Share News

White Rice: లావుగా ఉన్నామని బాధపడుతున్నారా?.. రోజూ తినే అన్నం ద్వారా బరువు తగ్గేందుకు 3 మార్గాలు

ABN , First Publish Date - 2023-11-23T07:56:53+05:30 IST

తెలుగువారి వంటకాల్లో అన్నం ప్రధానమైంది. దాదాపుగా తెలుగువారంతా ప్రతి రోజూ కచ్చితంగా రెండు పూటలు ప్రధాన ఆహారంగా అన్నమే తీసుకుంటారు. అన్నం కాకుండా మరొక ఆహార పదార్థాలు తీసుకుంటే కడుపు నిండినట్లుగా అనిపించదు.

White Rice: లావుగా ఉన్నామని బాధపడుతున్నారా?.. రోజూ తినే అన్నం ద్వారా బరువు తగ్గేందుకు 3 మార్గాలు

తెలుగువారి వంటకాల్లో అన్నం ప్రధానమైంది. దాదాపుగా తెలుగువారంతా ప్రతి రోజూ కచ్చితంగా రెండు పూటలు ప్రధాన ఆహారంగా అన్నమే తీసుకుంటారు. అన్నం కాకుండా మరొక ఆహార పదార్థాలు తీసుకుంటే కడుపు నిండినట్లుగా అనిపించదు. కానీ అన్నం ఎక్కువగా తీసుకోవడం వల్ల లాభాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ పలు నష్టాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా శరీర బరువు పెరిగే అవకాశాలున్నాయి. డాక్టర్లు కూడా పలు అనారోగ్య సమస్యల విషయంలో అన్నానికి దూరంగా ఉండమని సూచిస్తుంటారు. ఈ మధ్య కాలంలో బరువు పెరగడం అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలో బరువు తగ్గించుకోవడానికి అందరూ అనేక మార్గాలను ఆశ్రయిస్తున్నారు. అయితే వైట్ రైస్ తీసుకోవడం ద్వారా కూడా శరీర బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తెల్ల బియ్యంలో పెద్ద మొత్తంలో లభించే స్టార్చ్(పిండి పదార్థాలు) శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే ఈ ప్రయోజనాన్ని పొందేందుకు అన్నం వండేటప్పుడు కొన్ని కీలక పద్దతులను అనుసరించాల్సి ఉంటుంది. శ్రీలంకలోని కాలేజ్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు వైట్ రైస్ తీసుకోవడం వల్ల శరీర బరువును నియంత్రించవచ్చని కనుగొన్నారు. వారు చెబుతున్నదాని ప్రకారం ఈ ప్రయోజనాన్ని పొందేందుకు వైట్ రైస్‌ను మూడు రకాలుగా వండవచ్చు.


కొబ్బరి నూనె కలపడం ద్వారా

ఒక గిన్నెలో నీటిని మరిగించాలి. ప్రతి అరకప్పు బియ్యానికి ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను కలపాలి. కొంత సమయం తర్వాత మరిగే నీటిలో తెల్ల బియ్యాన్ని కలపాలి. తక్కువ ఉష్ణోగ్రతలో 40 నిమిషాలు బియ్యం ఉడికించాలి. అన్నం సిద్ధమయ్యాక దానిని కనీసం 12 గంటలు ఫ్రిజ్‌లో భద్రపరచుకోవాలి. ఈ పద్దతిలో ‘నిరోధక స్టార్చ్’ పది రెట్లు పెరుగుతుంది. బరువు తగ్గడానికి సహాయపడే ఒక పోషకం ఆ అన్నంలో ఉంటుంది. ఇలా తయారైన అన్నం శరీరానికి చాలా తక్కువ క్యాలరీలను అందిస్తుంది. ఈ పద్దతిలో అన్నాన్ని చల్లబర్చడం ముఖ్యమైన దశ. సాయంత్రం ఈ విధంగా తయారుచేసిన అన్నాన్ని మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు.

బియ్యాన్ని పాక్షికంగా ఉడికించాలి

బియ్యాన్ని సుమారు 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత ఆవిరి మీద ఉడికింది నీటిని పూర్తిగా బయటికి వదలాలి. ఈ విధానంలో బియ్యంలో పోషకాలు పెరుగుతాయి. బియ్యంతో చేసే ఆహారాన్ని ఆస్వాదిస్తూ శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఈ విధంగా అన్నం తినడం వల్ల పేగులు ఆరోగ్యవంతంగా ఉండడమే కాకుండా, పేగులో మేలు చేసే బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. ఈ తరహాలో అన్నం తినే వారిలో తక్కువ గ్లైసెమిక్ సూచికతో ఇన్యులిన్ పనితీరుకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రిస్తుంది. ఈ పద్ధతిలో తయారుచేసిన అన్నం ఐరన్, కాల్షియానికి గొప్ప మూలం. ఆరోగ్యరమైన జుట్టు, ఎమ్ముకల పటుత్వాన్ని పెంచుతుంది. హార్మోన్ అసమానతల నుంచి రక్షణను ఇస్తుంది.

పిండి పదార్థాలను ఫిల్టర్ చేయాలి

ఈ పద్ధతిలో వండిన అన్నం నుంచి అదనపు పిండి పదార్థాలను ఫిల్టర్ చేస్తారు. మొదటగా చల్లటి నీటిలో బియ్యాన్ని బాగా కడగాలి. ప్రతి కప్పు బియ్యానికి ఆరు నుంచి 10 కప్పుల నీటిని కలపాలి. అలా కడిగిన బియ్యాన్ని అప్పటికే వేడిచేసిన నీటితో ఉన్న గిన్నెలో కలపాలి. అన్నం ఉడుకుతున్న గిన్నెపై మూసి ఉంచకుండా అప్పుడప్పుడు బియ్యాన్ని చెంచాతో కలుపుతూ(కదిలిస్తూ) ఉండాలి. బియ్యం సరిగ్గా ఉడికిన తర్వాత అందులోని నీటిని పూర్తిగా తొలగించాలి. మిగిలిన పిండి పదార్థాలను తొలగించడానికి బియ్యాన్ని వేటి నీటితో కడగాలి. ఈ పద్దతులను అనుసరించడం వల్ల బరువు తగ్గానికి దోహదం చేస్తుంది. కాగా అధిక మొత్తంలో అన్నం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Updated Date - 2023-11-23T11:30:00+05:30 IST