Share News

Engineering Seats: రెండో దశ కౌన్సెలింగ్‌కు.. 29,777 ఇంజనీరింగ్‌ సీట్లు

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:15 AM

రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశలో సీట్లు పొందిన వారిలో ఎక్కువ మంది కాలేజీల్లో చేరలేదు. దీంతో 22,753 సీట్లు మిగిలిపోయాయి.

Engineering Seats: రెండో దశ కౌన్సెలింగ్‌కు..  29,777 ఇంజనీరింగ్‌ సీట్లు

  • మొదటి దశలో.. సీట్లు వచ్చినా కాలేజీల్లో చేరనివారు పెద్ద సంఖ్యలోనే!

  • 27, 28 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు.. రెండో దశలో 31న సీట్ల కేటాయింపు

  • వెబ్‌ ఆప్షన్లకు ఒక్కరోజు ముందు కొత్తసీట్లకు అనుమతిపై అనుమానాలు

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశలో సీట్లు పొందిన వారిలో ఎక్కువ మంది కాలేజీల్లో చేరలేదు. దీంతో 22,753 సీట్లు మిగిలిపోయాయి. తాజాగా శుక్రవారం మరో 7,024 సీట్లకు కొత్తగా అనుమతిచ్చారు. ఫలితంగా రాష్ట్రంలో రెండవ దశ కౌన్సెలింగ్‌కు మొత్తం 29,777 ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లయింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి సంబంధించి ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటి దశకు ముందు 78,694 ఇంజనీరింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు అనుమతించారు. అభ్యర్థులు పెట్టుకున్న అప్షన్ల ఆధారంగా 75,200 సీట్లను మొదటి దశలో కేటాయించారు. ఈ సీట్లు పొందిన అభ్యర్థుల్లో చాలా మంది కాలేజీల్లో చేరలేదు.


సీట్లు పొందిన వారిలో 55,941 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో రిపోర్ట్‌ చేశారు. మిగతా సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ప్రస్తుతం రెండవ దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే స్లాట్‌ల నమోదు గడువు ముగిసింది. 27, 28 తేదీల్లో అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా 31న సీట్లను కేటాయించనున్నారు. కాగా, వెబ్‌ ఆప్షన్లకు ఒక్క రోజు ముందు కొత్తగా సీట్లను అనుమతించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి దశలోనే ఈ సీట్లను అనుమతిస్తే.. విద్యార్థులకు ప్రయోజనం కలిగేదన్న అభిప్రాయం ఉంది.. ఈ విషయంలో విద్యా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందుగానే రాష్ట్రంలో కొత్తగా 10 వేల సీట్లను అనుమతించాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు.


అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించిన సీట్లకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం అధికారులు ప్రతిపాదనలను పంపించారు. వాటిలో రెండు వేలకు పైగా సీట్లకు మాత్రమే మొదటి దశ కౌన్సెలింగ్‌కు అనుమతించారు. మిగిలిన సీట్లపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీరా మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత మిగిలిన 7 వేలకు పైగా సీట్లకు అనుమతిచ్చారు. దీని ద్వారా ప్రతిభ గల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం ఉంది. మొదట్లోనే ఈ సీట్లను అనుమతించి ఉంటే అందుకు తగ్గట్టుగా విద్యార్థులు తమ వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకునేవారు. దాంతో మెరుగైన కాలేజీల్లో తాము అనుకున్న కోర్సులో సీటు లభించేది.


కానీ.. ఈ సీట్లను రెండోదశలో అనుమతించడంతో, మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపరు. ఇప్పటికే ఏదో ఒక కాలేజీలో సీటు రావడంతో సర్దుబాటు అవుతారు. పైగా రెండవ దశ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవడానికి ఒక్కరోజు ముందు ఈ సీట్లకు అనుమతివ్వడం వల్ల.. విద్యార్థుల్లో కొంత గందరగోళం ఏర్పడి వెబ్‌ ఆప్షన్లను సరిగ్గా నమోదు చేసుకోలేదు. ఫలితంగా ఈ సీట్లు భారీ సంఖ్యలో మిగిలే అవకాశం ఉందని.. వాటిని చివరకు ఆయా కాలేజీలే మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేసుకుంటాయనే వాదన వినిపిస్తోంది. మేనేజ్‌మెంట్‌ కోటా అంటే భారీగా డబ్బు వసూలు చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల కాలేజీలకు ఆర్థికంగా ప్రయోజనంకలుగుతుంది. దీన్ని నివారించడంలో.. విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Jul 27 , 2024 | 04:15 AM