Share News

TG : సగానికి పైగా నిండిన ఎస్సారెస్పీ

ABN , Publish Date - Aug 07 , 2024 | 05:56 AM

గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్‌ నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. ప్రాజెక్టులోకి 12 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

TG : సగానికి పైగా నిండిన ఎస్సారెస్పీ

  • శ్రీశైలానికి భారీగా వరద.. గేట్లన్నీ ఓపెన్‌

  • పులిచింతల్లో రెండేళ్ల తర్వాత విద్యుదుత్పత్తి

  • శ్రీశైలానికి భారీగా వరద.. గేట్లన్నీ ఓపెన్‌.. నాగార్జున సాగర్‌, పులిచింతలకూ భారీగా ఇన్‌ఫ్లో

  • ఖమ్మం, మహబూబాబాద్‌, పాలమూరు జిల్లాల్లో వర్షం

  • తల్లాడలో 12.8 సెం.మీ.. పత్తి చేలల్లో నిలిచిన వరద

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌): గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్‌ నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. ప్రాజెక్టులోకి 12 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితేనే శ్రీరాంసాగర్‌కు ఇన్‌ఫ్లో పెరిగే అవకాశాలున్నాయి. ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 46.06 టీఎంసీల నీరు ఉంది.

కృష్ణా పరిధిలో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 2.97 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 2 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వర ద వస్తుంటే దాదాపు అంతే స్థాయిలో ఔట్‌ఫ్లో ఉంది. జూరాలకు 2.52 లక్షల క్యూసెక్కులు, తుంగభద్రకు 84 వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3.71 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేసి.. 3.99 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు.

సాగర్‌కు 3.14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 22 గేట్ల ద్వారా 3.54 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు 3.71 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... గేట్లు ఎత్తి... 1.08 లక్షలను ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. ఇక్కడ రెండేళ్ల తర్వాత జలవిద్యుదుత్పత్తి చేపట్టడం గమనార్హం. సాగర్‌ నుంచి కృష్ణమ్మ పొంగిపొర్లుతుండటంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.


కాగా సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలోని ఎలిమినేటి మాధవరెడ్డి (ఏఎమ్మార్పీ) వరద కాల్వకు సోమవారం రాత్రి గండిపడింది. నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేంపల్లి వద్ద గండిపడటాన్ని రైతులు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని నిలుపివేసి.. గండి పూడ్చివేత పనుల్లో నిమగ్నమయ్యారు. మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఖమ్మం, మహబూబాబాద్‌, పాలమూరు జిల్లాల్లో భారీ వర్షం పడింది.

ఖమ్మం జిల్లా తల్లాడ, వైరా, కల్లూరు, కొణిజర్ల, రఘునాథపాలెంలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. తల్లాడలో 12.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌ శివారులోని జంగిలిగొండ శివారు దూర్యతండాలో చెట్లు విరిగిపడ్డాయి. పత్తి చేలల్లో నీళ్లు నిలిచాయి. పాలమూరు జిల్లా దేవరకద్ర, రాజాపూర్‌, జడ్చర్ల, గండీడ్‌, బాలానగర్‌ మండలాల్లో వర్షం పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి.

Updated Date - Aug 07 , 2024 | 05:56 AM