Share News

Hyderabad: తెలంగాణ తల్లి ఉత్సవం..

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:55 AM

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ ఏడాది డిసెంబరు 9న సచివాలయం సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘తెలంగాణ తల్లి ఉత్సవం’ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రకటించారు.

Hyderabad: తెలంగాణ తల్లి ఉత్సవం..

  • ఇకపై ఏటా డిసెంబరు 9న నిర్వహణ: సీఎం రేవంత్‌

  • ఈ ఏడాది ఆ రోజున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

  • సోనియాగాంధీని ఆహ్వానిస్తామన్న సీఎం

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ ఏడాది డిసెంబరు 9న సచివాలయం సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘తెలంగాణ తల్లి ఉత్సవం’ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రకటించారు. ఇందులో భాగంగా వచ్చే డిసెంబరు 9న సచివాలయంలో నిర్వహించే కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉత్సవంలో భాగంగా సచివాలయంలో ఆ రోజు సోనియాగాంధీ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన వివరించారు. అయితే, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర చిహ్నంపై ప్రభుత్వం ఇటీవల అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించింది.


మార్పులు చేసిన చిహ్నం, విగ్రహ రూపం, రాష్ట్ర గీతాన్ని ఈ నెల 2న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి తొలుత అనుకున్నారు. కానీ, రాష్ట్ర చిహ్నం విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు, ఇతర ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం జూన్‌ 2న రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను మాత్రమే ఆవిష్కరించింది. రాష్ట్ర చిహ్నం విషయమై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించారు. ఇదే సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపంపైనా చర్చించే అవకాశాలున్నాయి. డిసెంబరు 9న ఆవిష్కరించే తెలంగాణ తల్లి విగ్రహం కొన్ని మార్పులతో కొత్త రూపంతో ఉండనుందని తెలుస్తోంది.

Updated Date - Jun 06 , 2024 | 03:55 AM