Currency Notes: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి..
ABN , Publish Date - Aug 01 , 2024 | 05:02 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ కృషి వల్లనే భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పడిందని, అటువంటి మహనీయుని ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద ధర్నాలో తెలుగు ఎంపీల డిమాండ్
న్యూఢిల్లీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ కృషి వల్లనే భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పడిందని, అటువంటి మహనీయుని ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బుధవారం, ఇక్కడ జంతర్ మంతర్‌లో కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ అధ్యక్షతన మహాధర్నా జరిగింది.
తెలుగు రాష్ట్రాల ఎంపీలు.. బలరాంనాయక్, అప్పలనాయడు, ఈటల రాజేందర్, ఆర్.కృష్ణయ్య ధర్నాకు హాజరై మద్దతు తెలిపారు. ఈ అంశాన్ని తమ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లి, పార్లమెంటులో పార్టీ ఎంపీలందరూ మాట్లాడే విధంగా కృషి చేస్తానని ఎంపీ బలరాం నాయక్ హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని, పార్లమెంటులో మాట్లాడుతానని ఈటల రాజేందర్ చెప్పారు.