Share News

Mohammed Shami: పొలంలో పరిగెత్తి.. రాత్రుళ్లు ప్రాక్టీస్‌ చేసి.. కఠోర శ్రమకి హ్యాట్సాఫ్

ABN , First Publish Date - 2023-10-23T04:38:37+05:30 IST

మహ్మద్‌ షమి.. తానేంటో మరోసారి నిరూపించాడు. వరల్డ్‌ కప్‌లో పలు మ్యాచ్‌లకు ‘బెంచ్‌’కే పరిమితమైనా బాధపడలేదు. దొరికిన అవకాశాన్ని వినియోగించుకొని కివీస్‌ వెన్నువిరిచాడు. ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా...

Mohammed Shami: పొలంలో పరిగెత్తి.. రాత్రుళ్లు ప్రాక్టీస్‌ చేసి.. కఠోర శ్రమకి హ్యాట్సాఫ్

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

మహ్మద్‌ షమి.. తానేంటో మరోసారి నిరూపించాడు. వరల్డ్‌ కప్‌లో పలు మ్యాచ్‌లకు ‘బెంచ్‌’కే పరిమితమైనా బాధపడలేదు. దొరికిన అవకాశాన్ని వినియోగించుకొని కివీస్‌ వెన్నువిరిచాడు. ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. తద్వారా తానెంత విలువైన బౌలరో చూపించాడు. ఈక్రమంలో వరల్డ్‌ కప్‌లలో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో షమి మేటి బౌలర్‌గా ఎదగడం వెనుక కఠోర పరిశ్రమ ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని సహ్‌సపూర్‌ అలీనగర్‌ అనే తన స్వగ్రామంలోనే సొంత ఖర్చుతో వివిధ రకాల పిచ్‌లతో పెద్ద క్రికెట్‌ గ్రౌండ్‌ అతడు ఏర్పాటు చేసుకున్నాడు. ‘క్రికెట్‌ తప్ప షమికి మరో లోకం లేదు. టీమిండియాకు దూరంగా ఉన్న సమయాల్లో తన నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవడంపైనే అతడు దృష్టి సారించేవాడు. ఈ ఏడాది ఆరంభంలో విండీస్‌ పర్యటన నుంచి బ్రేక్‌ తీసుకొన్నప్పుడే అతడు ప్రపంచ కప్‌ గురించి ఆలోచించాడు’ అని షమి చిన్ననాటి కోచ్‌, మార్గదర్శకుడు మహమ్మద్‌ బద్రుద్దీన్‌ వెల్లడించాడు.


2020 ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమవడంతో భారత వన్డే జట్టునుంచి షమిని తప్పించారు. 19 నెలల తర్వాతకానీ అతడికి వన్డే జట్టుకు పిలుపు లభించలేదు. బుమ్రా, ప్రసిధ్‌ గాయాల బారినపడడంతో వన్డేలలో టీమిండియా బౌలింగ్‌ భారాన్ని మోసేవారు అవసరమయ్యాడు. దాంతో సెలెక్టర్లకు షమి తప్ప మరొకరు కనిపించలేదు. ఏదో ఒక సమయంలో తన అవసరం పడుతుందని షమికూడా అంచనా వేశాడని, అది అతడి ఆత్మవిశ్వాసానికి తార్కాణమని బద్రుద్దీన్‌ తెలిపాడు. షమి కఠోర సాధన గురించి చెబుతూ ‘స్వస్థలంలో నిర్మించుకున్న గ్రౌండ్‌లో ఫ్లాట్‌, పచ్చిక తదితర పిచ్‌లు ఏర్పాటు చేసుకొని వాటిపై తీవ్రంగా సాధన చేస్తాడు. అలాగే ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసుకుని రాత్రుళ్లు తెల్లబంతితో గంటల కొద్దీ ప్రాక్టీస్‌ .అతడి పట్టుదలకు నిదర్శనం’ అని బద్రుద్దీన్‌ అన్నాడు. షమి ఫిట్‌నెస్‌ గురించి చెబుతూ..‘అతడి ఇంట్లో జిమ్‌ ఉంటుంది. అతడు ఎక్కువగా రన్నింగ్‌ చేస్తాడు కానీ మైదానంలో కాదు. జాతీయ జట్టుకు దూరంగా ఉన్నప్పుడు అలీనగర్‌లోని తన పొలంలో రన్నింగ్‌ చేస్తాడు’ అని వివరించాడు. మొత్తంగా..సత్తా పరంగా చూస్తే షమి భారత మేటి పేసర్‌ అనడానికి సందేహం అక్కర్లేదు. కానీ అంతపేరు రాకున్నా..జట్టునుంచి పక్కకు పెట్టినా కుంగిపోకుండా నిరంతర సాధనతో తనను మెరుగుపరుచుకొంటాడు. తద్వారా ప్రతి పునరాగమనంలోనూ భారత జట్టుకు అండగా నిలుస్తున్న షమికి హ్యాట్సాఫ్‌.

Updated Date - 2023-10-23T08:18:15+05:30 IST