New Parliament : నూతన పార్లమెంటు భవనం వివాదం.. ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చిన గులాం నబీ ఆజాద్..

ABN , First Publish Date - 2023-05-27T16:23:49+05:30 IST

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ వేళ అధికార, విపక్షాల మధ్య వాద, ప్రతివాదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీల్లో

New Parliament : నూతన పార్లమెంటు భవనం వివాదం.. ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చిన గులాం నబీ ఆజాద్..
Ghulam Nabi Azad

న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ వేళ అధికార, విపక్షాల మధ్య వాద, ప్రతివాదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సహా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తుండగా, తెదేపా, వైకాపా, ఎస్‌ఏడీ, బీజేడీ (BJD) వంటి ఎన్డీయేయేతర పార్టీలు హాజరవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్న పార్టీలపై జమ్మూ-కశ్మీరుకు చెందిన డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. రికార్డు సమయంలో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించినందుకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రశంసించాలన్నారు.

గులాం నబీ ఆజాద్ (Democratic Progressive Azad Party chief Ghulam Nabi Azad) శనివారం మాట్లాడుతూ, తాను ఢిల్లీలో ఉండి ఉంటే తప్పకుండా కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరై ఉండేవాడినని తెలిపారు. తాను వేరొక కార్యక్రమానికి హాజరుకావలసి ఉందని చెప్పారు. కొత్త పార్లమెంటు భవనాన్ని రికార్డు సమయంలో నిర్మించినందుకు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశంసించాలన్నారు. అయితే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. సుమారు 30 నుంచి 35 ఏళ్ల క్రితం తాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసినపుడు తాము కొత్త పార్లమెంటు భవన నిర్మాణం గురించి కలలు కనేవారమని చెప్పారు. అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు, కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్, తాను దీని గురించి చర్చించామని చెప్పారు. దీని కోసం ఓ మ్యాపును కూడా తయారు చేశామన్నారు. అప్పట్లో తాము దీనిని నిర్మించలేకపోయామని చెప్పారు. అయితే ఇప్పుడు దీనిని నిర్మించడం చాలా మంచి విషయమని తెలిపారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో దేశ జనాభా దాదాపు ఐదు రెట్లు పెరిగిందని, పార్లమెంటేరియన్ల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో నూతన పార్లమెంటు భవనం అవసరం చాలా ఉందన్నారు. ఈ భవనాన్ని నిర్మించడం చాలా అవసరమని, తప్పనిసరి అని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో పార్లమెంటు భవనాన్ని సిద్ధం చేయడం తేలికైన విషయం కాదన్నారు. ఈ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారా? రాష్ట్రపతి ప్రారంభించారా? అనేది ముఖ్యమైన విషయం కాదన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ ఎన్నుకోలేదని కాదని, ప్రతిపక్షాలు ద్రౌపది ముర్ముకు అంత అనుకూలం అయితే, ఆమెకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టారని ప్రశ్నించారు.

అదృష్టవంతుడిని : అమిత్ షా

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ తరుణంలో తనను తాను అదృష్టవంతునిగా (fortunate) కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అభివర్ణించుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాత, కొత్త పార్లమెంటులకు తాను ప్రజాప్రతినిధిగా ఉండటం తన అదృష్టమని శనివారంనాడు ట్వీట్ చేశారు.

కొత్త పార్లమెంటు ఎందుకు : నితీశ్

కొత్త పార్లమెంటు భవనం (New parliament Building) ఈనెల 28న ప్రారంభమవుతుండగా,బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కొత్త పార్లమెంటు భవనం అవసరం ఏమిటని ఆయన నిలదీశారు. మోదీ అధ్యక్షతన శనివారం ఏర్పాటైన నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశానికి హాజరుకావడంలోనూ అర్ధం లేదన్నారు.

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో భాగంగా లోక్‌సభ సభాపతి ఆసనం వద్ద రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు.

ఇవి కూడా చదవండి :

Ghaziabad: ఫుడ్ ప్యాకెట్‌లో ఉమ్మి వేసిన రెస్టారెంట్ ఉద్యోగి

Delhi University : ‘సారే జహా సే అచ్ఛా’ రచయిత ఇక్బాల్‌పై పాఠం సిలబస్ నుంచి తొలగింపు

Updated Date - 2023-05-27T16:23:49+05:30 IST