Share News

US Embassy: మన ముంగిట.. అమెరికా చదువు

ABN , Publish Date - Aug 17 , 2024 | 04:30 AM

అమెరికాలో చదవడం చాలామంది విద్యార్థుల కల. అలాంటివారికి అగ్ర రాజ్యంలో లభించే అవకాశాలు, ఉపకార వేతనాలు, డిమాండ్‌ ఉన్న కోర్సులు, ఫీజులు,

US Embassy: మన ముంగిట.. అమెరికా చదువు

  • హైదరాబాద్‌లో ‘‘ఎడ్యుకేషన్‌ యూఎ్‌సఏ ఫెయిర్‌’’కు ఆదరణ

  • 1,500 మంది విద్యార్థులు హాజరు..

  • 6 గంటల పాటు సదస్సు పాల్గొన్న అమెరికాలోని 55 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు

  • నిరుటి కంటే అధికమని తెలిపిన కాన్సులేట్‌ జనరల్‌ ప్రతినిధి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): అమెరికాలో చదవడం చాలామంది విద్యార్థుల కల. అలాంటివారికి అగ్ర రాజ్యంలో లభించే అవకాశాలు, ఉపకార వేతనాలు, డిమాండ్‌ ఉన్న కోర్సులు, ఫీజులు, ఉపాధి అవకాశాలు తదితర అంశాల పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా అమెరికా రాయబార కార్యాలయం భారత్‌లో ఫెయిర్‌లను నిర్వహిస్తోంది. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల ప్రతినిధులను తీసుకొచ్చి ‘ఎడ్యుకేషన్‌ యూఎ్‌సఏ యూనివర్శిటీ’ పేరిట కొన్నేళ్లుగా సదస్సులు ఏర్పాటు చేస్తోంది.


త్వరలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంతో పాటు తర్వాతి సీజన్‌లకు ఉన్న అవకాశాలను తెలిపేందుకు శుక్రవారం నుంచి ఈ నెల 25 వరకు ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌లను నిర్వహించనుంది. హైదరాబాద్‌ మాదాపూర్‌ ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో తొలి ఫెయిర్‌ను యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ అధికారి అలెగ్జాండర్‌ మెక్‌లారన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఆరు గంటల పాటు జరిగిన ఫెయిర్‌లో 55 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొనగా, 1,500 మందిపైగా విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. భారతీయ విద్యార్థుల్లో అధికులు ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంచుకుంటున్నారని మెక్‌లారెన్‌ తెలిపారు.


తమ దేశంలో విద్యనభ్యసిస్తున్న భారతీయుల్లో అధిక శాతం ఏపీ, తెలంగాణ వారేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నుంచి ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌, పుణె, ముంబై, ఢిల్లీల్లోనూ సదస్సులు నిర్వహిస్తామని, మొత్తం 80 అమెరికా విశ్వవిద్యాలయాల పాల్గొంటాయని వివరించారు. విద్యార్థి వీసా ప్రక్రియ గురించి కాన్సులేట్‌ అధికారులు వివరిస్తారని, పలు విశ్వవిద్యాలయాల ప్రతినిధులు నేరుగా హాజరుకావడం వల్ల ఉపకార వేతనాలు, క్యాంపస్‌ జీవితం ఇతర అంశాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


గత సంవత్సరంతో పోలిస్తే హైదరాబాద్‌లో సదస్సుకు హాజరైన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. నేరుగా హాజరైన విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందన్నారు. తమ అత్యంత విజయవంతమైన ఫెయిర్‌లలో ఇది ఒకటని అలెగ్జాండర్‌ వెల్లడించారు. కాగా, హైదరాబాద్‌ సదస్సులో జాన్స్‌ హాప్కిన్స్‌ కారీ బిజినెస్‌ స్కూల్‌, యూనివర్శిటీ ఆఫ్‌ ఆరిజోనా, యూనివర్శిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌ స్టేట్స్‌, జార్జి వాషింగ్టన్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ ఓరెగాన్‌, మియామీ యూనివర్శిటీ, న్యూయార్క్‌ యూనివర్శిటీ సహా 55 వర్శిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగు విద్యార్థులు అమితంగా ఇష్టపడే మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజనీరింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, అప్లయ్డ్‌ ఆర్ట్స్‌ విభాగాలకు చెందిన వర్శిటీల ప్రతినిధులు ఎక్కువగా హాజరయ్యారు.


  • వివరాలు సమగ్రంగా తెలుసుకునే అవకాశం

అమెరికాలో ఎంఎస్‌ చేయాలనేది లక్ష్యం అని సదస్సుకు హాజరైన విద్యార్థుల్లో ఎక్కువమంది చెప్పారు. సైబర్‌ సెక్యూరిటీ కోర్సులు సహా పలు అవకాశాలను తెలుసుకుని, నిర్ణయాలు తీసుకోవాలన్నది తమ ప్రయత్నమని మరికొందరు వెల్లడించారు. వచ్చే జూన్‌లో ఇంజనీరింగ్‌ పూర్తయ్యేవారు మాత్రమే కాక, అమెరికాలో డిగ్రీ చదవాలనుకుని ఆరాటపడుతున్న విద్యార్థులూ హాజరయ్యారు. మంచి అమెరికా వర్శిటీలో సీటు సంపాదించాలంటే ఎంత జీపీఏ ఉండాలి వంటి అంశాలను తెలుసుకునేందుకు ఈ ఫెయిర్‌ తోడ్పడిందని ఇలాంటివారు చెప్పారు.


తాము కోరుకున్న వర్శిటీలు పెద్దగా రాలేదని పెదవి విరిచారు. మెరుగైన ర్యాంకింగ్స్‌ ఉన్నవి చాలా తక్కువగా వచ్చాయని, అధిక శాతం ప్రైవేట్‌ వర్శిటీలు హాజరవడం నిరాశ కలిగించిందని చెప్పారు. వచ్చే సీజన్‌కు సిద్ధం కావడానికి అవసరమైన సమాచారం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పలు వెబ్‌సైట్‌లు, సీనియర్ల ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని సరిపోల్చుకోవడంతో పాటు, వీసా ప్రక్రియ, ఉపకార వేతనాల గురించి విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో నేరుగా మాట్లాడడంతో మెరుగైన అవగాహన కలిగిందన్నారు.

Updated Date - Aug 17 , 2024 | 04:30 AM