Share News

Supreme Court: చార్జిషీట్ల సమాచారం ఇవ్వలేరా?

ABN , Publish Date - Oct 05 , 2024 | 03:55 AM

సూర్యాపేట డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ వట్టె జానయ్య పెట్టిన కేసుల విచారణలో తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Supreme Court: చార్జిషీట్ల సమాచారం ఇవ్వలేరా?

  • ఈ తప్పులకు ఎవరిది బాధ్యత?

  • తెలంగాణ డీజీపీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు

  • వట్టే జానయ్య కేసుపై విచారణ

న్యూఢిల్లీ, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ వట్టె జానయ్య పెట్టిన కేసుల విచారణలో తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చార్జీషీట్‌ దాఖలు చేసిన తేదీల గురించి కూడా ప్రభుత్వ న్యాయవాదులు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన క్రిమినల్‌ కేసుల విచారణలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపింది. ఇలాంటి ఘటనలు పదేపదే పునరావృతమవుతున్నాయని, ఇది డిఫాల్ట్‌ పరిస్థితి అని వ్యాఖ్యనించింది.


తాను బీఆర్‌ఎ్‌సను వీడి బీఎస్పీలో చేరాక అప్పటి రాష్ట్రప్రభుత్వం క్రిమినల్‌ వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ వట్టే జానయ్య గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గత మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా ఛార్జిషీటే దాఖలు తేదీ విషయంలో ఇరు పక్షాలకు చెందిన న్యాయవాదుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో డీజీపీని శుక్రవారంనాటి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ హృషికే్‌షరాయ్‌, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర డీజీపీ జితేందర్‌ వర్చువల్‌గా కోర్టుకు హజరయ్యారు.


ప్రభుత్వ న్యాయవాది వాదనలలో తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయనను ధర్మాసనం ప్రశ్నించింది. అధికారుల పొరపాటు వల్ల చార్జీషీట్లలో తేదీలను పేర్కొనలేదని, ఇలాంటివి పునరావృతం కానివ్వబోమని డీజీపీ హామీ ఇచ్చారు. సంబంధిత అధికారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీజీపీ సమాధానంతో ధర్మాసనం సంతృప్తి చెందలేదు. చార్జ్‌షీట్ల సమాచారం కమాండ్‌ సెంటర్‌లో బటన్‌ క్లిక్‌ చేస్తే సులభంగా లభిస్తుందని జస్టిస్‌ భట్టి పేర్కొన్నారు. దాంతో ప్రభుత్వ న్యాయవాదికి సమాచారం ఇవ్వకపోవడం పోలీసు అధికారులదే తప్పు అని డీజీపీ అంగీకరించారు. తాము గుర్తించిన తప్పులపై స్పష్టమైన వివరాలతో నాలుగు వారాలలో అఫిడవిట్‌ చేయాలని డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated Date - Oct 05 , 2024 | 03:56 AM