Share News

Regional Centers: క్యాన్సర్‌ చికిత్సకు 5 రీజినల్‌ కేంద్రాలు

ABN , Publish Date - Sep 28 , 2024 | 03:33 AM

రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితులు ఏటేటా పెరుగుతుండడంతో క్యాన్సర్‌ వైద్య సేవలను జిల్లాలకు కూడా విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Regional Centers: క్యాన్సర్‌ చికిత్సకు 5 రీజినల్‌ కేంద్రాలు

  • కొత్తగూడెం, ఆదిలాబాద్‌, పాలమూరు, సంగారెడ్డి, కరీంనగర్‌లలో

  • ఒక్కో కేంద్రం 50 కోట్లతో.. ఏటేటా పెరుగుతున్న క్యాన్సర్‌ బాధితులు

  • ప్రస్తుతం ఎంఎన్‌జేలోనే చికిత్స.. సేవల విస్తరణకు సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితులు ఏటేటా పెరుగుతుండడంతో క్యాన్సర్‌ వైద్య సేవలను జిల్లాలకు కూడా విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ చికిత్స కేవలం హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండగా.. ఇకపై జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్‌ రీజినల్‌ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో కొత్తగూడెం, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, కరీంనగర్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రాన్ని రూ.50 కోట్లతో ఆధునిక వసతులతో నిర్మించనున్నారు. ఆ తర్వాత దశలవారీగా మిగిలిన జిల్లా కేంద్రాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించడం, స్ర్కీనింగ్‌ చేయడం, ఆయా జిల్లాల్లో ఉన్న క్యాన్సర్‌ రోగులకు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆస్పత్రి వైద్యులు సూచించిన చికిత్సనందించడం వంటివి ఈ సెంటర్ల ప్రథమ లక్ష్యం.


ఇందుకోసం ఆయా కేంద్రాల్లో ఆంకాలజిస్టులను, రేడియాలజిస్టులను నియమించడంతోపాటు జిల్లా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు, సిబ్బందికి శిక్షణ ఇస్తారు. అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుతారు. ఇక వరంగల్‌లో ఇప్పటికే ఉన్న రీజినల్‌ కేన్సర్‌ సెంటర్‌ను.. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆస్పత్రి తరహాలో పూర్తి స్థాయి వైద్య సేవలందేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో కేన్సర్‌ మహమ్మారి ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ రీజినల్‌ సెంటర్ల ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ కేన్సర్‌ రిజిస్ర్టీ ప్రోగ్రామ్‌(ఎన్‌సీఆర్‌పీ) అంచనా ప్రకారం తెలంగాణలో రోజూ సగటున 150-160 మంది కేన్సర్‌ బారిన పడుతున్నారు. 2016లో కొత్తగా 43,129 కేన్సర్‌ కేసులు నమోదు కాగా, 2018 నాటికి ఆ సంఖ్య 52 వేలకు చేరింది. కాగా, 2030 నాటికి ఏటా 65 వేల మంది కేన్సర్‌ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని ఎన్‌సీఆర్‌పీ హెచ్చరించింది. కేన్సర్‌ కారణంగా ఏటా 20వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన దగ్గర 65 శాతం కేన్సర్లకు జీవనశైలి మార్పులు, కాలుష్యమే కారణమని నిపుణులు అంటున్నారు.


  • ప్రస్తుతం ఎంఎన్‌జే ఆస్పత్రి ఒక్కటే..

రాష్ట్రంలో ఓవైపు కేన్సర్‌ కేసులు పెరుగుతున్నా.. అందుకు తగ్గట్లుగా బాధితులకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండటం లేదు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1955లో ప్రారంభించిన ఎంఎన్‌జే ఆస్పత్రి ఒక్కటే ఇప్పటికీ కేన్సర్‌ రోగులకు చికిత్స అందిస్తోంది. ఆ తరువాత మరో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి. ఎంఎన్‌జే ఆస్పత్రిలో ప్రస్తుతం 750 పడకలున్నా.. రోగుల రద్దీకి అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో డే కేర్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. కీమోథెరపీ చేసిన రోగులను ఒకటి రెండు గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచి, అదేరోజు సాయంత్రానికల్లా డిశ్చార్జ్‌ చేస్తున్నారు. తెలంగాణతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ నుంచి కూడా ఇక్కడికి రోగులు వస్తున్నారు. రోజూ 650-750 వరకు ఓపీ సంఖ్య నమోదవుతోంది. వరంగల్‌లో రీజనల్‌ కేన్సర్‌ సెంటర్‌ ఉన్నప్పటికీ.. అక్కడ పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు.


  • 70 శాతం మందికి కీమోథెరపీ అవసరం

కేన్సర్‌ రోగుల్లో 70 శాతం మందికి కీమోథెరపీ అవసరమవుతుంది. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి మూడు వారాలకు ఒకసారి కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది. దీంతో కనీసం నెలకు ఒక్కసారైనా బాధితులు ఆస్పత్రులకు రావాలి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ కింద వారికి రవాణా చార్జీలు కూడా చెల్లిస్తున్నారు. ఇలా రోజుకు సుమారు రూ.20వేలు పేషెంట్ల రవాణా చార్జీలకే చెల్లిస్తున్నామని ఎంఎన్‌జే ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని రీజినల్‌ కేన్సర్‌ సెంటర్ల ఏర్పాటుకు గతంలోనే జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద నిధులిచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అయితే నాటి కేసీఆర్‌ సర్కారు దృష్టి పెట్టకపోవడంతో అడుగు ముందుకుపడలేదు.

Updated Date - Sep 28 , 2024 | 03:33 AM