Share News

Mahabubabad: తెలంగాణ యువకుడికి సైబర్‌ చెర.. విముక్తి

ABN , Publish Date - Jul 08 , 2024 | 03:10 AM

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం కాంబోడియాకు వెళ్లి.. అక్కడ సైబర్‌ నేరాలు చేసే ముఠా చేతిలో చిత్రహింసలు అనుభవించిన తెలంగాణవాసి మున్సిఫ్‌ ప్రకాశ్‌కు ఆ చెర నుంచి విముక్తి లభించింది.

Mahabubabad: తెలంగాణ యువకుడికి సైబర్‌ చెర.. విముక్తి

  • కాంబోడియా నుంచి ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్న తెలంగాణ యువకుడు

  • సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ పేరిట ఆ దేశానికి.. అక్కడ సైబర్‌ క్రైమ్స్‌ చేయాలంటూ వేధింపులు

  • కాదన్నందుకు మత్తు ఇంజెక్షన్లు, చిత్రహింసలు

  • వాట్సాప్‌ కాల్‌తో సోదరుడికి ప్రకాశ్‌ కబురు

  • అతణ్ని కాపాడేందుకు రంగంలోకి పోలీసులు

  • కాంబోడియాలోని భారత ఎంబసీకి వివరాలు

  • ప్రకాశ్‌తోపాటు మరో 9 మంది భారత్‌కు రాక

బయ్యారం (మహబూబాబాద్‌ జిల్లా), జూలై 7: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం కాంబోడియాకు వెళ్లి.. అక్కడ సైబర్‌ నేరాలు చేసే ముఠా చేతిలో చిత్రహింసలు అనుభవించిన తెలంగాణవాసి మున్సిఫ్‌ ప్రకాశ్‌కు ఆ చెర నుంచి విముక్తి లభించింది. అక్కడ 45 రోజులపాటు నరకం అనుభవించిన అతడు.. తిరిగి తన స్వస్థలమైన గంధంపల్లికి (మహబూబాబాద్‌ జిల్లా, బయ్యారం మండలం) సురక్షితంగా తిరిగొచ్చాడు. గంధంపల్లికి చెందిన మున్సిఫ్‌ రాజు-విజయ దంపతులకు ప్రశాంత్‌, ప్రకాశ్‌ సంతానం. వీరిలో ప్రకాశ్‌ బీటెక్‌ (సివిల్‌ ఇంజనీరింగ్‌) పూర్తి చేశాడు. అవివాహితుడైన ప్రకాశ్‌.. జీవనోపాధి కోసం ఆరునెలల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ప్రయత్నించగా, కాంబోడియా దేశంలోని ఫ్నోమ్‌పెన్‌ సిటీకి పంపించారు. ఏజెన్సీ వారు సాఫ్ట్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగం అని చెప్పి పంపగా.. అక్కడివారు అతడితో సైబర్‌ నేరాలు చేయించేందుకు ప్రయత్నించారు.


వారు చెప్పిన పని చేసేందుకు ససేమిరా అనడంతో కంపెనీ వాళ్లు వేధింపులకు గురిచేశారు. అతడికి మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో అతడు వాట్సా్‌పకాల్‌ ద్వారా తన దుస్థితి గురించి అన్న ప్రశాంత్‌కు తెలియజేశాడు. తనను గదిలో బంధించి, ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ వీడియో కాల్‌లో విలపించాడు. ఆ వీడియో అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన మహబూబాబాద్‌ ఎస్పీ సుధీర్‌రాంనాథ్‌ కేకన్‌.. అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి, ప్రకాశ్‌ను కాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.


మరోవైపు.. మానుకోట మాజీ ఎంపీ మాలోత్‌ కవిత కూడా కాంబోడియాలో తనకు తెలిసినవారికి ఈ విషయాన్ని తెలియపరిచి.. ప్రకాశ్‌కు సహాయం అందించాలని కోరారు. వీరందరి ప్రయత్నాలకు తోడు.. అక్కడున్న భారత ఎంబసీ అధికారుల ద్వారా న్యాయపోరాటం చేసిన ప్రకాశ్‌ ఎట్టకేలకు తిరిగి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నాడు. శనివారం ఢిల్లీకి వచ్చి.. అక్కణ్నుంచీ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకున్నాడు. రాత్రి స్వస్థలం గంధంపల్లికి చేరుకున్నాడు.


45 రోజుల అనంతరం ప్రకాశ్‌ రావడంతో కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. దీనిపై ప్రకాశ్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. కాంబోడియాలో తనతోపాటు మరో తొమ్మిది మంది కూడా చిత్రహింసలకు గురయ్యారని, వారు కూడా తనతోపాటే తిరిగొచ్చారని తెలిపాడు. తాము స్వదేశానికి వస్తామని అనుకోలేదని అతడు వాపోయాడు. తమను ఇక్కడికి తీసుకురావడానికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు, అక్కడి ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Updated Date - Jul 08 , 2024 | 03:10 AM