Raul Ravna poster: రావణుని అక్కడ పూజిస్తారు..తెలియదేమో?.. డీకే పంచ్...!
ABN , First Publish Date - 2023-10-07T20:28:03+05:30 IST
రాహుల్ గాంధీకి ఉన్న ప్రజాదరణ, నాయకత్వ నైపుణ్యాలు చూసి బీజేపీ భయపడుతున్నందునే ఆయనను రావణుడిగా చూపిస్తూ పోస్టర్లు వేసిందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. రావణుని పూర్తి కథ తెలియకుండానే సఫ్రాన్ క్యాంప్ ఈ పోస్టర్లు వేసిందని బీజేపీని తప్పుపట్టారు.
బెంగళూరు: రాహుల్ గాంధీకి ఉన్న ప్రజాదరణ, నాయకత్వ నైపుణ్యాలు చూసి బీజేపీ భయపడుతున్నందునే ఆయనను రావణుడిగా చూపిస్తూ పోస్టర్లు వేసిందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) అన్నారు. శనివారంనాడు విధానసభ వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ, రావణుని (Ravana) పూర్తి కథ తెలియకుండానే సఫ్రాన్ క్యాంప్ (BJP) ఈ పోస్టర్లు వేసిందని తప్పుపట్టారు.
''ఉత్తరభారతంలో కూడా రావణుని ఆరాధిస్తారు. బీజేపీకి మన సంస్కృతి తెలిస్తే వాళ్లు ఇంత దిగజారుడుగా వ్యవహరించరు. భారత్ జోడో యాత్ర తర్వాతే 'ఇండియా' (I.N.D.I.A.) కూటమికి ఒక రూపం వచ్చింది. ఇండియా కూటమి బలంగా రూపుదిద్దుకుంటూ ఇండియాను ఐక్యంగా ఉంచి, దేశ రక్షణకు పాటుపడనుంది'' అని డీకే అన్నారు. రాహుల్ గాంధీ మెగా పాదయాత్ర, ఇండియా కూటమి ఏర్పడటం చూసి బీజేపీ భయపడుతున్నందునే పది తలల రావణుని పోస్టర్లు వేసిందన్నారు. రావణుడు-రాముడికి మధ్య జరిగిన యుద్ధం గురించి బీజేపీకి అవగాహన రావాలంటే పురాణాలు తెలుసుకోవాలని సూచించారు. బీజేపీ పోస్టర్లపై కర్ణాటకతో సహా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.