CM KCR: అసెంబ్లీ ద్వారా ఏం చెబుదాం?

ABN , First Publish Date - 2023-07-31T01:53:09+05:30 IST

ఎన్నికలు(Elections) సమీపిస్తున్న వేళ.. గురువారం (ఆగస్టు 3) నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు(Monsoon Sessions of the Assembly) ప్రభుత్వానికి అత్యంత కీలకం.

 CM KCR: అసెంబ్లీ ద్వారా  ఏం చెబుదాం?

ప్రజల్ని కొత్తగా ఎలా ఆకట్టుకుందాం?

వరద బాధితులను ఆదుకోవడం సహా

నేటి క్యాబినెట్‌లో 50అంశాలపై చర్చ

యూసీసీకి వ్యతిరేకంగా తీర్మానం?

అనాథల పాలసీ, దళిత, బీసీబంధు,

గృహలక్ష్మి పథకాల అమలుపై చర్చ

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు(Elections) సమీపిస్తున్న వేళ.. గురువారం (ఆగస్టు 3) నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు(Monsoon Sessions of the Assembly) ప్రభుత్వానికి అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ(Assembly) వేదికగా ఎన్నికలకు ఉపయోగపడేలా ప్రభుత్వ ఘనతలపైన, ప్రతిపక్షాల బలహీనతలపైన ప్రజలకు ఏం చెబుదాం? వారిని కొత్తగా ఆకట్టుకోవడానికి ఏ అంశాలను లేవనెత్తుదాం? తదితర విషయాలపై సీఎం కేసీఆర్‌(CM KCR) నేతృత్వంలో సోమవారం జరగనున్న క్యాబినెట్‌ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా వరద ఉధృతిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, ఆర్థికంగా తీవ్ర నష్టాలపాలైన కుటుంబాలను ఆదుకునే చర్యలపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వ్యవసాయ రంగంలో తలెత్తిన సమస్యలు, రైతులను ఆదుకునే చర్యలు, నీటి ఉధృతికి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టంపై అంచనాలు, యుద్ధప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికలపైన, ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు వంటి 50 అంశాలపై క్యాబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఆగస్టు 3 నుంచి చేపట్టే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. 9 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు, వాటి ద్వారా ఆయా వర్గాల ప్రజలకు చేకూరిన లబ్ది, అందుకు వెచ్చించిన నిధులు.. వంటి అంశాలపై ఎవరు ఏం మాట్లాడాలన్న అంశం ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌, బీజేపీలను విమర్శించడమే లక్ష్యంగా సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసగించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 3 గంటల విద్యుత్‌ వస్తుందని, ప్రజలకు మళ్లీ కష్టాలు వస్తాయంటూ అసెంబ్లీ సమావేశాల ద్వారా జనానికి సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.


ఈసారైనా ఆ పాలసీ

‘‘రాష్ట్రంలోని అనాథలకు ప్రభుత్వమే తల్లి, తండ్రిఅయి బాధ్యత వహించాలి. దేశం గర్వించేలా, రాష్ట్రాలు అనుసరించేలా అనాథల కోసం నూతన విధానాన్ని రూపొందించాలి’’ అనే ధృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం అనాథల పాలసీ రూపకల్పన నిమిత్తం 2021లో మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన క్యాబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీని ఏర్పాటు చేసి రెండేళ్లవుతున్నా.. ఇప్పటిదాకా అనాథల కోసం ప్రభుత్వం ఎలాంటి పాలసీనీ ప్రకటించలేదు. ఫలితంగా రాష్ట్రంలో అనాథలు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్నది తేలలేదు. దీంతో సోమవారం జరగబోయే క్యాబినెట్‌ సమావేశంలోనైనా ‘అనాథల పాలసీ’ తేలుతుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. దీంతోపాటు.. దళితబంధు రెండో విడత అమలు, అందుకు అవసరమైన నిధుల సర్దుబాటు, అసలు ఆ పథకం అమలుకు ఎన్ని నిధులు అవసరమవుతాయి, నియోజకవర్గానికి ఎంతమందికి ఇవ్వాలనే అంశంపై భేటీలో మరోసారి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అలాగే.. బీసీ బంధు పరిస్థితి కూడా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. ఈ పథకం క్షేత్రస్థాయిలో ఆశించిన మేర అమలు కావట్లేదు. లబ్ధిదారుల గుర్తింపు, ఎంపిక ప్రక్రియే అధికారులకు ప్రహసనంగా తయారైంది. దీంతో పథకం అమలు నత్తనడకన సాగుతోంది. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులకు సరిపడా నిధులను బీసీ కార్పోరేషన్‌కు అందించలేదు. దీంతో ఇంకా ఎన్ని నిధులు కావాల్సి ఉంది? ఎప్పటిలోగా పథకాన్ని పూర్తిచేయాలనే అంశంపైనా చర్చించనున్నట్టు సమాచారం. వీటితోపాటు గృహలక్ష్మి పేరుతో ప్రభుత్వం లబ్ధిదారులను ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తోంది. ఈ పథకం కింద నియోజకవర్గానికి 3వేల ఇండ్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. కానీ పథకం కోసం చేసుకునే దరఖాస్తును ఇంతవరకూ అందుబాటులోకి తీసుకురాలేదు. దీనిపైనా చర్చించనున్నారు.

మరిన్ని అంశాలపై..

ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌ పరిధిలోని రోడ్లతో పాటు, రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు పలుచోట్ల కోతకు గురయ్యాయి. వాటిలో ఆర్‌ అండ్‌ బీ పరిధిలో కోతకు గురైన రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిల తాత్కాలిక, పూర్తిస్థాయి నిర్మాణాలకు రూ.720కోట్లు అవసరం అవుతాయని అధికారులు నివేదిక సిద్ధంచేశారు. మేజర్‌ కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణం కోసం అదనంగా రూ.885కోట్ల మేర నిధులు అవసరమవుతాయని ఆ నివేదికలో పొందుపరిచారు. సోమవారం నాటి భేటీలో వీటితోపాటు మినీ అంగన్‌వాడీలను మెయిన్‌ అంగన్‌వాడీలుగా మార్చడం, 61ఏళ్లు దాటిన అంగన్‌వాడీల వారసులకు వారి ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనపై చర్చించనున్నారు.

Updated Date - 2023-07-31T04:11:12+05:30 IST