Share News

Seethakka: చిన్నారి హత్యాచారం కేసును.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపిస్తాం..

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:57 AM

తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేయడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఈ కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపి, దారుణానికి పాల్పడిన వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.

Seethakka: చిన్నారి హత్యాచారం కేసును..  ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ  జరిపిస్తాం..

  • బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: శ్రీధర్‌ బాబు

  • పోలీసింగ్‌ను మెరుగుపరుచుకోవాలి: సీతక్క

సుల్తానాబాద్‌, జూన్‌ 16: తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేయడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఈ కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ జరిపి, దారుణానికి పాల్పడిన వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి సమీపంలోని రైస్‌మిల్లుల ప్రాంతంలో రెండు రోజుల క్రితం జరిగిన చిన్నారి అత్యాచారం, హత్య కేసు వివరాలను తెలుసుకునేందుకు మంత్రులు శ్రీధర్‌ బాబు, సీతక్క ఆదివారం సుల్తానాబాద్‌కు వచ్చారు. కార్మిక దంపతులు నివసించే ప్రాంతాన్ని, చిన్నారిని ఎత్తుకుపోయి అఘాయిత్యానికి పాల్పడిన ప్రదేశాన్ని, మిల్లులోని సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలను మంత్రులు పరిశీలించారు. అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడారు.


బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. చిన్నారి తండ్రికి వారి స్వస్థలంలో ఉద్యోగంతో పాటు బాధిత దంపతుల చిన్న కూతురు బాధ్యతలను కూడా ప్రభుత్వం చూస్తుందన్నారు. రైస్‌ మిల్లు యజమాని రూ.5.5 లక్షలు ఇచ్చారని, ప్రభుత్వ పరంగా రూ.2.5 లక్షల పరిహారం ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థలను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క అన్నారు. పెట్రోలింగ్‌ వ్యవస్థను పెంచుకోవాలని.. డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తుకు బానిసలైన వారిని గుర్తించాలని, వారికి ప్రత్యేకమైన కౌన్సెలింగ్‌లు ఇస్తూ నేరాలు జరగకుండా అరికట్టాలన్నారు. కాగా, బాలికపై హత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 17 , 2024 | 03:57 AM