Share News

Hyderabad: ‘వందేభారత్‌’కు స్వాగతం

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:19 AM

ప్రధాని మోదీ ప్రారంభించిన నాగపూర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు శనివారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌ చేరింది.

Hyderabad: ‘వందేభారత్‌’కు స్వాగతం

  • నాగపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ చేరిన రైలు

  • పాల్గొన్న గవర్నర్‌, కిషన్‌రెడ్డి, కోమటిరెడ్డి

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ప్రారంభించిన నాగపూర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు శనివారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌ చేరింది. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. రైల్వేల అభివృద్ధికి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని గవర్నర్‌ అన్నారు. ఢిల్లీ తర్వాత ఎక్కువగా వందేభారత్‌లు తెలంగాణకు కేటాయించడం గర్వకారణంగా ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


త్వరలోనే వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు రాబోతున్నాయన్నారు. రూ.700 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ఆధునికీకరిస్తున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వచ్చే ఏడాది, రూ.430కోట్లతో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్‌ త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నాగపూర్‌లో ఉంటున్న తెలంగాణ ప్రజలు రైలు ప్రయాణాలకే ప్రాధాన్యం ఇస్తారని, మహారాష్ట్ర, తెలంగాణ ఐటీఉద్యోగులకు వందేభారత్‌ ఎంతగానో ఉపయోగడపడుతుందన్నారు. వందేభారత్‌లకు రాష్ట్ర ప్రజల నుంచి అసాధారణ స్పందన ఉందని రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు.


  • చార్జీలు ప్రకటన

బర్కత్‌పుర: ప్రధాని మోదీ జెండా ఊపి సోమవారం ప్రారంభించిన నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ చార్జీలను రైల్వే అధికారులు ప్రకటించారు. 19 నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. నాగ్‌పూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు సాధారణ ఎక్స్‌ప్రె్‌సలలో (3ఏసీ/ఏసీ చైర్‌కార్‌) టికెట్‌ ధర రూ. 955 నుంచి రూ. 965 వరకు ఉండగా, వందేభారత్‌ ఏసీ చైర్‌కార్‌ టికెట్‌ ధర 1350గా నిర్ణయించారు. భోజనం/స్నాక్స్‌ కోరుకునే వారు రూ. 150 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - Sep 17 , 2024 | 03:19 AM