Share News

Devotional : రాములోరి రథానికి నిప్పు

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:21 AM

మండల పరిధిలోని హనకనహాళ్‌ రామాలయ ఉత్సవ రథానికి దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలింటి ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు రూ.19 లక్షలు వెచ్చించి మూడేళ్ల క్రితం రథాన్ని తయారు చేయించి పురాతన రామాలయానికి సమర్పించారు. రథాన్ని భద్రపరిచేందుకు ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో రథాన్ని గ్రామంలో ఊరేగించి, యథాస్థానంలో..

Devotional : రాములోరి రథానికి నిప్పు
Chariot of fire

వర్గపోరే కారణమని నిర్ధారణ

పోలీసుల అదుపులో ముగ్గురు

కణేకల్లు/రాయదుర్గం సెప్టెంబరు 24: మండల పరిధిలోని హనకనహాళ్‌ రామాలయ ఉత్సవ రథానికి దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలింటి ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు రూ.19 లక్షలు వెచ్చించి మూడేళ్ల క్రితం రథాన్ని తయారు చేయించి పురాతన రామాలయానికి సమర్పించారు. రథాన్ని భద్రపరిచేందుకు ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో రథాన్ని గ్రామంలో ఊరేగించి, యథాస్థానంలో


ఉంచుతారు. రథం షెడ్డులో సోమవారం అర్ధరాత్రి మంటలు చెలరేగడాన్ని గ్రామస్థులు గుర్తించారు. రథానికి నిప్పు పెట్టారని కేకలు వేయడంతో అందరూ మేల్కొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. షెడ్డు తాళాలను పగులగొట్టి రథంపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించినట్లు గుర్తించారు. మంటలను ఆర్పేలోగా రథం చక్రాల మధ్య భాగం పాక్షికంగా దహనమైంది.

వైరి వర్గం పనే..?

హనకనహాళ్‌లో శ్రీరామ నవమికి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎద్దుల బండిలో ఊరేగించారు. 2022 మార్చి 10న గ్రామానికి చెందిన ఎర్రిస్వామిరెడ్డి, హనుమంతరెడ్డి, గోపాల్‌రెడ్డి, రామాంజినేయులురెడ్డి రూ.19 లక్షలతో రథాన్ని తయారు చేయించారు. అప్పటి నుంచి సీతారామ, లక్ష్మణ, ఆంజనేయుల ఉత్సవ విగ్రహాలను రథంపైనే ఊరేగిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికే చెందిన కొందరు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. రథాన్ని ఆలయం వద్ద పెట్టవద్దని, సొంత స్థలంలో పెట్టుకోవాలని గతంలో ఎర్రిస్వామిరెడ్డి కుటుంబ సభ్యులకు సూచించారు. కానీ గ్రామస్థుల సహకారంతో ఎర్రిస్వామిరెడ్డి కుటుంబం ఆలయ ఆవరణలోనే షెడ్డు వేసి రథాన్ని అక్కడే ఉంచుతోంది. అక్కసు తట్టుకోలేక రథనానికి నిప్పు పెట్టింది ఎర్రిస్వామిరెడ్డి వైరి వర్గమేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దేవదాయ శాఖ ఈఓ నరసింహరెడ్డి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, రాయదుర్గం రూరల్‌ సీఐ వెంకటరమణ, కణేకల్లు ఎస్‌ఐ నాగమధు, ఆర్డీఓ సుస్మితరాణి, తహసీల్దారు ఫణికుమార్‌ గ్రామంలో విచారణ చేపట్టారు.

సీఎం సీరియస్‌

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. బాధ్యులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎస్పీ జగదీష్‌ గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి దర్యాప్తు చేయించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిప్పు పెట్టినవారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

ఈ ఘటనతో కులమతాలకు సంబంధం లేదని, వర్గపోరు కారణంగానే జరిగిందని ఎస్పీ జగదీష్‌ అన్నారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని దేవదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణను సీఎంఓ ఆదేశించిందని, సమాచారాన్ని అందించామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. దోషులను త్వరితగతిన పట్టుకోవాలని, ఈలోగా ఎలాంటి దుష్ప్రచారాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 25 , 2024 | 12:21 AM