Share News

Hyderabad: సచివాలయ ముట్టడి ఉద్రిక్తం..

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:28 AM

గ్రూప్‌ 2,3 పోస్టులను పెంచాలని.. గ్రూప్‌-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని పలు సంఘాలు.. స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.

Hyderabad: సచివాలయ ముట్టడి ఉద్రిక్తం..

  • ఏఐఎ్‌సఎఫ్‌, బీసీ సంఘాల నేతల అరెస్టు

  • సెంట్రల్‌ లైబ్రరీలో నిరుద్యోగుల మెరుపు ధర్నా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): గ్రూప్‌ 2,3 పోస్టులను పెంచాలని.. గ్రూప్‌-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని పలు సంఘాలు.. స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సచివాలయ ముట్డడికి యత్నించిన ఏఐఎ్‌సఎఫ్‌ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు, స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు.


సమగ్ర కుల గణన జరిపి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, మెగా డీఎస్సీ వేయాలని, గ్రూప్‌-2, 3 పోస్టులను పెంచాలని డిమాండ్‌ చేస్తూ బీసీ కులాలు, బీసీ సంఘాల ఐక్య వేదిక, బీసీ జన సభ, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య, హిందూ బీసీ మహాసభ, ఆలిండియా ఓబీసీ జేఏసీ, బీఆర్‌ఎస్వీ నేతలు నల్లపోచమ్మ దేవాలయం నుంచి మీడియా పాయింట్‌ మీదుగా సచివాలయం వైపు దూసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అడ్డుకున్నారు. సచివాలయ ముట్టడికి మద్దతు పలికిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యను సోమవారం ఉదయమే పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.


డీఎస్సీ వాయిదా వేయాలని ధర్నా

చిక్కడపల్లి సిటీ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు సాయంత్రం మెరుపు ఆందోళనకు దిగారు. తొలుత అభ్యర్థులంతా లైబ్రరీ నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ మీదుగా శాంతి ర్యాలీ తీసేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. లైబ్రరీ నుంచి ఎవరూ బయటకు రాకుండా గేటుకు తాళం వేశారు. దీంతో నిరుద్యోగులంతా అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో పెద్దఎత్తున ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ దిగింది. దీంతో నిరుద్యోగులంతా లైబ్రరీ లోపలికి పరుగులు తీశారు. ఓసారి పోలీసులు ముందుకు రావడం.. మరోసారి వెనక్కి వెళ్లడం.. ఇదే క్రమంలో నిరుద్యోగులు వెనక్కి, ముందుకు పరుగులు తీశారు. రెండు గంటలకు పైగా ఆందోళన కొనసాగింది. లైబ్రరీ గేటు దాటి వచ్చిన దాదాపు 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులు దిల్‌సుఖ్‌నగర్‌లోని కమల ఆస్పత్రి ముందు సోమవారం రాత్రి ధర్నా చేశారు.

Updated Date - Jul 16 , 2024 | 04:28 AM