Share News

KTR : ప్రజల దృష్టి మళ్లించేందుకే దాడులు

ABN , Publish Date - Sep 15 , 2024 | 04:21 AM

‘‘రాష్ట్రంలో రోజుకో అంశంతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు.. ఇందులో భాగంగానే తమ ఎమ్మెల్యేలపై దాడులూ చేయిస్తున్నారు’’ అని కాంగ్రెస్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

KTR : ప్రజల దృష్టి మళ్లించేందుకే దాడులు

  • హామీలను మరిచి డైవర్షన్‌ రాజకీయాలు

  • రాష్ట్రంలో హెడ్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ నడుస్తోంది

  • శాంతిభద్రతలను కాపాడలేని అసమర్థ సీఎం

  • మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌ సిటీ/మియాపూర్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో రోజుకో అంశంతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు.. ఇందులో భాగంగానే తమ ఎమ్మెల్యేలపై దాడులూ చేయిస్తున్నారు’’ అని కాంగ్రెస్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడలేని అసమర్ధ, చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. శనివారం అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చిన కేటీఆర్‌.. కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య వివాదం, కౌశిక్‌రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరుల దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 9 నెలలుగా హెడ్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ నడుస్తోందని విమర్శించారు. హామీల అమలును దాటవేస్తూ పాలకులు గారడీ మాటలు చెబుతున్నారని విమర్శించారు.

పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేయాలన్న కౌశిక్‌రెడ్డి మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. కోర్టు తీర్పు వస్తే తమ పదవులు పోతాయని పార్టీ మారిన ఎమ్మెల్యేలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే రేవంత్‌రెడ్డికి తొత్తులుగా ఉన్న వారు తమపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి వంటి దౌర్భగ్యపు, చరిత్రహీన సీఎంను గతంలో ఎప్పుడూ చూడలేదని, పోలీసుల ఎస్కార్ట్‌తో ఓ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పాల్పడతారా? ఇదెక్కడి దుష్ట సంప్రదాయమని మండిపడ్డారు.


‘‘ఉమ్మడి ఏపీ సీఎంలుగా పని చేసిన చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డినే మేము ఎదుర్కొన్నాం. వారితో పోలిస్తే నువ్వు చాలా చిన్నోడివి.. చిట్టినాయుడు, బుల్లి అబ్బాయి వంటి వాడివి.. పదవి ఎవరికీ శాశ్వతం కాదు’’ అని రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో పోలీసులనూ వదిలిపెట్టమని, న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని చెప్పుకొన్న రేవంత్‌.. హైకోర్టు తీర్పు తర్వాత మాట మార్చారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ తమ వాళ్లేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు ఒక్క ప్రాంతీయ విద్వేష ఘటన చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. అందుకే హైదరాబాద్‌ ప్రజలు తమను కడుపునిండా ఆశీర్వదించారన్నారు. దీంతో హైదరాబాద్‌ ప్రజలపై సీఎం రేవంత్‌రెడ్డి పగపట్టారని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైడ్రాను తీసుకొచ్చి ఆగమాగం చేస్తున్నాడని దుయ్యబట్టారు.

  • దివ్యాంగుల ఇళ్లను కూలుస్తారా?

తిమ్మాజిపేట: ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహబూబ్‌నగర్‌లోని ఆదర్శనగర్‌లో అక్రమ నిర్మాణాల పేరుతో దివ్యాంగుల ఇళ్లను తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా నేరేళ్లపల్లిలోని ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలమూరు బిడ్డనంటూ గొప్పలు చె ప్పుకొనే సీఎం రేవంత్‌కి పేదోళ్లపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు.

Updated Date - Sep 15 , 2024 | 04:24 AM