Share News

Nalgonda: యాదాద్రి థర్మల్‌ కేంద్రం వద్ద టౌన్‌షిప్‌

ABN , Publish Date - Nov 06 , 2024 | 03:34 AM

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం సమీపంలో కొత్త టౌన్‌షి్‌ప ఏర్పాటు కానుంది. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) రూ.928.52 కోట్ల అంచనాతో ఈ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షి్‌పను నిర్మించనుంది.

Nalgonda: యాదాద్రి థర్మల్‌ కేంద్రం వద్ద టౌన్‌షిప్‌

  • తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మాణం

  • 928.52 కోట్ల అంచనాలతో టెండర్‌ ప్రకటన

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం సమీపంలో కొత్త టౌన్‌షి్‌ప ఏర్పాటు కానుంది. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) రూ.928.52 కోట్ల అంచనాతో ఈ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షి్‌పను నిర్మించనుంది. ఇందుకోసం ఔత్సాహిక బిడ్డర్ల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ జెన్‌కో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 16 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు బిడ్లను ఆహ్వానించనున్నారు. టెక్నికల్‌ బిడ్లను డిసెంబరు 3న, ప్రైస్‌ బిడ్లను డి సెంబరు 7న తెరిచి టెండర్లను ఖరారు చేయనున్నారు. కృష్ణా నదిలో కలిసే తుంగపాడు వాగు తీరంలో ఈ టౌన్‌షిప్‌ నిర్మాణం జరగనుంది.


డిజైన్లు, డ్రాయింగ్స్‌ ప్రకారం మొత్తం 3,52,771.02 చ.మీ.ల విస్తీర్ణంలో ఈ టౌన్‌షిప్‌ నిర్మాణం జరగనుండగా, 2,21,903.67 చ.మీ.ల విస్తీర్ణంలో నివాస గృహ సముదాయాలతో లేఅవుట్‌ను రూపొందించారు. మరో 75,185 చ.మీ.ల విస్తీర్ణంలో పార్కులు, మొక్కల పెంపకం, పచ్చిక బయళ్లు, మరో 55,682.35 చ.మీ.ల విస్తీర్ణంలో రోడ్లు, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం నిర్మాణం 2025 మార్చి నాటికి పూర్తికావాల్సి ఉండగా, వేల సంఖ్యలో ఇంజనీరింగ్‌ అధికారులు, ఉద్యోగులు, ఇతర కార్మికులు ఇక్కడ రాత్రింబవళ్లు పనిచేయనున్నారు. వీరంతా తప్పనిసరిగా స్థానికంగా నివాసం ఉండాల్సిరావడంతో టౌన్‌షి్‌పను జెన్‌కో నిర్మిస్తోంది. 11 అంతస్తుల బహుళ అంతస్తుల సముదాయాల్లో ఈ క్వార్టర్లు ఉండనున్నాయి. కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించిన తర్వాత 30 నెలల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది.

Updated Date - Nov 06 , 2024 | 03:34 AM