108, 104 : అత్యవసర ఆందోళన..!
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:37 AM
ప్రాణాపాయ స్థితిలో ఉండేవారిని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తున్న 108తోపాటు.. గ్రామీణ ప్రజల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న 104 సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు నెలల నుంచి వీరికి వేతనాలు అందడం లేదు. వచ్చేది తక్కువ వేతనం. అదీ నెలనెలా అందడం లేదు. తాజాగా నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ తప్పుకోవడంతో బకాయి వేతనాలు వస్తాయో ...
108, 104 సిబ్బందికి అందని వేతనాలు
మూడు నెలలుగా అప్పు చేసి పప్పుకూడు
నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్న అరబిందో
దిక్కుతోచని స్థితిలో బాధితులు
ప్రభుత్వం ఆదుకోవాలని విన్నపం
అనంతపురం టౌన/ధర్మవరం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రాణాపాయ స్థితిలో ఉండేవారిని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తున్న 108తోపాటు.. గ్రామీణ ప్రజల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న 104 సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు నెలల నుంచి వీరికి వేతనాలు అందడం లేదు. వచ్చేది తక్కువ వేతనం. అదీ నెలనెలా అందడం లేదు. తాజాగా నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ తప్పుకోవడంతో బకాయి వేతనాలు వస్తాయో లేదోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. వేతనాలు రాకపోతే తమకు పూట గడవటం కష్టమౌతుందని, అలాంటిది వినాయకచవితి, దసరా, దీపావళి
పండుగల సమయంలో కూడా వేతనాలు అందలేదని వాపోతున్నారు. కుటుంబ పోషణకు అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వందలాది మంది..
ఉమ్మడి జిల్లాలో 104 వాహనాలు 36 వరకు, 108 వాహనాలు 66 వరకూ ఉన్నాయి. ఒక్కో వాహనానికి ఒక డ్రైవర్, ఒక డీఈఓ ఉన్నారు. 104 వాహనంలో సీనియర్ డ్రైవర్‌కు రూ.24 వేలు, జూనియర్ డ్రైవర్‌కు రూ.16 వేలు వేతనం ఇస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.12 వేలు ఇస్తున్నారు. 108 వాహన డ్రైవర్‌కు రూ.16 వేల నుంచి రూ.26 వేల వరకు వేతనం ఇస్తున్నారు. రిలీవర్లతో కలుపుకుని ఈ రెండు వ్యవస్థల్లో 400 మంది వరకు సిబ్బంది ఉన్నారు.మూడునెలల నుంచి వేతనాలు అందకపోవడంతో కలెక్టర్, డీఎంహెచఓ తదితర ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. కానీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పుకున్న అరబిందో
వైసీపీ ప్రభుత్వ హయాంలో 108, 104 వాహనాల నిర్వహణ బాధ్యతలను అరబిందో సంస్థ చూసేది. ఆ సంస్థపై ఆది నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వారి అక్రమాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఒక్కొక్కటి బయటకు తీస్తోంది. దీంతో కాంట్రాక్టు గడువు ఉండగానే.. నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంది. కూటమి ప్రభుత్వం ఆమోదించింది. దీంతో 108, 104 సిబ్బందిలో ఆందోళన మొదలైంది. బకాయి వేతనాలను అరబిందో ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా తెలియడం లేదని బాధితులు వాపోతున్నారు. నెలనెలా వేతనాలను ఇవ్వకుండా అరబిందో సంస్థ తమను ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు తమను నట్టేట వదిలేసి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తేనే వేతనాలు ఇస్తామని ఆ సంస్థ అంటోందని వాపోతున్నారు. అరబిందో స్థానంలో నిర్వహణ బాధ్యతలను మరొకరికి అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో వేతన బకాయిలపై స్పష్టత ఇవ్వాలని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
అరకొర వేతనాలు..
శ్రీసత్యసాయి జిల్లాలో 104 వాహనాల్లో 74 మంది పనిచేస్తున్నారు. వీరిలో పైలెట్లు (డ్రైవర్లు) 35 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 35 మంది, అదనపు సిబ్బంది నలుగురు ఉన్నారు. ఒక్కో 104 వాహనంలో ఇద్దరు పనిచేస్తున్నారు. నెలలో 26 రోజులు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ పనికి తగ్గ వేతనం అందడం లేదు. పైలెట్లకు రూ.12,900, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.12,500 చెల్లిస్తున్నారు. స్లాబ్ ప్రకారం 2016 నుంచి పనిచేస్తున్న పైలెట్లకు రూ.22 వేలు వేతనం ఇవ్వాలి. కానీ పాత వేతనంతోనే సరిపెడుతున్నారు. జీఓ నంబర్ 7 ప్రకారం ఐదేళ్లగా పనిచేస్తున్న ప్రతి ఔట్సోర్సింగ్ ఉద్యోగికి రూ.18,500 వేతనం ఇవ్వాలి. అమలు కావడం లేదు. 104 వాహనాల నిర్వహణ కూడా గాడి తప్పింది. టైర్లు అరిగిపోయినా పట్టించుకోలేదని, డీజిల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని సిబ్బంది అంటున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం..
108, 104 సిబ్బందికి వేతనాలు అందడం లేదని మాదృష్టికి వచ్చింది. వారికి జీతాలు ఇచ్చే బాధ్యత నిర్వహణ సంస్థదే. వైద్యశాఖ పరిధిలో ఉండదు. సమస్యను కలెక్టరు ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం.
- డాక్టర్ ఈబీ దేవి, అనంతపురం డీఎంహెచఓ
అప్పులు చేసి బతుకుతున్నాం..
మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. వినాయకచవితి, దసరా, దీపావళి పండుగల సమయంలోలైనా ఇస్తారని అనుకున్నాం. కానీ ఇవ్వలేదు. వడ్డీలకు అప్పులు తెచ్చి కుటుంబాలను సాకుతున్నాం. ఇప్పుడు అరబిందో సంస్థ తప్పుకుందని అంటున్నారు. మాకు బకాయి జీతాలు ఎవరిస్తారో అర్థంకావడం లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
- సుబ్రమణ్యం, 104 ఉద్యోగుల సంఘం శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి
సమాన వేతనం ఇవ్వాలి..
రెండున్నరేళ్ల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నాం. సుప్రీం కోర్టు గైడ్లైన్స ప్రకారం సమాన పనికి సమావేతనం ఇవ్వాలి. అదే మా డిమాండ్.
- సాయికుమార్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సీకేపల్లి
పీహెచసీలకు అటాచ చేయాలి..
104 వాహనాల నిర్వహణను పీహెచసీలకు అటాచ చేయా లి. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. కాంట్రాక్టు ఇస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. బకాయి వేతనాలను చెల్లించి మాకు న్యాయం చేయాలి.
- మోహనబాబు, 104 ఉద్యోగుల సంఘం శ్రీసత్యసాయి జిల్లా ప్రధానకార్యదర్శి
మరిన్ని అనంతపురం వార్తల కోసం....