Share News

Harish Rao: ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ అవగాహనా రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారు..

ABN , Publish Date - Jul 21 , 2024 | 06:08 PM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రభుత్వ నిధులను ఎక్కువగా ఖర్చుపెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు.

Harish Rao: ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ అవగాహనా రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారు..
Former Minister Harish Rao

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రభుత్వ నిధులను ఎక్కువగా ఖర్చుపెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు. శనివారం రోజున ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆయన చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.." మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ విమర్శలు కట్టిపెట్టి కాళేశ్వరాన్ని పునర్ వినియోగంలోకి తేవడంపై శ్రద్ధ పెట్టాలి. ఢిల్లీ వేదికగా ఆయన తన అవగాహనా రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారు. మేడిగడ్డ వద్ద అన్ని చర్యలు తీసుకున్నామని అంటూనే మట్టి పరీక్షలు సాధ్యపడలేదని చెప్తున్నారు. వరద రాకముందే సాంకేతిక పరీక్షలు పూర్తి చేయకపోవడానికి NDSA నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యమే కారణం. వరదల దృష్ట్యా పరీక్షలు ఆపేశామని చెప్పడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనం కాదా?. రక్షణ కోసం సూచనలు చేయడంలో NDSA దారుణంగా విఫలం అయింది.


నివేదికను తెప్పించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. మేడిగడ్డ బ్యారేజీకి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత. తుమ్మిడి హట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతామని మంత్రి ఉత్తమ్ చెప్తున్నారు. తుమ్మిడి హట్టిలో బ్యారేజీ ఏ ఎత్తు వద్ద కడతారో చెప్పాలి. 152మీటర్ల వద్ద కట్టాలని భావిస్తే ముందు మహారాష్ట్రను ఒప్పించాలి. ఆనాడు మహారాష్ట్రను ఒప్పించలేక పనులు చేయకుండా వదిలేసింది ఎవరు? ఆ వైఫల్యం మీది కాదా?. తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజీ కట్టినా లిఫ్ట్ లేకుండా ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్లవని ఉత్తమ్‌కు తెలీదా?" అని అన్నారు.

Updated Date - Jul 21 , 2024 | 06:09 PM