Share News

Amaravati : చెడ తిరుగుడు!

ABN , Publish Date - Jul 09 , 2024 | 03:16 AM

మీకు సొంత కారు ఉందా? ఉంటే... రోజుకు ఐదొందల కిలోమీటర్లు తిరుగుతారా? ఒక రోజూ.. రెండు రోజులూ కాదు! వరుసగా 30 రోజులు.. నిర్విరామంగా రోజూ 500 కిలోమీటర్ల చొప్పున తిరగగలరా? ‘అంత రాచకార్యాలు మాకేముంటాయ్‌ బాస్‌!

Amaravati : చెడ  తిరుగుడు!

  • ఇరగదీసిన ‘సీఎం సలహాదారు’ ఇన్నోవా

  • ఏప్రిల్‌ నెలలో 14,962 కిలోమీటర్లు

  • సగటున రోజుకు 500 కి.మీ. ప్రయాణం

  • ధనుంజయ రెడ్డి పేరుతో మంజూరు

  • ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి వాడకం

  • ఎన్నికల ముందు ఎక్కడికి తిరిగారు?

  • డబ్బు మూటలు చేరవేసేందుకే వాడారా?

  • ఇలా ఇంకెన్ని ‘సీఎంవో’ వాహనాలున్నాయి?

  • విచారణతోనే అసలు విషయాలు బయటకు

మీకు సొంత కారు ఉందా? ఉంటే... రోజుకు ఐదొందల కిలోమీటర్లు తిరుగుతారా? ఒక రోజూ.. రెండు రోజులూ కాదు! వరుసగా 30 రోజులు.. నిర్విరామంగా రోజూ 500 కిలోమీటర్ల చొప్పున తిరగగలరా? ‘అంత రాచకార్యాలు మాకేముంటాయ్‌ బాస్‌! ఉన్నప్పటికీ మామూలు మనిషన్నవాడికి ఇంత తిరుగుడు సాధ్యం కాదు’ అనేదే మీ సమాధానం కదూ! కానీ... గత ప్రభుత్వంలో ‘అడ్వైజర్‌ టు సీఎం’ పేరిట లీజుకు తీసుకున్న ఇన్నోవా కారు చెడ తిరుగుడు తిరిగింది. అది కూడా... ఎన్నికల సమయంలో, ఏప్రిల్‌ నెలలో! అది అంతలా ఎందుకు తిరిగింది? ఇందులో ఎవరు తిరిగారు? ఎవరు తిప్పారు? నోట్ల మూటలు చేర్చేందుకే దీనిని వాడారా? ఇవీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘ఏపీ 16 టీజీ 0001’ అనే ఇన్నోవా ఏప్రిల్‌ నెలలో 14,962 కిలోమీటర్లు తిరిగింది. అంటే... సగటున రోజుకు 498.7 కిలోమీటర్లు. ఒక్కరోజు కూడా విరామంలేకుండా ఏప్రిల్‌ నెల మొత్తం ఈ ఇన్నోవా తిరుగుతూనే ఉంది. ఒక రోజు ఏకంగా 591 కిలోమీటర్లు తిరిగింది. ఈ ఇన్నోవాను ప్రొటోకాల్‌ విభాగం ‘ముఖ్యమంత్రి సలహాదారు’ ఆర్‌.ధనుంజయ రెడ్డికి కేటాయించింది. ధనుంజయ రెడ్డి ఉండేది విజయవాడలో! ‘సలహాదారు’ హోదాలో ప్రతి రోజూ తాడేపల్లిలోని జగన్‌ను కలిశారనుకున్నా... రానూపోనూ పాతిక కిలోమీటర్లు దాటదు!


మరి... రోజుకు సగటున 500 కిలోమీటర్లు ఎందుకు తిరిగినట్లు? అదీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా తిరగడమేమిటి? లాగ్‌షీట్‌లో ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు తిరిగారన్న వివరాలు మాత్రమే ఉన్నాయి. కానీ... అందులో ఎవరు ప్రయాణించారు? ఎక్కడెక్కడ తిరిగారన్నది మాత్రం లేదు. ‘వామ్మో... ఇదేం తిరుగుడు’ అని ఇప్పుడు అధికారులు విస్తుపోతున్నారు. ఆర్‌.ధనుంజయ రెడ్డి ఒకప్పుడు జగన్‌ పత్రికలో ఉద్యోగి! జగన్‌ అధికారంలోకి రాగానే సొంత పత్రికలోని ఉద్యోగులకు ప్రభుత్వంలో పునరావాసం కల్పించిన సంగతి తెలిసిందే.

అలాగే... ధనుంజయ రెడ్డిని ‘సలహాదారు’గా నియమించుకున్నారు. అందులో భాగంగానే ఆయనకు ‘ఏపీ 16 టీజీ 0001’ అనే ఇన్నోవాను కేటాయించారు. పాలన బాగుపడేందుకు, ప్రజలకు మేలు జరిగేందుకు ధనుంజయ రెడ్డి ఇచ్చిన సలహాలేమో తెలియదుకానీ... ఎన్నికల ముందు మాత్రం ఆయన కారు రాష్ట్రవ్యాప్తంగా చెడతిరిగింది. నిజానికి... మార్చి 16నే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం ప్రజాప్రతినిధులు, సలహాదారులు, ఇతర వ్యక్తులు ప్రభుత్వ వాహనాలు వాడకూడదు. ఇదీ నిబంధన! ఏ రూల్‌నూ పట్టించుకోని జగన్‌ సర్కారు... దీనిని మాత్రం ఎందుకు పట్టించుకుంటుంది? ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత... ఏప్రిల్‌ నెలలో ధనుంజయ రెడ్డి ఇన్నోవా బీభత్సంగా తిరిగింది.


తనిఖీలు ఉండవనే.. గతంలో ఎన్నడూ లేనివిధంగా... జగన్‌ సర్కారు హయాంలో ‘సీఎంవో’ అని పెద్ద ఎర్ర అక్షరాలు రాసుకున్న ఇన్నోవాలు పెద్దసంఖ్యలో రోడ్ల మీద సంచరించేవి! వీటికి ఎదురులేదు. ఎవ్వరూ ఆపరు. ‘సలహాదారు’ ఆర్‌.ధనుంజయ రెడ్డి ఉపయోగించిన ఇన్నోవా కారుపైనా ఎర్ర అక్షరాలతో ‘సీఎం సలహాదారు’ అని బోర్డు ఉంటుంది. ఆ వాహనం ఎక్కడ తిరిగినా ఆపే వారు ఉండ రు. దీంతో జగన్‌ అప్పగించిన పనికోసం సదరు సలహాదారు వాహనం ఏప్రిల్‌ నెలంతా రోజుకు సగటున 500 కిలోమీటర్లు తిరిగినట్లు సమాచారం! ఏప్రిల్‌లో రాష్ట్రంలో పూర్తిస్థాయి ఎన్నికల వేడి రాజుకుంది. జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ క్రమంలో ప్రచారానికి, పంచడానికి ‘డబ్బు మూటలు’ చేరవేసేందుకే ధనుంజయ రెడ్డి వాహనాన్ని వాడుకున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 30 రోజుల్లో 14,962 కిలోమీటర్లు... అంటే దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాలకు వెళ్లి రావొచ్చు. ‘కాగల కార్యాన్ని’ నెరవేర్చవచ్చు! తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి రకరకాల మార్గాల్లో డబ్బు సంచులను తరలించారని, ఇందుకు ప్రభుత్వ వాహనాలనూ వాడుకున్నారనే అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనిని... ధనుంజయ రెడ్డి ఇన్నోవా ‘ట్రిప్‌ మీటర్‌’ బలపరుస్తోంది. ఇలాగా... ‘సీఎంవో’ ముద్రతో ఎన్నికల ముందు ఎన్ని వాహనాలు, ఎన్నెన్ని కిలోమీటర్లు తిరిగాయి? అందులో ఎవరు తిరిగారు? ఎక్కడికి తిరిగారు? ఏం చేశారు? దీనిపై విచారణ జరిపితేగానీ అసలు విషయం బయటికి రాదు.

Updated Date - Jul 09 , 2024 | 03:16 AM