, గిరిజనుల సంక్షేమం గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పదే పదే ప్రస్తావిస్తారని, అయితే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో గిరిజన మహిళల ఆవేదనను రాహుల్ వినాలన్నారు. అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఎలా లైంగిక దాడులు చేస్తున్నారో, ఎలా శారీరకంగా హింసించారో, ఎలా అరెస్టులు చేస్తున్నారో లగచర్ల బాధితులు వివరంగా చెబుతున్నారని, ఆ దమనకాండపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో తెలంగాణ అనే రాష్ట్రం ఉందని ప్రధాని మరిచిపోయారా? అని వ్యాఖ్యానించారు. 50 నుంచి 60 ఏళ్లుగా ఇవే భూములపై ఆధారపడి బతుకున్నామని, రేవంత్‌రెడ్డి అల్లుడి ఫార్మా కంపెనీ కోసం తమ భూములను కోల్పోవాలా? అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారన్నారు. తెలంగాణలో చిన్నపిల్లలు పిలిచినా వస్తానని చెప్పిన రాహుల్‌కు గిరిజన మహిళ ఆక్రందనలు ఎందుకు వినిపించటం లేదన్నారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాహుల్ మాటలు చెప్పడం కాదని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపాలన్నారు.
9 నెలలుగా పోరాడుతుంటే...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచిగిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఫార్మా విలేజ్ కోసం తమ భూములు ఇవ్వబోమని 9 నెలలుగా లగచర్ల రైతులు పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి సహా ఎవరూ వారికి సమయం ఇవ్వలేదన్నారు. కలెక్టర్ వచ్చినప్పుడు నిరసన తెలిపినందుకు వారిని అరెస్టు చేశారన్నారు. దాదాపు 30 మంది రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. సంగారెడ్డి జైలుకెళ్లి చూశామని, వాళ్లు నడవలేకపోతున్నారని తెలిపారు. కొట్టామని జడ్జి ముందు చెబితే మళ్లీ కొట్టి కుటుంబ సభ్యులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. లగచర్లలోనే కాదని, భూములు ఇవ్వబోమని సంగారెడ్డిలో కూడా రైతులు ఆందోళన చేశారన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా వాళ్ల ఫ్యామిలీ ప్యాకేజ్‌గా మార్చేస్తున్నారన్నారు. తాము ఫార్మాసిటీ కోసం దాదాపు 14 వేల ఎకరాల భూమి సేకరించామని, అయితే తాము రైతులను ఒప్పించి, మెప్పించి వారికి సరైన పరిహారం ఇచ్చామన్నారు. భూమి ఇచ్చే రైతులకు అన్యాయం జరగవద్దని కాంగ్రెస్ పార్టీయే భూసేకరణ చట్టం తీసుకొచ్చిందని, కానీ తెలంగాణలో గిరిజనుల భూముల విలువ రూ.60 లక్షలు ఉంటే, కనీసం రూ.8 లక్షలు కూడా ఇవ్వడం లేదన్నారు.
రేవంత్ ప్రైవేట్ సైన్యంగా పోలీసులు
సీఎం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం సోదరుడు రైతులను బెదిరిస్తూ, పాల్పడుతున్న అరాచకాలపై ఇప్పటికీ ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. ఆయన వార్డు సభ్యుడు కూడా కాదని, కానీ ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి కలెక్టర్ వచ్చి స్వాగతం పలుకుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అకృత్యాలపై, ప్రజల సమస్యలపై బీజేపీ నాయకులు మాట్లాడటం లేదన్నారు. లగచర్ల బాధితులకు ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని కేటీఆర్ అన్నారు. అఘాయిత్యాలకు పాల్పడిన పోలీసులకు నోటీసులు ఇస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. కేంద్రానికి కూడా మనసుంటే ఈ విషయంలో వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.