Kokapet Land Price: సుదూర దేశాలలో కూడా నలుగురు తెలుగువారు కలిస్తే 'కోకాపేట' భూములపైనే చర్చ..

ABN , First Publish Date - 2023-08-09T08:18:19+05:30 IST

కూడు,గూడు, గుడ్డ మానవాళి కనీస మౌలిక అవసరాలు. మనిషి సగటు జీవితం వీటి చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఆ అవసరాలను సంతృప్తికరంగా తీర్చుకోవడానికై మనిషి సప్త సముద్రాలను కూడా దాటుతాడు.

Kokapet Land Price: సుదూర దేశాలలో కూడా నలుగురు తెలుగువారు కలిస్తే 'కోకాపేట' భూములపైనే చర్చ..

కూడు,గూడు, గుడ్డ మానవాళి కనీస మౌలిక అవసరాలు. మనిషి సగటు జీవితం వీటి చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఆ అవసరాలను సంతృప్తికరంగా తీర్చుకోవడానికై మనిషి సప్త సముద్రాలను కూడా దాటుతాడు. తెలుగునాట ఒకప్పుడు స్థిరాస్థుల కొనుగోలుదారులలో, ఇలా దేశాంతరాలు వెళ్లి ఉద్యోగాలు చేసే వారే అగ్రగణ్యులు. అటు కడప జిల్లా రాజంపేట నుంచి ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, అటు తూర్పు గోదావరి జిల్లా రాజోలు వరకు హైదరాబాద్ మహానగరంలోనూ, ఇతర నగరాలలోనూ స్థిరాస్థుల లావాదేవీలలో ఈ సిరిమంతులే ముందుండే వారు. కాలక్రమేణ రాజకీయ నాయకులు ఈ స్థిరాస్థుల రంగంలో ప్రవేశించిన తర్వాత ప్రవాసులు వెనుకబడ్డారు. గతంలో ఒక నాలుగు సంవత్సరాలు విదేశాలలో పని చేస్తే హైదరాబాద్ నగరంలో సునాయాసంగా ఒక ఇంటికి యాజమాని అయ్యే పరిస్ధితి ఉండేది. ఇప్పుడు అది గతకాలం ముచ్చట అయిపోయింది.

ఇటీవల హైదరాబాద్‌లోని కోకాపేట భూములకు రికార్డు స్ధాయిలో ధర పలుకడం ఇంటా బయటా చర్చనీయాంశమయింది. సుదూర దేశాలలో కూడా నలుగురు తెలుగువారు కలిస్తే కోకాపేట భూముల విషయం గురించే మాట్లాడుకుంటున్నారంటే సత్య దూరం కాదు. ఒకప్పుడు కొంత కాలం పని చేసి పొదుపు చేసుకుంటే హైదరాబాద్ నగరంలో ఒక చిన్నపాటి ఇల్లును స్వంతం చేసుకోవాలనే స్వప్నం సాకారమయ్యేది. ఇక విదేశాలలో కొంత కాలం పని చేస్తే సునాయాసంగా ఒక విశాల గృహానికి యాజమాని అయ్యే అవకాశం దక్కేది. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ అవసరాలు, ప్రత్యేకించి స్వంత ఇల్లు అనే ఒక లక్ష్య సాధనకు ప్రవాస బాటను ఎంచుకున్న తెలుగువారు అసంఖ్యాకం.

రాజకీయ, అధికార వ్యవస్థలలోని కొందరు సమష్టిగా భూ లావాదేవీలకు శ్రీకారం చుట్టిన తర్వాత స్థిరాస్థుల రంగంలో పరిస్ధితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ పరిణామం ప్రస్తుతం పరాకాష్ఠకు చేరుకున్నది. నాయకులు, కొందరు అధికారులు ప్రమోటర్లుగా ఉన్నా ఇప్పటికీ ప్రవాసులు లేదా స్వదేశాన ఉండి విదేశీ సంస్ధలలో పని చేస్తున్న ఉద్యోగులు ముఖ్యంగా ఐ.టి. రంగం వారు స్థిరాస్థుల కొనుగోళ్ళలో ముఖ్య భూమిక వహిస్తున్నారు.

హైదరాబాద్ నగర చుట్టుప్రక్కల భూముల ధరలను పాలకవర్గాల అస్మదీయులు ఒక పథకం ప్రకారం కృత్రిమంగా హెచ్చిస్తూ వస్తున్నారు. నగరం నలుదిక్కుల యాదాద్రి, ఫార్మా సిటీ, ఔటర్ రింగు రోడ్డు ఇత్యాది ప్రతిష్ఠాత్మక పథకాలతో అసలు లబ్ధిదారుల కంటే ఎక్కువగా ఈ అస్మదీయులే ప్రయోజనం పొందారనేది ఒక చేదు నిజం. ఈ నేపథ్యంలో కోకాపేటలో ఒక ఎకరం భూమికి రూ.100 కోట్ల ధర పలికింది. అనూహ్యమైన ఈ ధరను హైదరాబాద్ నగర అభివృద్ధికి తిరుగులేని ప్రమాణంగా భావిస్తున్నారు. దేశంలోను, విదేశాలలోను ఈ వ్యాపార పరిణామంపై విశేష ప్రచారం మొదలయింది. ఆకాశాన్ని అంటిన ఈ భూముల ధర పురోగమనానికి సంకేతమా లేదా గుత్తాధిపత్యానికి సూచకమా? ఈ ప్రశ్నకు సమాధానం వ్యక్తుల ఆలోచనా దృక్ఫథంపై ఆధారపడి ఉంటుంది.

రూ. 100 కోట్లకు ఒక ఎకరం అంటే సుమారు 4047 చదరపు అడుగుల స్ధలంలో ఎన్ని ఆకాశ హర్మ్యాలను, ఎన్ని ఫ్లాట్లను నిర్మిస్తారు? నిర్మాణ వ్యయం, రుణాలపై వడ్డీ, ఒక్కొక్కరికి ఎన్ని గజాల నికర స్ధలం వస్తుంది? మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కలవరం చెందకుండా ఉండలేము. ఆదాయ వనరులు బాగా ఉన్నవారు సైతం ఈ రకమైన ప్రదేశాలలో ఇళ్ళను కొనుగోలు చేయడం అంత సులభతరం కాదు. ఎంత మంది ఈ రకమైన గేటెడ్ కమ్యూనిటీలలో నివాసాలను ఏర్పాటు చేసుకోగలరు? డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరయితే మహాభాగ్యమనుకునే అభాగ్యులు అసంఖ్యాకంగా ఉన్న రాష్ట్రంలో ఆర్థికాభ్యుదయానికి కోకాపేట కొలమానం కాకూడదు. హైదరాబాద్ నగరం చుట్టు ప్రక్కల భూముల ధరలపై స్ధానికంగా ఉన్న సామాన్య రైతుల కంటే ఎక్కువగా విదేశాలలో ఉంటున్న ప్రవాసులలో అధిక ఆసక్తి వ్యక్తమవుతుండడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

ఏడో నిజాం నవాబును నిరంకుశ పాలకుడని భావిస్తారు. అయితే హైదరాబాద్ నగరంలోని పేదలందరికీ ఆయన ఉచిత గృహ వసతి కల్పించిన విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. ప్రత్యేక హౌజింగ్ బోర్డు ద్వారా నగరంలోని నాంపల్లి, ఖైరతాబాద్, బాగ్ లింగంపల్లి వివిధ ఇతర ప్రాంతాలలో అల్పాదాయ వర్గాల (యల్.ఐ.జి) వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. అదే విధంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధి కొరకు అలనాటి బొంబాయి మహానగరానికి వలస పోయిన శ్రామిక జనులకు వర్లీ, పరేల్ ప్రాంతాలలో బ్రిటిష్ పాలకులు సైతం ఉచిత గృహ వసతి కల్పించారు. పేదల ఇళ్లపై బ్రిటిష్ వలస పాలకులు, నిజాం నవాబు చూపిన శ్రద్ధలో కనీసం కొంచెమైనా ప్రస్తుత ప్రభుత్వాలు చూపడం లేదు.

‘అయె మౌత్ తునే ముజ్కో జమీందార్ కర్దియా, దో గజ్ క్యూ నహీ మేరి మిల్కియత్ తో సహీ’ (ఓ మృత్యువా! నువ్వు నన్ను భూస్వామిని చేశావు, రెండు గజాల సమాధి అయినా సరే అది నా స్వంతం..) అంటూ ప్రసిద్ధ ఉర్దూ కవి రాహాత్ ఇండోరి చమత్కరించారు. అయితే ఆయన భావన ఇప్పుడు తప్పనిపిస్తుంది. ఎందుకంటే, అనూహ్యంగా పెరిగిపోతున్న లేదా కృత్రిమంగా పెంచుతున్న స్థిరాస్థుల ధరలను పరిశీలిస్తే నివాసముండడానికి ఇల్లు సంగతి ఏమో గానీ మరణించిన తర్వాత సమాధికి కూడ స్ధలం లేకుండాపోతోంది కదా. హైదరాబాద్‌ ఒకప్పుడు దరి చేరిన ప్రతీ ఒక్కరినీ అక్కున చేర్చుకున్నది. ఇప్పుడు సంపన్నులకు మాత్రమే స్వాగతం పలికే పరిస్ధితి ఆ మహానగరానికి దాపురించింది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-08-09T08:18:19+05:30 IST