Share News

Supreme Court: కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం..

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:30 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది.

Supreme Court: కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం..

  • ఆమె దుర్భలమైన మహిళ కాదని హైకోర్టు పేర్కొంది

  • ప్రతివాదుల వాదన విన్న తర్వాతే నిర్ణయం

  • బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

  • తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది. ఈడీ, సీబీఐ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆమె ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(క్రిమినల్‌) దాఖలు చేశారు.


దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌రోహత్గీ, విక్రమ్‌చౌదరితోపాటు మోహిత్‌రావు హాజరయ్యారు. తొలుత ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో కవిత గత ఐదు నెలల నుంచి జైలులోనే ఉన్నారని తెలిపారు. దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ ఇప్పటికే ఛార్జిషీట్లు దాఖలు చేశాయని ఽవెల్లడించారు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాలు వరుసగా మధ్యంతర, సాధారణ బెయిల్‌ పొందారని వివరించారు. సెక్షన్‌ 45 ప్రకారం ఓ మహిళగా కవితకు బెయిల్‌ ఇవ్వాలని కోరారు.


జస్టిస్‌ బీఆర్‌ గవాయి స్పందిస్తూ.. ‘కవిత బాగా చదువుకున్న మహిళ, రాజకీయ వేత్త’ అని అన్నారు. దీనికి ముకుల్‌ రోహత్గీ బదిలిస్తూ.. కవిత మాజీ పార్లమెంట్‌ సభ్యురాలని తెలిపారు. మరోసారి ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఏది ఏమైనప్పటికీ కవిత ‘‘దుర్భలమైన’’ మహిళ కాదని హైకోర్టు పేర్కొన్న అంశాన్ని గుర్తు చేశారు. కవిత పిటిషన్లపై దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. మళ్లీ ముకుల్‌ రోహత్గీ కలుగజేసుకుని అప్పటి వరకు కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరారు. దర్యాప్తు సంస్థల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.

Updated Date - Aug 13 , 2024 | 04:30 AM