Etela Vs Revanth : ప్రమాణానికి భాగ్యలక్ష్మి గుడికెళ్లి రేవంత్ కంటతడి.. ఇంట్లోనే ఉండిపోయిన ఈటల చెప్పే లాజిక్ ఏమిటంటే..
ABN , First Publish Date - 2023-04-22T19:54:38+05:30 IST
తెలంగాణలో ఇప్పుడు ప్రమాణాలు, సవాళ్లతో కూడిన రాజకీయాలు నడుస్తున్నాయ్.. రండి అమ్మవారి గుడి సాక్షిగానే తేల్చుకుందాం అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు...
తెలంగాణలో ఇప్పుడు ప్రమాణాలు, సవాళ్లతో కూడిన రాజకీయాలు నడుస్తున్నాయ్.. రండి అమ్మవారి గుడి సాక్షిగానే తేల్చుకుందాం అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇదంతా నడవగా.. ఇప్పుడు ప్రతిపక్షపార్టీల్లోనే నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etlea Rajender) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. అది కాస్త ప్రమాణం దాకా వెళ్లింది. మునుగోడు ఉపఎన్నిక (Munugode By Election) కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు 25 కోట్లు ముడుపులు అందాయన్న ఈటల కామెంట్స్‌తో ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. దేవుడి మీద ప్రమాణం చేద్దామంటూ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి దేవాలయానికి (Bhagyalakshmi Temple) రేవంత్ వచ్చి.. అమ్మవారి కండువా సాక్షిగా ప్రమాణం చేశారు. అయితే ఈటల మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈటల తోకముడిచారని కాంగ్రెస్ శ్రేణులు అరుపులు, కేకలతో హోరెత్తించారు. ప్రమాణానికి రాకుండా ఇంట్లోనే ఉన్న ఈటలను మీడియా ప్రతినిధులు మాట్లాడాలని కోరగా.. మరోసారి ఈ వ్యవహారంపై స్పందించారు.
ఈటల లాజిక్ ఇదే..!
‘ నేను వ్యక్తిగతంగా ఎవరినీ ఏమీ అనలేదు. ఆత్మసాక్షిగానే నేను చెబుతున్నాను. నేను ఎవరినీ కించపరిచే వ్యక్తిని కాను. గుళ్లకు వెళ్లి ప్రమాణాలు చేయడం ఏంటి?. ప్రజలు, ధర్మం కోసమే మాట్లాడాను. సంపూర్ణంగా అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఆదివారం నాడు అందరికీ నేను సమాధానం చెబుతాను. రాజకీయ నాయకుడికి కావాల్సింది కాన్ఫిడెంట్. అంతేకానీ.. నీ మీద నీకు నమ్మకం లేకపోతే కదా దేవుడిపై విశ్వాసం. గుడికి వెళ్లి అమ్మతోడు.. అయ్యతోడు అనడం ఏంటి.. ఇదేం కల్చర్. ఇప్పుడు రాజకీయాలపై నేను మాట్లాడాను. ఎవరెన్ని మాట్లాడినా రాజేందర్ ప్రజల కోసం మాట్లాడుతాడు. మళ్లీ మళ్లీ చెబుతున్నా నేను వ్యక్తిగతం మాట్లాడలేదు’ అని లాజిక్‌గా ఈటల మాట్లాడారు.
రేవంత్ ఏమన్నారు..?
భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భావోద్వేగానికి గురై రేవంత్ రెడ్డి కంటతడి పెట్టారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ఆత్మసాక్షిగా ప్రమాణం చేశానని తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. మునుగోడులో బీఆర్‌ఎస్, బీజేపీ (BRS- BJP) వందల కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. మునుగోడులో సీఎం కేసీఆర్తో కాంగ్రెస్ ఎలాంటి లాలూచీ పడలేదని స్పష్టం చేశారు. ఏ ఆధారం లేనివారికి దేవుడే ఆధారమని వ్యాఖ్యానించారు. దేవుడిని తాను నమ్ముతానని తనపై అభాండాలు వేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌తో గానీ.. కేసీఆర్తో గానీ.. ఎలాంటి లాలూచీ పెట్టుకోలేదని తెలిపారు. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ప్రకటించారు. ఈటల ఆరోపణలు అవాస్తవమని రేవంత్రెడ్డి కొట్టిపారేశారు. ‘కేసీఆర్, కేటీఆర్ దోపీడీని బయటపెట్టినందుకు నన్ను జైల్లో పెట్టారు. జైల్లో నిద్ర లేని రాత్రులు గడిపాను. కేసీఆర్‌ను ఎదుర్కొని.. ధైర్యంగా నిలబడ్డా. నోటీసులు ఇవ్వగానే ఎవరికో నేను లొంగిపోలేదు. నాపై, పార్టీపై ఆరోపణలు చేస్తారా?.. ఈటల రాజేందర్.. ఆలోచించి మాట్లాడాలి. ఈటలపై కేసీఆర్ కక్ష కట్టినపుడు సానుభూతి చూపించాం. ఇది రాజకీయం కాదు.. నా మనోవేదన. అసత్య ఆరోపణలు మంచివి కాదు. కేసీఆర్‌ను ప్రశ్నించే గొంతులకు ఇదేనా నువ్విచ్చే గౌరవం?.. కేసీఆర్ సర్వం ధారపోసినా నన్ను కొనలేరు. రేవంత్‌రెడ్డిని కొనేవాడు ఇంకా పుట్టలేదు. నా ఏకైక లక్ష్యం.. కేసీఆర్‌ను గద్దెదించడమే’ అని రేవంత్ స్పష్టం చేశారు.
ఇంతకీ ఈటల చేసిన సవాల్ ఏంటి..!?
మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) నుంచి కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ముట్టాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ.. కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. దాన్ని నిరూపించేందుకు సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, బీఆర్‌ఎస్ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని రేవంత్ స్పష్టం చేశారు. ఈ మేరకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం ఎదుట తడిబట్టలతో ప్రమాణం చేయడానికీ తాను సిద్ధమేనని ప్రకటించారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని ఈటలకు సూచించారు. ఈటలకు భాగ్యలక్ష్మి అమ్మవారిపై నమ్మకం లేకుంటే ఏ దేవాలయంలోనైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని తేల్చిచెప్పారు. ముందు ప్రకటించినట్లే రేవంత్‌రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లిన రేవంత్ ప్రమాణం చేశారు.
మొత్తానికి చూస్తే.. ఈటల మాత్రం అప్పుడే అయిపోలేదు. ఇప్పుడే మొదలైందన్నట్లుగా ఆదివారం నాడు అన్నీ చెబుతానని ఒకింత మళ్లీ సవాలే విసిరారు. ఆదివారం నాడు ఆయన ఏం మాట్లాడుతారు..? రేవంత్ చేసిన ప్రతి కామెంట్‌కు రియాక్ట్ అవుతారా..? లేకుంటే ఈటల కూడా ప్రమాణం చేస్తారా..? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.