Share News

Budjet : నిధుల వరద

ABN , Publish Date - Nov 12 , 2024 | 12:44 AM

ఉమ్మడి అనంత కరువు కోరల నుంచి శాశ్వతంగా బయటపడాలంటే సాగునీరు కావాలి. ప్రతి ఎకరం తడిస్తేగానీ ఈ జిల్లా రైతాంగం సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం లేదు. వర్షపాతంలో అసమానతల కారణంగా ఖరీఫ్‌, రబీ.. రెండు సీజనలలోనూ పంటలు దెబ్బతింటున్నాయి. వర్షాలు లేని సమయంలో భూగర్భ జలాలను వాడుకుందామంటే.. పాతాళం వరకూ బోర్లు తవ్వించాలి. అయినా తడి కనిపించదు. ప్రాజెక్టులు పూర్తయితే.. భారీ వర్షాలు, వరదల సమయంలో వచ్చే నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. ఇదే సమస్యలన్నింటికీ పరిష్కారం. కానీ సాగునీటి...

Budjet : నిధుల వరద

సాగునీటి ప్రాజెక్టులకు రూ.1077 కోట్లు

వ్యవసాయ పథకాలకు భారీగా కేటాయింపులు

నైపుణ్య శిక్షణకు ప్రత్యేక కేంద్రాలు

బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట

ఉమ్మడి జిల్లా రుణం తీర్చుకునేలా బడ్జెట్‌

నాడు: ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ప్రాజెక్టులను విస్మరించిన ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. తాము అధికారంలోకి రాగానే పెండింగ్‌ ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో ఆ మేరకు నిధులు కేటాయిస్తామని అన్నారు. ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

నేడు: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టులకు నిధులను కేటాయించారు. అసెంబ్లీలో ఆర్థిక పయ్యావుల కేశవ్‌ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2024-25లో కరువు జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అనంత అంటే తనకు ఎనలేని అభిమానమని ఉమ్మడి జిల్లాకొచ్చిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు చెబుతుంటారు. బడ్జెట్‌లో నిధులు ఆయన మాటలు అక్షర సత్యాలని చెబుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు వైట్‌వాష్‌ చేశాయి. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను గెలిచి.. ఏకపక్ష విజయాన్ని సాధించాయి. అంతటి విజయాన్ని అందించిన ప్రజల అభివృద్ధికి పాటుపడాలని, వారి రుణాన్ని తీర్చుకోవాలని ప్రజా ప్రతినిధులు సంకల్పించారు. సమష్టిగా కదిలి నిధులు సాధించారు. ఆర్థిక మంత్రి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ తన సొంత జిల్లాకు న్యాయం చేశారు. తన బడ్జెట్‌లో అనంత ప్రాజెక్టులకు అత్యధిక నిధులు ఇచ్చారని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


అనంతపురం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అనంత కరువు కోరల నుంచి శాశ్వతంగా బయటపడాలంటే సాగునీరు కావాలి. ప్రతి ఎకరం తడిస్తేగానీ ఈ జిల్లా రైతాంగం సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం లేదు. వర్షపాతంలో అసమానతల కారణంగా ఖరీఫ్‌, రబీ.. రెండు సీజనలలోనూ పంటలు దెబ్బతింటున్నాయి. వర్షాలు లేని సమయంలో భూగర్భ జలాలను వాడుకుందామంటే.. పాతాళం వరకూ బోర్లు తవ్వించాలి. అయినా తడి కనిపించదు. ప్రాజెక్టులు పూర్తయితే.. భారీ వర్షాలు, వరదల సమయంలో వచ్చే నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. ఇదే సమస్యలన్నింటికీ పరిష్కారం. కానీ సాగునీటి విషయంలో దశాబ్దాలుగా జిల్లాకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా పరిస్థితిలో మార్పు రాలేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి అనంతపై చిన్నచూపు చూశారు. ఈ జిల్లా మనవడిని అంటూ హామీల వరద పారించిన జగన.. నిధులను మాత్రం ఇవ్వలేదు. హంద్రీనీవా సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు విస్తరించేందుకు సమాంతర కాలువను తవ్విస్తానని లెస్స పలికిన జగన.. పాలన ముగిసే సమయానికి ప్రాజెక్టు నిర్వహణకు సరిపడా నిధులను కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు. హెచఎల్సీ ఆధునికీకరణ అటుంచితే.. మరమ్మతులకూ నిధులు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడంతో సమస్య కొంతైనా తీరుతుందని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. వీటికి కొనసాగింగా.. రానున్న బడ్జెట్‌లలోనూ నీటికి నిధులను పారించాలి.

లోకేశ చొరవ..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ యువగళం ఉమ్మడి జిల్లాలో 200 కి.మీ.పైగా యువగళం పాదయాత్ర చేశారు. జిల్లా సరిహద్దు దాటాక.. 2023 ఏప్రిల్‌ 14న ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి రాగానే అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులకు నిధులిస్తామని, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భైరవానతిప్ప, పేరూరు ప్రాజెక్టులకు కృష్ణా జలాల తరలింపు పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. లోకేశ హామీలన్నీ నెరవేర్చే దిశగా బడ్జెట్‌లో నిధులను కేటాయించారు.

చంద్రన్న కరుణ

నీరుంటే బంగారం పండిస్తారు ఉమ్మడి జిల్లా రైతులు. ఆ నీటిని ఇచ్చే దిశగా బడ్జెట్‌లో నిధులు ఇచ్చారు. జలవనరుల శాఖకు మొత్తం రూ.16,705 కోట్లు కేటాయించగా, అందులో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.1077 కోట్లు కేటాయించింది. హంద్రీనీవాకు రూ.822 కోట్లు, పేరూరు ప్రాజెక్టుకు రూ.120 కోట్లు, భైరవానతిప్పకు రూ.100 కోట్లు కేటాయించారు. హెచఎల్సీ ఆధునికీకరణ ప్రస్తావన లేకపోయినా, మరమ్మతుల కోసం రూ.30 కోట్లు కేటాయించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ.500 కోట్లు కూడా ప్రాజెక్టులకు ఇవ్వలేదు.

అన్ని వర్గాలకూ మేలు

- బడ్జెట్‌లో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి బాటలు వేశారు. పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పరిశ్రమలు, వాణిజ్యం, రహదారులు, పర్యావరణం, పర్యాటకం, సాంస్కృతిక, అటవీ, యువజనుల అభివృద్ధికి భారీస్థాయిలో నిధులు కేటాయించారు. ఒక్క పట్టణాభివృద్ధికే రూ.16,705 కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. గృహ నిర్మాణానికి రూ.4 వేల కోట్లకుపైబడి నిధులు కేటాయించారు. రోడ్లు, భవనాలకు రూ.9,554 కోట్లు కేటాయించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా నిధులు కేటాయించారు. పోలీసు శాఖకూ గణనీయంగా నిధులు ఇచ్చారు.

- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి రూ.69 వేల కోట్లు కేటాయించారు. మహిళా, శిశు సంక్షేమానికి రూ.4,285 కోట్లు కేటాయించారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు, ఉన్నత విద్యకు ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందనే సంకేతాలను బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా పంపారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా 192 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో ఉమ్మడి జిల్లాకు రెండు మూడు వచ్చే అవకాశం ఉంది.

- రైతు శ్రేయస్సు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. ఉమ్మడి జిల్లా రైతాంగానికి వ్యవసాయ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ, పంటల బీమా, వడ్డీలేని రుణాలు, మార్కెటింగ్‌, విత్తనాల పంపిణీ, భూసార పరీక్షలు, ఎరువుల పంపిణీ, ఇంటిగ్రేటెడ్‌ అగ్రిల్యాబ్స్‌, రైతు సేవా కేంద్రాలు, ఉద్యాన, సహకార శాఖల ద్వారా రైతును ఆదుకునేందుకు బడ్జెట్‌లో రూ.43,402 కోట్లను కేటాయించారు.

ప్రగతికి నాంది...

అన్నివర్గాల సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ను రూపొందించారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే అత్యుత్తమ బడ్జెట్‌ ఇది. వైసీపీ పాలనలో ఉమ్మడి జిల్లాను విస్మరించారు. ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచే శిక్షణా సంస్థల ఏర్పాటుకు నారా లోకేశ ప్రత్యేక చొరవ చూపారు.

- బీవీ వెంకటరాముడు, టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్‌

నిధుల వరద పారించారు...

కూటమి అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఉమ్మడి జిల్లాకు నిధుల వరద పారించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ సమష్టి కృషితో ఈ భారీ బడ్జెట్‌ పురుడుపోసుకుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్‌ను రూపొందించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలకు నిధులు కేటాయించి.. ప్రజల్లో నమ్మకాన్ని రెట్టింపు చేసుకున్నారు. భవిష్యత్తులో జిల్లాకు మరిన్ని నిధులు వస్తాయి.

- టీసీ వరుణ్‌, అహుడా చైర్మన, జనసేన జిల్లా అధ్యక్షుడు

పునర్వ్యవస్థీకరణ బడ్జెట్‌..

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ, పునర్వ్యవస్థీకరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో రాష్ర్టాభివృద్ధి ఐదు దశాబ్దాలు వెనక్కివెళ్లింది. పూర్వవైభవం తెచ్చేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఏకంగా రూ.2,94,427.25 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలుచేసేలా నిధులు కేటాయించారు. మానవ వనరుల అభివృద్ధి, పరిశ్రమలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల పురోభివృద్ధి కొనసాగుతుంది. ప్రజారంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కేశవ్‌కు అభినందనలు.

- సందిరెడ్డి శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

సంతృప్తికర బడ్జెట్‌..

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అందరినీ సంతృప్తిపరిచింది. అన్ని వర్గాలకూ మేలు చేసేలా నిధులు ఇచ్చారు. రైతాంగం, పరిశ్రమలు, తాగు, సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు అభినందనలు.

- భవానీ రవికుమార్‌, జనసేన కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి

స్పష్టత లేదు..

జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధి కోసం రూ.7 వేల కోట్లు కేటాయించే విషయంలో స్పష్టత లేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. బడ్జెట్‌లో ఆత్మస్తుతి, పరనిందతోనే సరిపెట్టారు. పూర్తి రాజకీయ పత్రంగానే ఉంది. ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనార్టీ సంక్షేమానికి నిధులు నామమాత్రంగానే కేటాయించారు. జనాభాలో సగభాగమైన మహిళాశిశు సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. సూపర్‌సిక్స్‌ పథకాలు అమలు ఎప్పటి నుంచి ఉంటుందో స్పష్టత ఇవ్వలేదు. ఇది ఆయా వర్గాలను నిరాశకు గురిచేస్తోంది. బడ్జెట్‌లో సంక్షేమం, రాష్ర్టాభివృద్ధిని విస్మరించింది.

- రాంభూపాల్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి, అనంతపురం

నిధులు అరకొరే...

జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించలేదు. అరకొర నిధులతోనే సరిపెట్టారు. హంద్రీనీవాకు రూ.2 వేల కోట్లు కేటాయించి ఉంటే బాగుండేది. హెచఎల్సీ ఆధునికీకరణకు నిధులు విడుదల చేయలేదు. కేవలం మరమ్మతుల కోసం కేటాయించారు. అమ్మకు వందనం, ఉచిత బస్సు, అన్నదాతా సుఖీభవ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారో బడ్జెట్‌లో స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం వైఫల్యాలను ప్రస్తావించడంలో చూపిన శ్రద్ధ కరువు జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంపై చూపలేదు.

- జాఫర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి

రైతాంగానికి నిరాశ...

రాష్ట్ర బడ్జెట్‌ రైతాంగాన్ని నిరాశపరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం రూ.20వేలు ఇస్తామని ప్రకటించింది. బడ్జెట్‌లో రూ.14వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించడం దుర్మార్గం. రాయలసీమలో పంటల పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే రూ.20వేలు ఇవ్వాలి. అనంతపురం జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌ చేస్తామని చెప్పడం తప్ప బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులను కేటాయించలేదు. విత్తనాల సబ్సిడీకి తక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. హెచ్చెల్సీ లైనింగ్‌, హంద్రీనీవా కాలువ వెడల్పునకు పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వలేదు.

- చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 12 , 2024 | 12:44 AM