HYD : ఆన్‌లైన్ బెట్టింగ్‌కు కుటుంబం బలి
ABN , Publish Date - Sep 02 , 2024 | 02:50 AM
ఆన్‌లైన్ బెట్టింగ్, ట్రేడింగ్ వ్యసనం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబాన్ని చిదిమేసింది. మూడేళ్లు, 11 ఏళ్ల వయస్సు ఉన్న అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును మింగేసింది.
భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
అప్పుల్లో కూరుకుపోయి తీవ్ర నిర్ణయం
హైదరాబాద్‌లో దారుణ ఘటన
జీడిమెట్ల/హైదరాబాద్ సిటీ, మంచిర్యాల, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
ఆన్‌లైన్ బెట్టింగ్, ట్రేడింగ్ వ్యసనం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబాన్ని చిదిమేసింది. మూడేళ్లు, 11 ఏళ్ల వయస్సు ఉన్న అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును మింగేసింది. ఆన్‌లైన్ ట్రేడింగ్, బెట్టింగ్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన భార్య, ఇద్దరు కుమారులను చంపి.. ఆ తర్వాత ఉరి వేసుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని గాజులరామారం ప్రాంతంలో జరిగింది. మంచిర్యాలకు చెందిన ఇప్ప వెంకటేష్ (40)కు భార్య వర్షిణి(33), కుమారులు రిషికాంత్ (11), విహాంత్ (3) ఉన్నారు.
కోకాపేట్‌లోని లెగోటో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వెంకటేష్.. భార్యాపిల్లలతో కలిసి గాజులరామారం, బాలాజీ లే అవుట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌తోపాటు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన వెంకటేష్.. తెలిసిన వారి దగ్గర మాత్రమే కాక లోన్ యాప్‌ల్లోనూ రుణాలు తీసుకున్నాడు. అన్నింటిలోనూ నష్టపోయి రూ.25లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయాడు. చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని పోషించ లేక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు.
దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి?
తాను లేకపోతే భార్యాపిల్లలు రోడ్డున పడతారనే భావనతో ముందుగా వారిని హత్య చేసి ఆపై గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి వెంకటేష్ తన భార్య, ఇద్దర పిల్లలను హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, అప్పుల బాధ తాళలేక తామంతా ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో వెంకటేష్ తన తండ్రి ఫోన్‌కి మెసేజ్ పెట్టాడు. ఉదయం 3.30 గంటల ప్రాంతంలో ఆ మెసేజ్ చూసిన వెంకటేష్ తండ్రి.. కుమారుడు నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి అప్రమత్తం చేసినా ఫలితం లేకపోయింది. ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో ఇరుగుపొరుగు వారు తలుపులు పగలకొట్టి ఇంట్లోకి వెళ్లి చూసే సరికి కుటుంబం అంతా విగతజీవులై పడి ఉన్నారు. విషయం తెలిసి ఘటనా స్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటేష్ తన భార్య, ఇద్దర కుమారులకు విషం ఇచ్చి చంపాడా ? లేదా దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హతమార్చాడా ? అనేది తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.