Share News

Asaduddin Owaisi: కాంగ్రెస్‌కు మజ్లిస్‌ మద్దతు..

ABN , Publish Date - May 12 , 2024 | 04:04 AM

హైదరాబాద్‌ మినహా మిగతా లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఓటేయాలని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆ పార్టీ శ్రేణులకు సష్టమైన సంకేతమిచ్చారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా ధ్రువీకరించారు. ప్రచారం గడువు ముగియడానికి ముందు.. శనివారం మధ్యాహ్నం ఖిల్వత్‌ మైదానం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు.

Asaduddin Owaisi: కాంగ్రెస్‌కు మజ్లిస్‌ మద్దతు..

  • హైదరాబాద్‌ మినహా మిగతా స్థానాల్లో

  • కాంగ్రెస్‌కు ఓటేయాలని ఒవైసీ సంకేతం

  • కరీంనగర్‌, సికింద్రాబాద్‌ సహా

  • ఏడు నియోజకవర్గాల్లో గంపగుత్తగా

  • హస్తానికి ఓటు వేయాలని పిలుపు

  • ఇవి ‘మామూ’ ఎన్నికలు కావని స్పష్టీకరణ

    హైదరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మినహా మిగతా లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఓటేయాలని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆ పార్టీ శ్రేణులకు సష్టమైన సంకేతమిచ్చారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా ధ్రువీకరించారు. ప్రచారం గడువు ముగియడానికి ముందు.. శనివారం మధ్యాహ్నం ఖిల్వత్‌ మైదానం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ‘హైదరాబాద్‌లో పతంగ్‌ (మజ్లిస్‌ గుర్తు) ఎగరాలి. తెలంగాణలో బీజేపీ ఖతం కావాల’ని కార్యకర్తలకు సూచించారు. దీనికోసం హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని ఇతర లోక్‌సభ స్థానాల్లో బీజేపీయేతర జాతీయ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.


  • అంటే అక్కడ కాంగ్రె్‌సను గెలిపించాలని స్పష్టంగా సూచించారు. పలు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల పేరు చెప్పకపోయినా అందరికీ అర్థమయ్యేట్టు వారి రూపురేఖలను సూచిస్తూ వారికే ఓటేయాలని సూచించారు. ‘ఈ లోక్‌సభ ఎన్నికలు ‘మామూ’ (బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి) కోసం కాదు. మోదీని గద్దె దింపడానికి! మీకు అర్థం కాకపోతే మళ్లీ చెబుతున్నా.. సికింద్రాబాద్‌లో లావుగా ఉండే అభ్యర్థిని గెలిపించండి. నిజామాబాద్‌లో తెల్లజుత్తు ఎక్కువగా ఉండే అభ్యర్థికి విజయం చేకూర్చండి. చేవెళ్లలో సన్నగా ఉండే అభ్యర్థిని గెలిపించండి’ అని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌లో తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో బోగస్‌ ఓట్లు ఉన్నాయని ప్రచారం చేసిన బీజేపీ.. ఒక్క బోగస్‌ ఓటును తేల్చలేకపోయిందన్నారు. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ తన పేరుతో ఓట్లు దండుకుంటున్న బీజేపీ-మోదీపై రాముడు సైతం కోపంతో ఉన్నాడన్నారు.

Updated Date - May 12 , 2024 | 04:05 AM